వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శయన 'తొలి' ఏకాదశి

|
Google Oneindia TeluguNews

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151

చంద్రమానం ప్రకారం పక్షము రోజులలో పదకొండవ తిథి ఏకాదశి. అధి దేవత - శివుడు. ఏ మంచి పని ప్రారంభించినా దశమి ఏకాదశులకోసం ఎదురుచూడటం హిందువులకు అలవాటు. ఏడాది పొడుగునా ఉండే 24 ఏకాదశుల్లో ఆషాఢ శుక్ల ఏకాదశి తొలి ఏకాదశిగా పరిగణిస్తారు. పూర్వ కాలంలో ఈ రోజునే సంవత్సరారంభంగా పరిగణించేవారు. వానకాలం మొదలైతే అనారోగ్యాలు తలెత్తడం సహజం. శరదృతువు యమ దంష్ట్రిక ( యముడి కోర ). ఉత్తరాయణం కన్నా దక్షిణాయనంలో పండుగలు పబ్బాలు ఎక్కువ. లంఖణం పరమ ఔషధం అనే ఉపవాస దీక్షకు నాంది తొలి ఏకాదశి.

పురాణ నేపథ్యం:- ఆషాఢమాసము శుక్లపక్ష ఏకాదశి నాడు విష్ణుమూర్తి పాలకడలిపై యోగనిద్రలోకి వెళ్ళే సందర్భాన్ని తొలిఏకాదశిగా పరిగణిస్తారు. స్వామి నిద్రించే రోజు కాబట్టి దీనిని శయన ఏకాదశి అని కూడా అంటారు. సతీ సక్కుబాయి ఈ శయన ఏకాదశి నాడే మోక్ష ప్రాప్తి పొందింది. తొలిఏకాదశి నాడు రోజంతా ఉపవాసం ఉండి రాత్రికి జాగారం చేసి మర్నాడు ద్వాదశి నాటి ఉదయం విష్ణుమూర్తిని పూజించి తీర్థప్రసాదాలను స్వీకరించి ఆ తర్వాత భోజనం చేస్తే జన్మజన్మల పాపాలు ప్రక్షాళనమవుతాయని భారతీయ హిందువుల నమ్మకం. ఆ రోజు యోగనిద్రకు ఉపక్రమించే విష్ణువు మళ్ళీ నాలుగు నెలల తర్వాత కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మేల్కొంటాడంటారు.

what is importance of tholi ekadasi in 2020

ఈ ఏకాదశిని పద్మఏకాదశిగా కూడా పిలుస్తారు. ఈ యోగ నిద్ర అనేది భూమి పై రాత్రి సమయాలు పెరుగుతాయి అన్నదానికి సూచన. తద్వారా ప్రజలలో నిద్రా సమయాలు పెరుగుతాయి. భవిష్యోత్తరపురాణంలో కృష్ణుడు ధర్మరాజుకు ఈ ఏకాదశి మహత్యం వివరించాడని ఉంది. దానిని ఉత్థాన ఏకాదశి అంటారు. ఆ తర్వాత రోజు వచ్చే ద్వాదశినే క్షీరాబ్ధి ద్వాదశి అంటారు. ఈ నాలుగు నెలల కాలాన్నీ పవిత్రంగా పరిగణించి అందరూ చాతుర్మాస్యదీక్ష చేసేవారు. తాళజంఘుడు అనే రాక్షసుని కుమారుడగు మురాసురునితో యుద్ధంలో గెలవలేక అలసిపోయిన విష్ణువు తన శరీరము నుంచి జనింపజేసిన కన్యక నే "ఏకాదశి" అంటారు.

ఏకాదశీ వ్రతాన్ని ఆచరించే రుక్మాంగదుడు - మోహిని రూపంలో వచ్చి ఏకాదశిపూట పొందుకోరిన రంభను తిరస్కరించాడట. ప్రస్తుతం మఠాధిపతులూ, సన్యాసం తీసుకున్నవారు మాత్రమే ఈ వ్రతాన్ని ఆచరిస్తున్నారు. చతుర్మాస్యదీక్ష చేపట్టినవారు నాలుగు నెలల పాటు ప్రయాణాలు చేయరు. కామ క్రోధాదులను విసర్జిస్తారు. ఆహారం విషయంలో కొన్ని నిషేధాలు పాటిస్తారు. జొన్న పేలాలు బెల్లం కలిపి దంచి పిండి చేస్తారు. రైతులు ఆరోజున కచ్చితంగా పేలపిండి తింటారు. ఏకాదశినాడు ఉపవాస నియమం లోకంలో స్థిరపడింది.

సాంఘిక అంశం:- ఈ ఏకాదశి ప్రజలలో ఉండే చైతన్యానికి ప్రతీక. యోగ నిద్ర అంటే... భూమిపై రాత్రి సమయాలు పెరుగుతున్నాయని చెప్పటానికి సూచన. అంటే ప్రజలలో నిద్రా సమయాలు పెరుగుతాయన్నమాట. వానాకాలంలో వచ్చే మొదటి ఏకాదశి కనుక దీనిని తొలి ఏకాదశి అని లౌకికంగా చెబుతారు పండితులు. ఏకాదశి అంటే పదకొండు. అయిదు జ్ఞానేంద్రియాలు, అయిదు కర్మేంద్రియాలు, మనస్సు కలిపి మొత్తం పదకొండు. వీటిని మనిషి తన అధీనంలోకి తీసుకువచ్చి వాటినన్నటినీ ఒకటిగా చేసి, అప్పుడు దేవునికి నివేదన చేయాలి. దీనివలన మనిషికి సహజంగా అలవడే బద్దకం దూరమవుతుందని, రోగాలు దరిచేరకుండా ఉంటాయని, ఇంద్రియ నిగ్రహం పెరుగుతుందని ఒక నమ్మకం.

పురాణం - సాంఘికం:- సూర్య వంశంలో ప్రఖ్యాతరాజు మాంధాత. అతడు ధర్మము తప్పడు, సత్యసంధుడు. అతని రాజ్యంలో ఒకసారి తీవ్ర కరువు వచ్చింది. దానితో ప్రజలు పడరాని పాట్లు పడుతుంటే అంగిరసుడు సూచన పై ఈ శయనైక ఏకాదశి వ్రతాన్ని భక్తితో చేస్తాడు దానితో వర్షం వచ్చి కరువు తీరి ప్రజలు సుఖంగా వున్నారని పురాణాలు చెపుతున్నాయి. విష్ణుమూర్తి యోగనిద్రలోకి వెళతాడని పెద్దలు చెప్పగానే నిజంగానే దేవుడు నిద్రపోతాడా అని ఒక సందేహం కలుగుతుంది.

విష్ణువు అంటే సర్వవ్యాపి అని అర్థం. అంటే విష్ణువు అనే పదానికి అంతర్లీనంగా సూర్యుడు అని అర్థం అన్నమాట. ఇప్పటి వరకు ఉత్తర దిక్కుగా ప్రయాణించిన సూర్యుడు ఈ రోజు నుంచి దక్షిణ దిక్కుకు వాలుతాడు. అంటే ఈ రోజు మొదలుగా దక్షిణ దిక్కుగా ప్రయాణిస్తాడు. దానినే సాధారణ పరిభాషలో నిద్రపోవడం అని అభివర్ణించారు. సాక్షాత్తు భగవంతుడే నిద్రిస్తుంటే ఈ పూజలు ఎవరికి చేయాలి అనుకోవచ్చు. ఈ నెలలోనే ప్రకృతిలో పర్యావరణంలో మార్పులు వస్తాయి. తద్వారా మన శరీరానికి జడత్వం వచ్చి అనేక రోగాలు చుట్టుముడతాయి.

ఉపవాసం వల్ల జీర్ణకోశం పరిశుద్ధమై, దేహం నూతనోత్తేజాన్ని సంతరించుకుంటుంది. ఇంద్రియనిగ్రహాన్ని కలిగిస్తుంది. ఇంతేకాక కష్టపరిస్థితుల్లోను, భయంకరమైన రోగాలు వచ్చినప్పుడు విపరీతమైన పరిస్థితులను ఎదుర్కోవడం కోసమే ఈ కఠిన ఉపవాసాలు, ఆచారాలు ఏర్పడ్డాయి. ఇందువలన కామ క్రోధాదులను విసర్జించగలుగుతారు. ఆహారం విషయంలో కొన్ని నిషేధాలు పాటిస్తారు. అలా ఏకాదశినాడు ఉపవాస నియమం లోకంలో స్థిరపడింది. ఈ పండుగకు పేల పిండిని తినే ఆచారము ఉన్నది పేలాలలో బెల్లాన్ని, యాలకులను చేర్చి దంచి ఈ పిండిని తయారు చేస్తారు ఈ రోజు దేవాలయంలోను పేలా పిండిని ప్రసాదం కూడా ఇస్తారు.

ఆరోగ్యపరంగా కూడా ఈ పిండి చాలా మంచిది. బాహ్య ఉష్ణోగ్రతలకు అనుగుణంగా దేహం మార్పులు చెందుతుంది. గ్రీష్మ ఋతువు ముగిసి వర్ష ఋతువు ప్రారంభమయ్యే సమయం. కావున శరీరానికి ఈ పిండి వేడిని కలుగజేయడమేగాక వ్యాధి నిరోధక శక్తిని పెంపొందిస్తుంది. వర్షాకాలంలో వ్యాధి బారిన పడటానికి ఉన్న అనేక అవకాశాలను ఇది తిప్పికొడుతుంది.

ఏకాదశి నాడు ఏం చేయాలి:- ఏకాదశి నాడు ఉపవాసం ఉండి ఆ రాత్రంతా జాగరణ చేయాలి. రాత్రివేళ విష్ణుమూర్తికి సంబంధించిన భాగవతాన్ని చదువుకోవడం, విష్ణు సహస్రనామ పారాయణ చేయాలి. మర్నాడు ద్వాదశి రోజున దగ్గరలో ఉన్న దేవాలయానికి వెళ్లి ఉపవాస దీక్షను విరమించాలి. తొలి ఏకాదశి నాడు ఆవులను పూజించాలి. తొలి ఏకాదశి విష్ణుమూర్తికి అత్యంత ప్రీతికరమైనది. కనుక ఈ రోజున ఈ దీక్షను ఆచరిస్తే విష్ణుమూర్తి అనుగ్రహం లభిస్తుంది.

ఉపవాసం ఎవరు ఉండ కూడదు:- పిల్లలు, 'బ్రహ్మచారి' పెళ్లి కానివారు, వృద్దులు, గర్భవతులు, ప్రసవమైన ఆడవారు, అనారోగ్యంతో ఉన్నవారు, బిపి, షుగర్ మొదలగు వ్యాధి గ్రస్తులు మరియు కాయకష్టం చేసుకునే వారు ' కూలి పనిచేసి బ్రతికే వారు ఏకాదశి ఉపవాస వ్రతం చేయకూడదని శాస్త్రము సూచిస్తున్నది. వీరికి ఏకాదశి ఉపవాస వ్రతం నుండి మినహాయింపు శాస్త్రమే సూచన చేసిందని ప్రవచన బ్రహ్మ బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనాలలో మనకు భోదపడుతుంది. వీరు ఉపవాసం చేయకుండా సాత్విక ఆహారం తీసుకుని ఏకాదశి తిధిలో దైవ స్మరణ చేయవచ్చును. ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టించండి, ఆవులకు, పక్షులకు గ్రాసం ఇవ్వండి ఏకాదశి వ్రత ఫలితం లభిస్తుంది. మనస్సును నికడగా పెట్టుకుని దైవనామ స్మరణ చేస్తే ఏకాదశి ఉపవాస వ్రత ఫలితం తప్పక లభిస్తుంది జై శ్రీమన్నారాయణ.

English summary
what is importance of tholi ekadasi in 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X