• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

మహిమాన్వితమైన కార్తీక మాసం.. కార్తీకమాసం అంటే ఏమిటి..?

|

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151

"శివాయ విష్ణు రూపాయ శివ రూపాయ విష్ణవే

శివస్య హృదయం విష్ణో విష్ణోశ్చ హృదయం శివః"

అంటే శివుడి యొక్క రూపం విష్ణువు, విష్ణువు యొక్క రూపం శివుడు. శివుడి యొక్క హృదయంలో విష్ణువు. విష్ణువు యొక్క హృదయంలో శివుడు ఉంటారు. అని వేదం చెబుతుంది. భగవంతుడు ఒక్కడే కానీ అయన రూపాలు అనేకం గ్రహించాలి.

"చేతులారంగ శివుని బూజింపడేని నోరు నొవ్వంగ హరి కీర్తి నుడువడేని,

దయయు సత్యంబు లోనుగా దలపడేని గలుగ నేటికి దల్లుల కడుపు జేటు"

శివకేశవుల అద్వైతాన్ని- అభేద స్వరూపాన్ని అందమైన తెనుగు నుడికారంతో సులభసుందరంగా తేటపరిచే హృద్యపరిచే ఈ తేటగీతి పద్యం, ఈ సుధామయ సూక్తి, పోతన మహాకవి స్వీయస్ఫూర్తి. 'ఈ తెలుగు పద్యం నోటికి రానివాడు ఆంధ్ర భారతీయుడు కాడు. దానంతటదే నోటికి వచ్చే పద్యమిది. రాకుండా ఎలా ఉంటుంది నోటికి తాళం వేసుకుంటే తప్ప' అని కవి సమ్రాట్‌ వివ్వనాథ వారు సున్నితంగా సుత్తితో కొట్టారు.

This is a glorious month of Karthikamasam according to Hindu calendar

తెలుగు సంవత్సరాలలో ఎనిమిదో నెల కార్తీకమాసం. చంద్రుడు కృత్తికా నక్షత్రంతో కలిసిన రోజు కార్తీకం. కార్తీక మాసం సదాశివుడు, మహావిష్ణువు పూజలకు చాలా పవిత్రమైనది. ఈ మాసం వివిధ వ్రతాలకు శుభప్రదమైంది. ధార్మిక యోచనలున్న వారు ఈ మాసంలో ఏకభుక్తం, నిరాహారాది వ్రతాలు చేస్తారు. సాయంత్రాలు దేవాలయాలు, తులసి కోట దగ్గర దీపాలు వెలిగిస్తారు. దీపదానాలు చేయలేనివారు, దీపాలు వెలిగించినా దీపదానం అంత ఫలితం లభిస్తుంది.

శివ,కేశవులకు అత్యంత ప్రీతికరమైనది కార్తీకమాసం అని చెపుతారు పెద్దలు. ప్రతిఏటా దీపావళి వెళ్లిన మర్నాటి నుంచి కార్తీక మాసం ప్రారంభం అవుతుంది. అత్యంత మహిమాన్విత మైన కార్తీక మాసంలో భక్తులు నియమ నిష్టలతో చేసే నోములు, వ్రతాలకు ఎంతో ప్రాధాన్యం ఉంది. ఈ నెల రోజులు శైవ క్షేత్రాలు భక్తుల శివనామ స్మరణతో మారు మోగిపోతాయి. శివ,పార్వతుల అనుగ్రహం కోసం భక్తులు విశేష పూజలు చేస్తారు.

స్కంద పురాణంలో కార్తీకమాసం గురించి "నకార్తీకే సమో మాసం.. న కృతేన సమం యుగం.. నవేద సద్రసం శాస్త్రమ్‌.. నతీర్థ గంగాయ సమం..." అని పేర్కొన్నారు. యుగాలలో కృతయుగంతో సమానమైన యుగం, వేదాలకు సమానమైన శాస్త్రం, గంగకు సమానమైనటువంటి నది లేనట్టే మాసాల్లో కార్తీక మాసానికి సమానమైనదేదీ లేదని పెద్దల మాట. దీనిని బట్టి కార్తీక మాస విశిష్టత ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. శివకేశవులకు ప్రీతిపాత్రమై ఈ మాసంలో చేసే పూజలు, నోములు వ్రతాల వల్ల జన్మజన్మాంతర పాపాలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం.

కార్తీక మాసంలో ఉభయ పక్షాలలో అనేక వ్రతాలు చేస్తారు. అయ్యప్ప దీక్ష ఈ నెలలో ప్రారంభమై మకర సంక్రాంతి వరకు కొనసాగుతుంది. పూర్ణచంద్రుడు ఏ నక్షత్రంలో ఉంటాడో ఆ నక్షత్రం పేరు ఆ మాసానికి వస్తుంది. కృత్తికా నక్షత్రంలో పూర్ణచంద్రుడు సంచరించటం వలన ఈ మాసానికి కార్తీక మాసమని పేరు. ఈ మాసంలో దేశం నలుమూలల్లో ఉన్న శివాలయాల్లో రుద్రాభిషేకాలు, లక్ష బిల్వార్చనలు, రుద్రపూజలు విశేషంగా జరుపుతారు. విశేషార్చనలు జరిపే భక్తులకు సదాశివుడు ప్రసన్నుడై వారి అభీష్టాలు తీరుస్తాడని ప్రతీతి. అందుకే ఆ స్వామికి 'అశుతోషుడు అని పేరు వచ్చింది.

అభిషేక ప్రియుడైన శివుడికి అలంకారాలతో, రాజోపరాచాలతో, నైవేద్యాలతో పనిలేదు. భక్తితో శివుడిని ధ్యానిస్తూ అభిషేకం చేస్తే ఆ దేవదేవుడు ప్రీతి చెందుతాడు. శివాభిషేకం అన్ని దోషాలను పోగొట్టి సకల శుభాలను కలుగచేస్తుంది. కార్తీకంలో శివార్చన చేసిన వారికి గ్రహదోషాలు, ఈతిబాధలు ఉండవు. శివునికి శ్రీవృక్ష పత్రములతో (బిల్వదళములు) పూజిస్తే స్వర్గలోకంలో లక్ష సంవత్సరాలు జీవించవచ్చునంటారు. పరమేశ్వరుడు ఎడమభాగాన పార్వతి, కుడి భాగాన పరమేశ్వర రూపంతో అర్ధనారీశ్వరుడిగా దర్శనమిచ్చే సమయాన్ని ప్రదోషకాలమంటారు. ప్రదోషకాలంలో శివారాధన, శివదర్శనం చేసుకుంటే శివుని అనుగ్రహనికి పాత్రులవుతారు.

శివాలయాలలో ప్రార్థన, లింగార్చన, మహాలింగార్చన, సహస్ర లింగార్చన ఉత్తమోత్తమైన అర్చన. ఈ మాసంలో తులసి దళాలతో శ్రీమహావిష్ణువును పూజిస్తే ముక్తిదాయకం అని శాస్త్రం చెపుతున్నది. ఈ మాసంలో విష్ణువు దామోదర నామంతో పిలువబడతాడు. 'కార్తీక దామోదర ప్రీత్యర్థం అని ఈ మాసాన వ్రత దీక్ష ఆచరించాలి. సత్యనారాయణ స్వామి వ్రతం, విష్ణు సహస్రనామ పారాయణ, రుద్రాభిషేకాలు చేయడం శ్రేష్టం. శివానుగ్రహానికి, విష్ణువు అనుగ్రహానికి ఈ మాసం ఉత్కృష్టమైంది. కార్తీకమాసంలో ఏ మంత్ర దీక్ష చేసినా మంచి ఫలితాలనిస్తుంది.

కార్తీకపురాణం రోజుకో అధ్యాయం పారాయణ చేయవచ్చు. సూర్యోదయానికి పూర్వమే నదీస్నానం అత్యంత ఫలప్రదం. కార్తీక పురాణంలో మొదటి 15 అధ్యాయాలు ఈశ్వరుని ప్రాముఖ్యతను తెలియజేస్తే.. ఆఖరి 15 శ్రీహరి ప్రాధాన్యతను తెలియజేస్తున్నాయి.

కార్తీక నదీస్నానం విషయంలో ఆరోగ్య సూత్రం ఇమిడి ఉంది. నదీ జలాలు కొండలలోను, కోనలలోను, చెట్లు, పుట్టలను తాకుతూ ప్రవహిస్తాయి. అలా ప్రవహించడం వల్ల ఎన్నో వనమూలికల రసం నదీ జలాలలో కలుస్తుంది. మహిళలు వేకువఝూమునే స్నానం చేసి తులసికోట ముందు దీపారాధ చేసి గౌరీదేవిని పూజిస్తే ఈశ్వరానుగ్రహంతో పాటు సౌభాగ్యాన్ని, సకల శుభాలను పొందుతారు. మాసమంతా స్నాన విధిని పాటించలేనివారు పుణ్య తిథులలోనైన స్నానం ఆచరించాలి.

కార్తీక మాసం ఆరంభం నుండే 'ఆకాశదీపం ప్రారంభమవుతుంది. ఉదయం, సాయంత్రం ఆలయాలు, పూజామందిరాలు, తులసి కోట వద్ద దీపారాధన చేస్తే ఇహ, పర సౌఖ్యాలు కలుగచేస్తుంది. ఈ మాసంలో ప్రతి సోమవారంతో పాటు ....ఉత్థానైకాదశి, కార్తీక శుద్ధ ద్వాదశి, కార్తీక పౌర్ణమి వంటి దినాలు ప్రశస్తమైనవి. ఈ మాసానికి కౌముది మాసం అని మరో పేరు కూడా ఉంది.

ఈ మాసంలో దీపాలను రెండు రకాలుగా పిలుస్తారు. ఒకటి కార్తీక దీపం, రెండోది ఆకాశ దీపం. సాయంకాల సమయంలో ఇంటి వాకిట్లో వెలిగించేది ఆకాశ దీపం. కార్తీక దీపంలో రెండు వత్తులు కలిపి రెండు రెండుగా వేయడం లేదా మూడు వత్తులు కలిపి వేయడం విశేషం. ఎన్ని వత్తులు వేయాలనేది వారి గురువుల సలహా మేరకు భక్తులు ఆచరిస్తూ ఉంటారు. ఇందుకు పత్తి, తామర నార, అరటి నార వంటి వాటిని ఉపయోగిస్తారు. కార్తీకంలో దీప దానానికి ఒక విశిష్టత ఉన్నది. ఈ మాసంలో ఒకసారి దీప దానం చేసిన వారికి సంవత్సరమంతా చేసిన ఫలితం దక్కుతుంది.

అందుకే కార్తీకమాసంలో నెలంతా దీపదానాలు చేస్తుంటారు. ఆరోగ్యం భాస్కరాధిచ్ఛేత్‌ ఆదిత్య హృదయం వంటి స్తోత్రాలు పారాయణ చేయడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు. ఇక అన్ని దేవతలకి ప్రతీయకయైన గోవుని దూడతో కలిసి పూజిస్తారు. గోవును పూజించలేనివారు శక్తికొలది గోవుకు గ్రాసాన్ని ఇస్తారు. ఆవులను సేవించడం వల్ల వంశవృద్ది జరుగుతుంది. ఈ నెలలో తులసికి పూజచేయడం, తులసి కళ్యాణం విశేషంగా చెపుతారు. మాఘేవా, మాధవేమాసిం కార్తీకేవా శుభేదినే అని సత్యనారయణ స్వామి వ్రతకథలో ఉంటుంది.

మాఘమాసంలో గానీ, చైత్ర మాసంలో గాని, కార్తీక మాసంలో గాని ఒక శుభదినాన సత్యనారాయణ వ్రతము ఆచరించాలి. ఈ మాసంలో సత్యనారాణస్వామిని ప్రధానంగా ఆచరించడానికి కారణం కార్తీక మాసానికి అధిపతి దామోదరుడు. ఈ మాసంలో పౌర్ణమినాడు సత్యనారాయణ వ్రతం ఆచరిండం విశేషం. ఈ మాసంలో ఉసిరికాయలను దీపసహితంగా దానం చేయడం, ఉసిరికాయ మీద వత్తి వెలిగించి దానమివ్వడం చేస్తారు. అన్ని మాసాల్లోకి విశేషమైన కార్తీక మాసాన్ని దైవస్వరూపంగా భావించి ప్రత్యేక పూజలు దానధర్మాలు చేస్తారు.

English summary
Kartikamasam is the eighth month in the Telugu years. Karthika is the day when the moon meets the star Krittika.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X