ప్రకృతి ఆరాధన మహోత్సవం: పెంచుకున్న ప్రేమను భక్తి శ్రద్ధలతో భర్తగా పొందిన వైనం
డా.యం.ఎన్.చార్య- శ్రీమన్నారాయణ ఉపాసకులు ,ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష పండితులు -9440611151
జ్ఞాననిధి , జ్యోతిష అభిజ్ఞ , జ్యోతిష మూహూర్త సార్వభౌమ"ఉగాది స్వర్ణ కంకణ సన్మాన పురస్కార గ్రహీత"
ఎం.ఏ జ్యోతిషం - పి.హెచ్.డి "గోల్డ్ మెడల్" ,ఎం.ఏ తెలుగు (ఏల్) , ఎం. ఏ సంస్కృతం , ఎం.ఏ యోగా ,
యోగాలో అసిస్టెంట్ ప్రోఫెసర్ శిక్షణ ,ఎం.మెక్ ఎపిపి, పి.జి.డిప్లమా ఇన్ మెడికల్ ఆస్ట్రాలజి (జ్యోతిర్ వైద్యం) ,
పి.జి.డిప్లమా ఇన్ జ్యోతిషం, వాస్తు , మరియు రత్న శాస్త్ర నిపుణులు.
సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక-హైదరాబాద్.
16 డిసెంబరు 2018 నుండి ధనుస్సంక్రాంతి ధనుర్మాసం ప్రారంభం అయినది. ఈ మాసాన్ని ఖగోళ శాస్త్ర పరంగా పరిశీలించి చూస్తే ఈ నెలలో చంద్రుడు పౌర్ణమి రోజునాడు మృగశిర నక్షతములో ఉంటాడు.సౌరమాన ప్రకారంగా సూర్యుడు ధనుస్సురాశిలో ప్రవేశించిన రోజు నుండి మకరరాశిలోకి ప్రవేశించు వరకు గల మధ్య రోజులను అనగా సంక్రాంతికి ముందు ముప్పది రోజులను ధనుర్మాసమని అంటారు.
ఈ నెల రోజులపాటు బాలికలు,మహిళలు తమ ఇళ్ల ముందు ప్రతి రోజూ అందమైన సంక్రాతి ముగ్గులు వేసి ఆవుపేడతో గొబ్బెమ్మలు చేసి ఆ ముగ్గుల మధ్యలో పెట్టి గొబ్బెమ్మల రూపంలో లక్ష్మీదేవి రూపంగా పూలతో,పసుపు కుంకుమలతో అమ్మవారిని పూజిస్తారు. చివరి రోజు రథం ముగ్గు వేసి అమ్మ వారిని ఊరిగేస్తున్నట్లుగా భావించుకుని ఇంటి ముందు రధం ముగ్గు తాడును ప్రక్క ఇంటి వారు వేసిన రధం ముగ్గునకు కలిపి ఒక వరుసలో రథయాత్ర చేస్తారు.

పురాణాలలోను,ఆయుర్వేద శాస్త్రములలో చెప్పినట్లు ఈ నెలలో రాత్రి సమయం ఎక్కువగా ఉండి పగలు తక్కువగా ఉండును.అందుచేతనే పులగము,దధ్యోజనము గాని దేవునుకి నివేదించి తినాలని నియమాన్ని పెట్టారు." మాసానాం మార్గశీర్షోsహం " అని శ్రీకృష్ణుడు భగవద్గీతలో అంటాడు.ఈ నెల శ్రీమహా విష్ణువునకు ప్రీతి కరమైనది.దేహంలో తల ఏంత ముఖ్యమైనదో మాసాలలో ఈ మాసం అంత పవిత్రమైనది అని అర్ధం.వైష్ణవ దేవాలయములలో ఈ నెల రోజులపాటు ప్రత్యేకమైన కార్యక్రమాలను నిర్వహిస్తారు.
" శ్రీ ఆండాళ్ పాశురాలు " చదువుతారు .బ్రాహ్మీ ముహూర్తాన స్వామి వారికి పూజలు నిర్వహించి "కట్టు పొంగలి" స్వామి వారికి నివేదన చేసిన తర్వాత భక్తులకు ప్రసాదములు పంచిపెడతారు.ఈ మాసములో రకరకాల ప్రసాదాలు చేసి భక్తప్రజానికానికి ప్రసాద రూపంలో పౌష్టికాహారం అంద చేయటం జరుగుతుంది.
ప్రతి సంవత్సరం మార్గశిర మాసం నుండి పుష్యమాసము వరకుచలి చాల ఎక్కువగా ఉంటుంది.చలికాలంలో మన శరీరంలో రక్తంలో మార్పిడి జరుగుతుంది.అందువలన ఆ సమయంలో శరీరానికి పుష్టినిచ్ఛే ఆహారము సామాన్యులకు అందజేయటానికి మన ఋషులు చేసిన ఏర్పాటు ఇది.
విష్ణుచిత్తుడి ఏకైక గారాల పుత్రిక గోదాదేవి.తను మంచి సౌందర్యరాశి. తన తండ్రి ఆజ్ఞమేరకు దేవుని కొరకు ప్రతిరోజు తోటలోని పూలను కోసి అందంగా పూలమాలలను కట్టి ఆ మాలను తాను ధరించి అద్దంలో తనప్రతి బింబమును చూసుకొని మురిసిపోయి తన్మయత్వం చెంది ఆ తర్వతనే ఆమాలలను పదిలంగా తండ్రి కిచ్చేది. ఈ విషయము తెలియని తండ్రి మహా భక్తుడు శ్రీ రంగనాథ స్వామి వారికి అలంకరణ కొరకు తను గుడిలో అప్పగించే వాడు.ఆ మాలను అర్చకులు స్వామి వారికి అలంకరింపజేసేవారు.
ఇదే విధంగా ప్రతి రోజూ జరుగసాగింది.రోజులు గడిచిన కొద్ది గోదాదేవికి దేవునిపై రోజు రోజుకూ ప్రేమ ఏర్పడి ఆ దేవుడే తన భర్తగా ఊహించుకొనేది.చివరకు ఆనంత శయనుడైన శ్రీ రంగనాథ స్వామినే ఏదిఎమైనా పెళ్ళి చేసుకోవాలని త్రికరణ శుద్ధిగా నిర్ణయించుకుంది.రోజు తను అనుకున్న విధంగానే మాలలను తయారు చేసి మొదట తాను ధరించి తన ప్రక్కనే రంగనాధస్వామి దేవుడు ( తన ప్రియుడు ) ఉన్నట్లుగా భావించి మురిసిపోయెది.
ఇది ఇలా ఉండగా ఒకరోజు పూజార్లు ఆమాలలను అలంకరించు సమయంలో మాలలో దాగిఉన్న ఒక పొడవాటి వెంట్రుకను ఉన్నట్టు గమనించారు.అది స్త్రీ వెంట్రుకని తెలుసుకున్నారు.రోజు మాలలను తెచ్చె విష్ణుచిత్తుడిని కోపంతో తిట్టారు. ఆ సంఘటనకు విష్ణుచిత్తుడు ఏంతో బాధపడి ఇంటికివెల్లే సరికి అక్కడ తనకూతురు గోదాదేవి సుగంధ పరిమలాలు వెదజల్లే పూలతో అల్లిన అందమైన మాలలను తన జడలో అలంకరించుకుని స్వామి వారితో మాట్లాడుతున్న కూతురుని చూసి పట్టరాని ఆగ్రహముతో పక్కనే ఉన్నకత్తితో చంపబోగా గోదాదేవి తన ప్రేమ వృత్తాంతమును తండ్రికి తెలియజేసింది.
తండి తన కూతురు మాటలు నమ్మక అబద్దమాడుతున్నదని భావించి ఆమెను చంపబోగా అదృశ్యరూపుడుగా ఉన్న స్వామి ప్రత్యక్షమై శాంతింప జేసి జరిగిన విషయం తెలియజేసాడు.తన భక్తురాలైన గోదాదేవి ధరించిన మాలలే తనకు అత్యంత ఇష్టమని చెప్పి తన భక్తితో నన్నే తన భర్తగా కావాలని కోరుకుంది,నన్ను తననియమ నిష్టలతో వ్రతం చేసి మెప్పించింది అని చెప్పి అందరి సమక్షములో శ్రీ రంగనాథస్వామి గోదాదేవిని పెళ్ళిచేసుకున్నాడు.దివిలోని దేవున్ని భువిలోని మానవ స్త్రీ తాను అనుకున్న విధంగా సాధించి తరించినందులకు,భక్తితో దేవున్నే తన స్వంతం చేసుకున్న గోదాదేవిని అందరూ కొనియాడారు.
మానవ స్త్రీ సాక్షత్తు దేవున్ని తన భక్తి శ్రద్ధలతో మెప్పించి చివరకు వివాహం ఆడేవరకు వదలలేదు. నిష్ట కలిగిన భక్తికి భవవంతుడు తన్మయుడవుతాడు అనడానికి ఈ వృత్తాంతం మనకు చాలు. నాటి నుండి గోదాదేవిని ఆండాళ్ గా పిలువబడసాగింది.ఆండాళ్ స్వామి వారిని కీర్తించిన కీర్తనలే పాశురాలు.
విజయనగర సార్వభౌముడైన శ్రీ కృష్ణ దేవరాయలు"ఆముక్త మాల్యద"అను పేరున"విష్ణు చిత్తియం అనిగూడ అందురు"గ్రంధ రచన చేసెను .ఆముక్త మాల్యద అనగా ' ధరించి తీసి వేసిన మాల 'అని అర్థము.
ఈ నెలలోనే వైకుంఠ ఏకాదశి "ముక్కోటి ఏకాదశి" వచ్చును.ఆరోజు బ్రాహ్మీ ముహూర్తం నందు అందరూ ఉత్తర ద్వార దర్శనమున స్వామి వారిని తులసి మాలల అలంకరణతో దర్శించి తరించెదరు.
ఈ నెల రోజులులు వైష్ణవ దేవాలయాలు కళకళలాడుతూ కనిపిస్తాయి.ఉదయం ,సాయంత్ర సమయాలలో స్త్రీలు,ముత్తైదువలు తులసికోటను అందంగా అలంకరించుకును దీపారాదన చేసి చుట్టు ప్రదక్షిణలు చేయుట వలన మనోవాంచలు నెరవేరుతాయని పెద్దలు చెబుతారు,ఇది ప్రకృతి ఆరాధన
మహోత్సవం. జై శ్రీమన్నారాయణ.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!