వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మాధవుని సన్నిధికి చేర్చే మాఘ పౌర్ణమి

|
Google Oneindia TeluguNews

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151

మాసాలన్నింటిలోకీ మాఘ మాసం విశిష్టమైనంది. రథసప్తమి ( సూర్యుడు ), భీష్మ ఏకాదశి ( విష్ణుమూర్తి) , శ్రీ పంచమి ( సరస్వతీదేవి ), మహాశివరాత్రి ( శివుడు ) ఇలా సకల దేవతలనూ కొలుచుకునేందుకు ఏదో ఒక పర్వదినాన్ని అందించే మాసం ఇది. ఇక మాఘ పౌర్ణమి వచ్చిందంటే చాలు పుణ్య తీర్థాలన్నీ కళకళలాడిపోతాయి. స్నానాలలోకెల్లా మాఘస్నానం ఉత్తమం అని పెద్దలు చెబుతూ ఉంటారు. నదులు, సముద్రాలు, ఆఖరికి గుడిలోని కోనేరులు కూడా ఈ రోజున పవిత్రతను సంతరించుకుంటాయని నమ్మకం. ఇక మాఘ పౌర్ణమి నాడు చేసే సముద్ర స్నానం గురించి చెప్పనే అక్కర్లేదు. ఆషాడము, కార్తీకము, మాఘము, వైశాఖము అంటూ నాలుగు నెలలు సముద్ర స్నానానికి అనువైనవిగా మన పెద్దలు పేర్కొన్నారు.

ఏడాదిలో కనీసం నాలుగుసార్లన్నా సముద్ర స్నానం చేస్తే అందులోని లవణాల మనకు ఆరోగ్యాన్ని చేకూరుస్తాయన్నది ఈ నిబంధన వెనుక ఉన్న కారణంగా తోస్తుంది. పైగా ఆ నాలుగు నెలలలోనూ సముద్రపు ఉష్ణోగ్రతలు స్నానానికి తగినట్లుగా ఉంటాయనీ, ఆ సమయంలో సముద్రం మీద పడే చంద్రకిరణాలు కూడా ఔషధతత్వాన్ని కలిగి ఉంటాయనీ అంటారు. మాఘ పౌర్ణమి కేవలం స్నానానికి మాత్రమే కాదు.. ఇష్టదేవతలను అర్చించుకునేందుకు, పితృదేవతలను తలచుకొనేందుకు కూడా అనువైన సందర్భం. ఈ రోజున సూర్యుడినీ, మహాలక్ష్మినీ పూజించడం వల్ల విశేషమైన ఫలితం లభిస్తుందని చెబుతారు. సూర్యజయంతి కారణంగా మాఘమాసం యావత్తూ సూర్యునికి ప్రీతికరమైనది. అందుకే మాఘపౌర్ణమి నాడు సముద్రస్నానంతో పాటుగా... ఆ ప్రత్యక్ష నారాయణునికి ప్రీతికలిగేలా సూర్యాష్టకమ్, ఆదిత్యహృదయం వంటి స్తోత్రాలను పఠించడం మంచిది.

What is magna pournami..What is its importance?

ఇక మహాలక్ష్మి అమ్మవారిని ప్రసన్నం చేసుకునేందుకు అమ్మవారిని కానీ విష్ణుమూర్తిని కానీ పద్మాలతో అర్చించమని సూచిస్తుంటారు. అటు మహాలక్ష్మికే కాదు, ఇటు పార్వతీదేవికి కూడా మాఘపౌర్ణమి ప్రత్యేకమైనదే! భూమి మీద ఒక శంఖు రూపంలో పడిన పార్వతీదేవి, దక్షప్రజాపతి చేయి సోకగానే బాలికగా మారిపోయింది. ఆ బాలికకు సతీదేవి అన్నపేరు పెట్టి అల్లారుముద్దుగా పెంచుకున్నాడు దక్షుడు. ఇంతకీ శంఖువు, సతీదేవిగా మారిన రోజు మాఘపౌర్ణమే! ఇక మునులలో అతి ప్రసిద్ధుడైన కపిల మహర్షి జన్మించింది కూడా ఈ రోజే అని కొన్ని చోట్ల ప్రస్తావించబడింది. కేవలం హిందువులకు మాత్రమే కాకుండా బౌద్ధులకు కూడా మాఘ పౌర్ణమి ప్రత్యేకమే! బుద్ధుడు తాను త్వరలోనే నిర్వాణం చెందబోతున్నట్లుగా ఈ రోజునే ప్రకటించారట. అందుకని ఈనాడు బౌద్ధులు మతగ్రంథాలైన త్రిపిటకాలను వల్లెవేస్తుంటారు.

మఘ నక్షత్రానికి అధిపతి బృహస్పతి. కాబట్టి ఈ రోజున బృహస్పతిని కనుక పూజిస్తే ఆయన కరుణ లభిస్తుంది. జ్యోతిషపరంగా బృహస్పతికి ఉన్న ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు. జ్ఞానం దగ్గర నుంచి ధనం వరకూ బృహస్పతి అనేక సంపదలకు, సౌఖ్యాలకు కారకుడు. ఇన్ని ప్రత్యేకతలు ఉన్నాయి కాబట్టే.. మాఘ పౌర్ణమిని మహామాఘి అని పిలుచుకుంటారు. మాఘ పూర్ణిమ స్నానఫలం మహిమ ఎలా ఉంటుందో గమనిద్దాం.

What is magna pournami..What is its importance?

* ఇంటిలోనే వేడినీళ్ళతో స్నానం చేస్తే ఆరు సంవత్సరాలు శుభ్రంగా స్నానం చేసిన ఫలితం లభిస్తుంది.

* బావి నీళ్ళతో స్నానం చేస్తే , 12 సంవత్సరాల పుణ్యస్నాన ఫలితం వస్తుంది.

* చెరువులో స్నానం చేస్తే 24 సంవత్సరాల పుణ్యస్నాన ఫలం లభిస్తుంది.

* సాధారణ నదిలో స్నానం చేస్తే 96 సంవత్సరాల పుణ్యస్నానఫలం లభిస్తుంది.

* పుణ్యనదీ జలాలలో స్నానం చేస్తే 9,600 సంవత్సరాల పుణ్యస్నానఫలం లభిస్తుంది.

* సంగమస్థానాలలో స్నానం చేస్తే 38,400 సంవత్సరాల పుణ్యస్నానఫలం లభిస్తుంది.

* గంగానదిలో స్నానం చేస్తే 3 కోట్ల 84 లక్షల సంవత్సరాల పుణ్యస్నానఫలం లభిస్తుంది.

* ప్రయాగలోని త్రివేణీ సంగమంలో స్నానం చేస్తే ... గంగా స్నానం వలన కలిగే ఫలితం కన్నా నూరురెట్లు అధికఫలం కలుగుతుంది.

* సముద్రస్నానం చేస్తే వచ్చే పుణ్యఫలాన్ని చెప్పడానికి మాటలు చాలవు.

ఈ మాఘమాసం మొత్తం పవిత్రస్నానాలు చేయడానికి వీలు కుదరకపోతే మాఘమాసం చివరి మూడురోజులైనా పవిత్రస్నానాలు చేస్తే మంచి ఫలాన్ని పొందవచ్చు. చివర మూడు స్నానాలనూ "అంత్యపుష్కరిణీ స్నానాలు'' అంటారు. సాధారణ స్నానం శరీర మలినాన్ని పోగొడితే మాఘమాసం మనసులోని మాలిన్యాన్ని పోగొట్టి మాధవుని సన్నిధికి చేరుస్తుంది జై శ్రీమన్నారాయణ.

English summary
What is magna pournami..What is it's importance?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X