వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సూర్యభగవానుని పూజించే పండగ రథసప్తమి

|
Google Oneindia TeluguNews

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151

రథసప్తమి అంటే సూర్యభగవానుని పూజించే పండగ. మాఘమాస శుక్ల పక్ష సప్తమి నాడు ఈ పర్వదినాన్ని ఘనంగా నిర్వహించుకుంటారు. రథసప్తమి మహా తేజం. మన ఆథ్యాత్మిక గ్రంథాల ప్రకారం మొత్తం ద్వాదశ ఆదిత్యులు అనగా పన్నేండుగురు సూర్యులు.

సంవత్సరంలో ఒక్కో నెలకు ఒక్కో సూర్యుడు ప్రాధాన్యత వహిస్తాడు.

Rathasaptami is a festival dedicated to the worship of the Sun God

1. చైత్ర మాసంలో వచ్చే సూర్యుడి పేరు 'ధాత'

2. వైశాఖం - అర్యముడు,

3. జ్యేష్టం - మిత్రుడు,

4. ఆషాఢం - వరుణుడు,

5. శ్రావణం - ఇంద్రుడు,

6. భాద్రపదం - వివస్వంతుడు,

7. ఆశ్వయుజం - త్వష్ణ,

8. కార్తీకం - విష్ణువు,

9. మార్గశిరం - అంశుమంతుడు,

10. పుష్యం - భగుడు,

11. మాఘం - పూషుడు,

12. ఫాల్గుణం - పర్జజన్యుడు.

ఆ నెలల్లో సూర్యుడి తీక్షణతను బట్టి ఆ పేర్లు వచ్చాయని చెబుతారు. భూమి నుంచి 14.98 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్న సూర్యుని కిరణాల ప్రయాణ వేగం ఒక సెకనుకు 3 లక్షల కిలోమీటర్లు. అవి భూమిని చేరడానికి పట్టే కాలాన్ని 8 నిమిషాలుగా అంచనా కట్టారు ఖగోళ శాస్త్రవేత్తలు. పురాణ కధనం ప్రకారం బాల్యంలో హనుమంతుడు సూర్యుడిని ఎర్రని తినేపండు అనుకుని తిందామనే ఉద్దేశంతో అక్కడికి ఎగిరి వెళ్లాడట. అందుకోసం హనుమ వెళ్లిన దూరాన్ని 'యుగ సహస్ర యోజన పరాభాను' అని తులసీదాస్‌ హనుమాన్‌ చాలీసాలో చెబుతారు.

దీన్ని లెక్క కడితే 'యుగం.. 12000 ఏళ్లు, సహస్రం 1000, యోజనం 8 మైళ్లు, మైలు 1.6 కిలోమీటర్లు కలిపి దాదాపు 15 కోట్ల కిలోమీటర్లు. ఇది ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్న 14.98 కోట్ల కిలోమీటర్లకు దాదాపు సరిపోతుంది.సూర్యకాంతి ఏడు వర్ణాల కలయిక అని వైజ్ఞానికులు చెబుతుంటే ఆయన ఏడు గుర్రాలున్న రథం మీద లోక సంచారం చేస్తాడని వేదవాజ్మయం చెబుతోంది.

ఆ ఏడు గుర్రాల పేర్లు
1. గాయత్రి,
2. త్రిష్ణుప్పు,
3. అనుష్టుప్పు,
4. జగతి,
5. పంక్తి,
6. బృహతి,
7. ఉష్ణిక్కు

వీటి రూపాలు సప్త వర్ణాలకు సరి పోలుతాయి.

రామ రావణ యుద్ధం సమయంలో అలసిపోయిన శ్రీరాముడికి అగస్త్య మహాముని 'ఆదిత్య హృదయం' ఉపదేశించినట్లు రామాయణంలో ఉంది.

ఇందులో 30 శ్లోకాలున్నాయి. వీటి స్మరణ వల్ల శారీరక, మానసిక ఆరోగ్యం బాగుంటుందని చెబుతారు.

సూర్యుడి రథానికి ఉన్న ఇరుసు పగలు, రాత్రికి ప్రతీక అని, చక్రాలకున్న ఆరు ఆకులు రుతువులకు, ధ్వజం ధర్మానికి ప్రతీకలని పురాణాల్లో ఉంది. అందుకే సూర్యుడి జన్మదినాన్ని ఆయన పేరుతో కాకుండా రథ సప్తమి అని పిలుస్తారు. ఈ రోజు నుండి ఆదిత్యుని శక్తి భూమికి పుష్కలంగా లభిస్తుంది. సర్వదేవతామయుడైన ఆదిత్యుని ఆరాధించడం చేత తేజస్సు, ఐశ్వర్యం, ఆరోగ్యం సమృద్ధిగా లభిస్తాయి.

ఈ రోజు సూర్యోదయ స్నానంతో సప్త జన్మల పాపాలు నశించి, రోగము, శోకము వంటి ఇబ్బందులు తొలగుతాయి. ఈ రోజున స్నానం చేసేటప్పుడు సూర్యనారాయణుని మనసారా ధ్యానించి తలపై జిల్లేడాకులు, రేగాకులు పెట్టుకొని స్నానం చేయాలి అని ధర్మశాస్త్రం చెబుతుంది. జిల్లేడు ఆకునకు అర్కపత్రమని పేరు. సూర్యునికి "అర్కః" అని పేరు. అందువలన సూర్యునికి జిల్లేడు అంటే ఎంతో ఇష్టం. ఏడు జిల్లేడు ఆకులు సప్తాశ్వములకు చిహ్నం మాత్రమే గాక ఏడు జన్మల్లో చేసిన పాపములను, ఏడు రకములైన వ్యాధులను నశింపజేస్తాయి. ఈ రోజు ఉపవాసముండి సూర్య సంబంధమగు రథోత్సవాది కార్యక్రమములలో కాలక్షేపం చేయాలి. ఇట్లు రథసప్తమీ వ్రతముచే సూర్యభగవానుని అనుగ్రహముచే ఆయురారోగ్యాది సకల సంపదలు పొందుతారని పురాణ ప్రబోధము.

ఈ రోజున స్నానం చేసేటప్పుడు చదువ వలసిన శ్లోకాలు:-

నమస్తే రుద్ర రూపాయ రసానాం పతయే నమః

అరుణాయ నమస్తేస్తు హరివాస నమోస్తుతే!!

యద్యజ్జన్మ కృతం పాపం మయా జన్మసు సప్తసు!

తన్మే రోగంచ శోకంచ మాకరీ హంతు సప్తమీ!!

ఏతజ్జన్మ కృతం పాపం యజ్జన్మాంత రార్జితమ్!

మనో వాక్కాయజం యచ్చ జ్ఞాతాజ్ఞాతే చ యే పునః!!

ఇతి సప్త విధం పాపం స్నానాన్మే సప్త సప్తికే!

సప్త వ్యాధి సమాయుక్తం హరమాకరి సప్తమీ!!

పూజ విదానం:- చందనంతో అష్టదళ పద్మాన్ని లిఖించి, ఒక్కొక్క దళం చొప్పున రవి, భాను, వివస్వత, భాస్కర, సవిత, అర్క, సహస్రకిరణ, సర్వాత్మక - అనే నామాలు గల సూర్యుణ్ణి భావించి పూజించాలి. ఎర్ర చందనం, ఎర్రని పువ్వులతో సూర్యుని అర్చించడం విశిష్టమైనది. ఆవు పేడతో చేసిన పిడకలను కాల్చి ఈ వేడిలో క్షీరాన్నాన్ని వండి సూర్యునికి నివేదించాలి. ఆ క్షీరాన్నాన్ని చెరుకు ముక్కలతో కలుపుతూ ఉండాలి. దానిని చిక్కుడు ఆకులలో వడ్డించి నివేదిస్తారు. చిక్కుడు, జిల్లేడు, రేగు - పత్రాలలో సౌరశక్తి విశేషంగా నిక్షిప్తమై ఉంటుంది.

జిల్లేడు, రేగు, దూర్వాలు, ఆక్షతలు, చందనాలు కలిపిన నీటితోగాని, పాలతో గాని, రాగిపాత్ర ద్వారా అర్ఘ్యమివ్వడం మంచిది. మనం చేసే పూజలు, వ్రతాలు అన్ని పుణ్యసంపాదన కొరకే. శివ కేశవులకు ఇరువురికి మాఘమాసం ప్రీతికరమైనది. ఈ రోజు నుండి వేసవి ప్రారంభమైనట్లే! ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ - ఆరోగ్య ప్రదాతగా శ్రీ సూర్యదేవుని చెప్తారు. ఈ మహా పర్వదినాన ఆ సూర్య భగవానుని భక్తీ శ్రద్ధ లతో పూజించి పూర్తి ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని పొందుదాం.

చదుకొవలిసిన స్తోత్రాలు:-
ఆదిత్యహృదయం, సూర్య స్తోత్రం, నవగ్రహ స్తోత్రం తప్పక పారాయణ చేయడం సకల శ్రేయోదయకమని గురు వాక్యం. మాఘ శుద్ద షష్టి నాడు నూరిన నువ్వుల ముద్దతో శరీరానికి నలుగు పెట్టుకుని అందుబాటులో ఉన్న నది, చెరువు దగ్గర స్నానం చేయాలి. ఈ రోజు అంటే మాఘ శుద్ధ షష్టి రోజున ఉపవాసం ఉండి సూర్య ఆలయానికి వెళ్ళి పూజ చేయాలి. ఆ మర్నాడు అంటే సప్తమి తిధిన సూర్యోదయానికి ముందే మాఘ స్నానం చేయాలి.

సూర్యుడు మకరంలో ఉండగా వచ్చే ఈ దివ్య సప్తమి నాడు సూర్యుని నమస్కరించి పై శ్లోకాలు చదివి స్నానం చేస్తే సమస్త వ్యాధులు, ఇబ్బందులు తొలగుతాయని శాస్త్రవచనం. 1.ఈ జన్మలో చేసిన 2. గత జన్మలో చేసిన 3. మనస్సుతో 4. మాటతో 5. శరీరంతో 6. తెలిసీ 7. తెలియక చేసిన సప్తవిధాలైన పాపాలను పోగొట్టేశక్తి ఈ రథసప్తమికి ఉన్నది.

ఈ రోజున తల్లిదండ్రులు లేని వారు వారికి తర్పణం విడుస్తారు. ఈ రోజు ఆకాశం లో నక్షత్ర కూటమి రధం ఆకారంలో ఉంటుంది.

రోగ నివారణ /సంతాన ప్రాప్తి కోసం - రధ సప్తమి వ్రత విధానం :- స్నానాతరం పొడి బట్టలు మార్చుకుని పూజ చేయాలి. అష్టదల పద్మం ముగ్గు ( బియ్యం పిండితో ) వేసి అందులో సూర్య నామాలు చెప్తూ 7 రంగులు నింపాలి. అష్ట దళ పద్మ మధ్యలో శివ పార్వతులను పెట్టి పక్కనే ఒక కొత్త తెల్లని వస్త్రం పరిచి దానిమీద సూర్యుడు రధాని ( 7 గుర్రాలు ) నడుపుతున్న బంగారు ప్రతిమ లేదా బంగారు రథమును అచ్చు చేయించి కుంకుమాదులు దీపములతో అలంకరించి అందు ఎర్రని రంగుగల పువ్వులు సూర్యుని ప్రతిమ నుంచి సూర్యుడికి పూజ చేయాలి.

సంకల్పం చెప్పుకోవాలి ఎవరి రోగ నివారణ కోసం చేస్తున్నామో లేదా ఎవరికీ సంతానం కలగాలని చేస్తున్నామో వారి పేరు గోత్రనామలు చెప్పుకొని పూజ చేసి ఈ బంగారు ప్రతిమను ఒక గురువునకు దానం ఇవ్వాలి. తరువాత ప్రతి నెల సప్తమి రోజు సూర్య భగవానుడికి నమస్కరించి సంకల్పం చెప్పుకుని ఉపవాసం ఉండాలి. ఈ సంవత్సర కాలం నియమంగా నిష్టగా ఉండాలి. సూర్య భగవానుడికి అర్ఘ్యం ఇవాలి ఇలా శక్తి ఆసక్తి కలిగిన వారు చేసినచో వారికి సూర్యభగవానుడి అనుగ్రహం కలుగుతుంది.

English summary
Rathasaptami is a festival dedicated to the worship of the Sun God
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X