వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పెళ్లిలో కన్యను గంపలో మేనమామయే తెస్తారెందుకు ?

|
Google Oneindia TeluguNews

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష పండితులు. హైదరాబాద్ - ఫోన్ : 9440611151

వెదురు బుట్ట తయారుచేసి దానిలో కొద్దిగా ధాన్యం పోసి ఆ పిల్లని అందులో కూర్చోమని గౌరీ పూజ చేయిస్తారు. బుట్టలో కూర్చుని వివాహ వేదిక మీదకి రావడం కన్నా ముందే గౌరీ పూజ చేసేటప్పుడు బుట్టలో కూర్చుంటుంది. గౌరీ పూజ చేసేటప్పుడు బుట్టలో ఎందుకు కూర్చుంటోంది అంటే అప్పుడు ఆమె ఒకరికి లక్ష్మి అవుతోంది.

అవతలి వారి వద్ద భార్య స్థానాన్ని పొందుతోంది. పత్నీ స్థానాన్ని పొందుతోంది. సనాతన ధర్మంలో ఆమె కామపత్ని కాదు. సహధర్మచారిణి. ఆమె ఉంటే తప్ప ఆయనకి ధర్మం నడవదు. అసలు ఆయనకి అభ్యున్నతి లేదు. ఆయనకు ఉన్నటువంటి లక్ష్మి అంటే కేవలం ఐశ్వర్యం కాదు. ఆయన అభ్యున్నతి అంతా ఎవరిమీద ఆధారపడింది అంటే ఆమె మీదే ఆధారపడింది.

marriage girl in basket astrologer

ఆయన ఒక యజ్ఞం చేయాలి అంటే ఆమె ప్రక్కన ఉండాలి. ఆయన కన్యాదానం చేయాలి అంటే ఆమె ప్రక్కన ఉండాలి. ఆమె లేనినాడు ఆయన ఏమీ చేసుకోలేడు. మరి లక్ష్మియే కదా జీవుడికి! పైగా ఇల్లాలు కాగానే ఐశ్వర్యం ఆయనది కాదు ఆవిడది. ఐశ్వర్యం అంతా ఆమెకి చెందుతుంది. అందుకే ఆయన వృద్ధి కూడా దేనిమీద ఆధారపడుతుంది అంటే భార్య మీద ఆధారపడుతుంది.

ఆమెయే ఆతని లక్ష్మి. అందుకే లక్ష్మి ఉండే అయిదు స్థానాలలో ఒక స్థానం సువాసిని పాపట ప్రారంభ స్థానం. అక్కడ బొట్టు పెట్టుకు తీరాలి. అక్కడ పెట్టుకున్న బొట్టు భర్తకు కలిసి వచ్చేటట్లుగా చేస్తుంది. లక్ష్మీ స్థానం అది. ఆమె లక్ష్మియై నారాయణుడిని చేరుతోంది. లక్ష్మికి ఒక లక్షణం ఉంటుంది. ఆమె 'నిత్యానపాయినీ'. ఆమె ఎన్నడూ విష్ణువును విడిచి పెట్టి ఉండదు.

శ్రీరమ సీత గాఁగ,నిజ సేవక బృందము వీరవైష్ణవా
చారజనంబు గాఁగ, విరజానది గౌతమిగా,వికుంఠము
న్నారయ భద్రశైలశిఖరాగ్రము గాఁగ వసించు చేతనో
ద్దారకుఁడైన విష్ణుఁడవు దాశరథీ!కరుణాపయోనిధీ!

అని గోపరాజు గారు. శ్రీమహా విష్ణువు రామచంద్రమూర్తిగా వస్తే ఆమె సీతమ్మగా వస్తుంది. ఆయన కృష్ణ భగవానునిగా వస్తే ఆమె రుక్మిణీ దేవిగా వస్తుంది. ఆయన ఎక్కడ అవతార స్వీకారం చేస్తే ఆమె ఆయన వెంటే వస్తుంది. ఎన్నడూ విడిచిపెట్టదు. అలాగే ఆ పిల్ల ఇక్కడ పుట్టింది.

ఆడపిల్ల - ఆడ అంటే తెలుగులో అక్కడ. అక్కడికి వెళ్ళిపోయే పిల్ల ఇక్కడ పుట్టింది. ఎక్కడో నారాయణుడు ఉన్నాడు వెతుక్కుని వెళ్ళిపోతుంది. ఇక్కడ లక్ష్మి పుట్టింది. అదృష్టం ఏమిటి? ఆ లక్ష్మిని పెంచి పెద్ద చేస్తున్నాను. ఆ లక్ష్మిని కన్యాదానం చేస్తాను. ఎవరికి? లక్ష్మి ఎప్పుడూ నారాయణునికే చెందుతుంది. అందుకే ఆమె లక్ష్మి గనుక పద్మంలో కూర్చోవాలి.

కాబట్టి వెదురు బుట్ట పద్మానికి సంకేతం. ఎందుకు పద్మంలో కూర్చోవాలి? ఆయనకు లక్ష్మిగా నేను వెళ్ళిన వేళ ఆయనకు కలిసిరావాలి. ఆయన వృద్ధిలోకి రావాలి. ఎన్నో యజ్ఞములు చేయాలి. ఎంతో ధార్మికంగా సంపాదించాలి. ఆయనకి సంతానం కలగాలి. ఆయన సంతోష పడిపోవాలి. ఆయన తండ్రి కావాలి, తాత కావాలి. ముత్తాత కావాలి. ఆయనకు కావలసిన అభ్యున్నతులలో పెద్ద అభ్యున్నతి పితృ ఋణం తీరాలి. తండ్రి ఋణం తాను సంతానాన్ని పొందితే తీరుతుంది.

ఆ సంతానం నానుండి రావాలి. 'ధర్మ ప్రజాపత్యర్థం' ఆయనకు నాయందున్న కామము ధర్మము చేత ముడిపడి నానుండి సంతానం కలగాలి. ఇన్ని లక్ష్ములకు ఆదిలక్ష్మిని నేనే. నడిచి వెళ్ళకూడదు వేదికమీదకి. లక్ష్మి అంటేనే ఐశ్వర్యం. లక్ష్మిగా ఆమె వేదికమీదకి వెళ్తోంది నారాయణ మూర్తిని పొందడానికి. పద్మంలో వెళ్ళాలి. అయ్యా నీ లక్ష్మిని తీసుకువస్తున్నాం.

ఈ ప్రేమ ఎవరిది? మా అక్కచెల్లెళ్ళది. మా అక్క చెల్లెళ్ళు కన్న బిడ్డ అని మేనమామలు పరమ పరవశంతో ఆమెను లక్ష్మిగా బుట్టలో పెట్టి తీసుకుని వెడతారు. తీసుకువెళ్ళి బుట్టలోనే ఎదురుగుండా కూర్చోబెడతారు. ఈమె నీ లక్ష్మి. ఇద్దరూ ఒకటి అయిపోయాక ఇక ఆమె బుట్టలో కూర్చోవక్కరలేదు. నారాయణుడి ప్రక్కన లక్ష్మియే. అందుకు ఒకపీట మీదకి మారిపోతారు ఇద్దరూ. మారేవరకు బుట్టలోనే కూర్చుంటుంది.

బుట్టలో కూర్చోబెట్టడం అనేది కేవలం మౌడ్యమైన విషయం కాదు. ఆయన ప్రక్కకి లక్ష్మి చేరుతోంది ఇప్పుడు సుసంపన్నుడు అవుతున్నాడు. అన్ని విధాలా ఆయన వృద్ధిలోకి వస్తాడు అన్న భావనయే ఆమెని బుట్టలో కూర్చోబెట్టి మేనమామలు తీసుకు వెళ్తారు. మేనమామలు ప్రేమైక మూర్తులు. లక్ష్మిని తీసుకువచ్చారు మా అబ్బాయి కోసం. నా ఇంటికి లక్ష్మి వచ్చింది అంటే నా కోడలు వచ్చింది.

నా కోడలు వస్తే నా ఇంటికి లక్ష్మి వచ్చేసిందని గుర్తు. లక్ష్మీదేవి వచ్చింది నా కొడుకు ఇంకా వృద్ధిలోకి వస్తాడు అని పరవశించి పోయేవాడు మగపిల్లవాడి తండ్రి. అందుకే అయ్యా మీరు ఇంత ఆదరభావంతో పిల్లను తెచ్చారు. లక్ష్మీ దేవిని తెచ్చారు నారాయణుడు అని నా కొడుకుని చూసి. మీరు పదికాలాలు బ్రతకండి అని ఆయుః కారకం కనుక అంచు ఉన్న పంచెల చాపు మేనమామలకి ఇస్తారు.

మేనమామలే ఎందుకు తేవాలి? తెలుగునాట ఒక లక్షణం ఉంది. అక్క చెల్లెళ్ళకి ఆడపిల్ల పుడితే ఒరేయ్ నీకు భార్య పుట్టింది అంటారు. ఎన్నడూ నేను నా మేనకోడలిని ఆ దృష్టితో చూడలేదు. ఆమెను లక్ష్మిగానే చూశాను. నారాయణుడిని చేరుతుంది అనుకున్నాను. భర్తృ భావనతో చూడలేదు. పవిత్రభావంతో ఏ లక్ష్మిగా చూశానో ఆ లక్ష్మిగా నారాయణుడి దగ్గరికి తెచ్చాను అని తెస్తాడు.

అది మేనమామ పవిత్ర హృదయానికి ఆవిష్కారం. అందుకే పెళ్ళి కూతుర్ని బుట్టలో తేవడం మేనమామలు తెస్తే పెళ్ళి అయిపోయాక? నిజంగా వాళ్ళు ఐశ్వర్యవంతులు కాకపోయినా ఆమెని నడిపించి కానీ, ఇంకొకలా కానీ వెళ్ళకుండా ఊర్లో ఐశ్వర్యవంతులు ఎవరో వాళ్ళు తమ వాహనం ఇచ్చి పంపించాలి. అధవా ఎద్దులబండిలో తీసుకు వెళ్తారు. వాహనంలో వెళ్ళాలి తప్ప నడిచి వెళ్ళకూడదు. ఆడపిల్లని అంత పెద్ద ఎత్తు గౌరవించి లక్ష్మిగా ఆహ్వానించినటువంటి జాతి మన జాతి.

English summary
The bamboo basket is made of gauze puja to make a little grain in it and sit in it. Sitting in the basket while sitting in the basket and making gowri puja before coming to the wedding stage. Why is Gowri sitting in the basket while doing pooja, then she becomes Lakshmi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X