వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాధాష్టమి అంటే ఏంటీ ?

|
Google Oneindia TeluguNews

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష పండితులు. హైదరాబాద్ - ఫోన్ : 9440611151

భాద్రపదమాసంలోని అష్టమి శ్రీకృష్ణ పరమాత్మ పూజకు ఉత్కృష్టమైన రోజు. ఈ నాడు పవిత్ర ప్రేమకు చిహ్నంగా చెప్పబడుతూ ఉన్న శ్రీ రాధాకృష్ణులను పూజించాలి. ఈ దినానికి 'రాధాష్టమి' అని పేరు. ఈ రోజు రాధాకృష్ణులను పూజించడంవల్ల సంసార సుఖం లభిస్తుందని, భార్యాభర్తల మధ్య అనురాగం పెరుగుతుందని చెప్పబడుతూ ఉంది.
శ్రీకృష్ణుని ప్రియురాలు రాధ జన్మదిన వేడుకలను సంద్భంగా రాధకృష్ణుల విగ్రహాలకు పెరుగు, పాలు, పండ్ల రసాలు, పాలు, కొబ్బరినీరు తదితరాలతో అభిషేకాలు నిర్వహించి అనంతరం స్వామివారిని సర్వాంగ సుందరంగా అలంకరించి భక్తితో గీతాలు ఆలపింస్తారు.
ప్రత్యేక పూజ, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. రాధాకృష్ణుల విగ్రహాలను అభరణాలు, నూతన వస్త్రాలతో విశేషంగా అలంకరిస్తారు. బృందావనంలో ముఖ్యమైన ప్రదేశాలను భక్తులకు తెలియజేస్తూ వాటి విశిష్టతతో కూడిన వీడియోను ప్రదర్శిస్తారు. రాధారానిని కీర్తిస్తూ వైష్ణవ ఆచార్యులు స్వరపరిచిన అద్భుత పాటలు ఆలపిస్తారు. అమ్మవారికి విశేష హారతి తర్వాత పవళింపు సేవ నిర్వహింస్తారు.
రాధామాధవం ఎంత రమణీయం! రెండు పవిత్ర హృదయాల దివ్య సంగమం, స్వచ్ఛమైన ప్రేమకు అచ్చమైన ప్రతిరూపం.తనను తాను ప్రేమించుకుందుకు, తన నుండి తాను వేరుపడి మాధవుడు రాధగా జన్మించాడు. రాధ లోకోత్తర సౌందర్యమూర్తి. అరవిందం లాంటి అందం. మకరందం లాంటి మనస్సు. ఇలకు దిగిన ఇంద్రధనుస్సు. ప్రణయ మాధురి, రాధాసుందరి.
మాధవుడు సౌందర్యసారసర్వస్వం. కోటి మన్మధ లావణ్య కోమలాంగుడు. త్రిజగన్మోహన నీలవర్ణ శోభితుడు. సకల సద్గుణ భూషితుడు. నిర్మల హృదయుడు. నిర్గుణుడు. అది బృందావనం. కృష్ణాష్టమి పర్వదినం. ఈ ప్రత్యేక సందర్భానికై జాజుల దారాలతో నేయించి, వెనె్నలతో అద్దకాలు వేయించి, పాల నురగతో సరిగంచులు దిద్దించిన కొత్త చీర ధరించి
విశేషమైన అలంకారాలతో, చందనం పూసిన కుందనపు బొమ్మలా వినూత్న శోభను విరజిమ్ముతున్నది రాధ. ఆమె ఎదురుగా కృష్ణుడు, సహజాలంకార సుందరుడు, రాగరంజితుడు, అనురాగ బంధితుడు రాధ సన్నిధిలో ఏకాంతంలో తన్మయుడై ఉన్నాడు.
రాధాయ నమః అనే ఆరు అక్షరాల (షడక్షరీ) మహా మంత్రం నాలుగువిధాలుగా(చతుర్విధ) ఫలప్రదాయిని అని భక్తులు విశ్వసిస్తారు. 'రాధ' మంత్రాన్ని శ్రీకృష్ణుడు ఆ దేవి నుంచి రాస మండలంలో ఉపదేశ రూపంలో పరిగ్రహించాడని,అదే మంత్రాన్ని గురు పరంపర నుంచి నారదుడు గ్రహించాడని 'పద్మ పురాణం' చెబుతున్నది.
రాధాకృష్ణులు- ద్వంద్వ సమాసం. ఆ మాట వినగానే అద్వైత ప్రణయం గోచరిస్తుంది.అప్రాకృతమైన జగత్తులో- ముక్త ధామం, వైకుంఠం, గోలోకం అనే మూడు ప్రధాన లోకాలు ఉన్నాయని నారాయణోపనిషత్తు వర్ణిస్తుంది.

 what is Radhashtami ..?

గోలోకాన్ని మహారాస మండలి అంటారు. నిత్య బృందావనం, శ్వేత మండలి అని కూడా వ్యవహరిస్తారు. అది ఒక మహా రస జగత్తు. ఆ జగత్తుకు ప్రభువు గోపాలుడు. ఆయనే రాధామాధవుడు. ఆ రస సమ్రాట్‌ శక్తినే రాసేశ్వరిగా భావిస్తారు. 'రాసము' అంటే గోకులంలోని ఒక క్రీడావిశేషం, సల్లాపం అని అర్థాలున్నాయి. ధావనం అంటే పరుగు.
శ్రీకృష్ణుణ్ని ప్రాణాధారంగా చేసుకొన్న రాధ ఆయన వామ పార్శ్వం నుంచి పుట్టిందని చెబుతారు. ఆమె పుట్టగానే రాస మండలంలో కృష్ణుడి సేవకోసం ధావనం (పరుగు) సాగించడం వల్ల రాధగా మారిందని బ్రహ్మవైవర్త పురాణం వివరిస్తోంది.
శ్రీకృష్ణుడికి రాధ ప్రాణాధికురాలైన ప్రియురాలు. మహా ప్రకాశవంతమైన గోలోక రాస మండలంలో రాధాకృష్ణులే ఆది దంపతులు. నాలుక కొన నుంచి పుట్టిన కన్య 'రాధ' కాలాంతరంలో రెండు రూపాలు ధరించిందని పురాణ కథనం. అందులో ఒకటి లక్ష్మి రూపమని, రెండోది రాధ ప్రతిరూపమని భావిస్తారు.
రాధ జన్మ వృత్తాంతం గురించి భిన్నగాథలు వ్యాప్తిలో ఉన్నాయి. ఆమె కేదారుడు అనే రాజుకు యజ్ఞకుండంలో పుట్టిన కుమార్తె అని చెబుతారు. పేరు బృంద అని, కృష్ణుణ్ని భర్తగా పొందాలని
కోరి తపం ఆచరిస్తే ఆయన ప్రత్యక్షమయ్యాడని విశ్వసిస్తారు. ద్వాపర యుగంలో రాధ తనను సేవించడం వల్ల ఆ ప్రదేశం 'బృందావనం'గా మారుతుందని వరమిచ్చాడనీ ఆ గాథ సారాంశం.
వృషభానుడు,కళావతి దంపతులకు పుట్టిన తనయకు గర్గ మహాముని 'రాధ' అని నామకరణం చేశాడు. బ్రహ్మవైవర్తం ప్రకారం, దూర్వాస ముని 'రసరశ్మి' అని పేరు పెట్టాడు. శ్రీకృష్ణుణ్ని రాధాదేవి తన మనసులో లయం చేసి విజయం సాధించిన రోజు- భాద్రపద శుద్ధ అష్టమి. అందుకే 'రాధాష్టమి'గా వ్యవహరిస్తారు.
పవిత్ర ప్రేమకు చిహ్నంగా భావించి రాధాకృష్ణులను పూజిస్తారు.
రాధాకృష్ణులను ఆరాధించడం వల్ల భార్యాభర్తల మధ్య అనురాగం పెరుగుతుందని విశ్వాసం.రాధా కృష్ణులు ఏకైక రూపులు. వారిది రాధ పేరులో ఉండే 'ర'కార ఉచ్చారణ వల్ల మానవులకు శ్రీకృష్ణుడి చరణ కమలాలపై నిశ్చల భక్తి కుదురుతుంది. 'ధ' నామస్మరణ వల్ల సాయుజ్యం కలుగుతుందని, రాధ నామస్మరణతో రోగ, మృత్యు భయాల నుంచి నివృత్తి కలుగుతుందనీ భావన.
' రాధా! ఈ రోజు నా పుట్టినరోజు. ఏమైనా కోరుకో. ఏదైనా ఇస్తాను.'
'మాధవా! నువ్వు నా స్వంతం. నాకే చెంది ఉన్నావు, ఔనా?'
'అవును రాధా!'
'నా దగ్గర లేనిది, వెలకట్టలేనిది, నీకన్నా విలువైనది నాకు కావాలి. ఇవ్వగలవా కృష్ణా?'
చెప్పడానికి గోపాలుని వద్ద సమాధానం లేదు. ఆశ్చర్యంగా చూస్తున్నాడు. రాధ మెల్లగా కృష్ణుని దగ్గరకు వచ్చింది. అతని చరణాలు ముట్టుకుంది. విశ్వసుందర పాదారవింద యుగళిని తనివితీరా ముద్దాడింది. శశాంకశీతల మనస్కుని కంఠాన్ని తన మృదుకర ద్వయంతో బంధించింది. గోవిందుని గట్టిగా హత్తుకుంది.
'నిన్ను పొందిన తర్వాత నాకిక పొందవలసినదేముంది సర్వేశా!'
అదే బృందావనం. ఈ రోజు రాధాష్టమి. రాధ పుట్టిన రోజు. ఈ అరుదైన రోజు కోసం అపూర్వమైన రీతిలో, తన గుణగణాలను దివ్యాభరణాలుగా మార్చి, మనోజ్ఞంగా అలంకరించుకుని సరికొత్త శ్యామసుందరుడు అవతరించాడు. అటు రాధావిలాసం, ఇటు మురళీగాన వినోదం, సరస శృంగార చక్రవర్తి,
రాధికా మానస విహార రాజహంస, సకల భువనైక మోహన దివ్యమూర్తి రాధను మంత్రముగ్ధం చేస్తున్నాడు. జలతరంగిణి మీటినట్టు రాధ నవ్వుతున్నది. జగమంతా అమృతం వర్షిస్తున్నది. ప్రణయ మకరందమాధురీ భరితలోచనాలు కడు చిత్రంగా తిప్పుతూ రాధ ఇలా అంటున్నది
'కృష్ణా! ఈ రోజు ఎంత అందంగా వెలిగిపోతున్నావో తెలుసా! నీ పుట్టినరోజునాడు నేను ముస్తాబై వచ్చాను. నా పుట్టిన రోజున నువ్వు అలంకరించుకున్నావు. బలే విచిత్రంగా ఉంది కదూ! ఇంత సమ్మోహనకరంగా ఎప్పుడూ నిన్ను చూడలేదు
. నువ్వు నా అద్దానివా? నన్ను నేను చూసుకుం టున్నానా?'.. సరస భాషిణి, సహజ చమత్కారి కదా రాధ. 'ఈ సంతోష సమయంలో, నీకొక వరం ఇవ్వాలనిపిస్తోంది. నీ పుట్టిన రోజున నేను కోరుకున్నా. నా పుట్టిన రోజున నువ్వు కోరుకో కృష్ణా!' ఆశ్చర్యచ కితుడయ్యాడు కృష్ణుడు తేరుకుని, వొకింత ఆలోచించి, ఆమె చమత్కారాన్ని ఆమెకే అప్పగిస్తూ ఇలా అన్నాడు.
'ఏదైనా నువ్వే నన్ను కోరుకో. ఇదే నా కోరిక రాధికా! అన్నట్లు రాధా! నాకన్నా విలువైనది కోరుకోవాలి సుమా!'గలగలా నవ్వింది రాధ. 'నీకన్నా విలువైనది నేనే గోపాలా!' హతాశుడయ్యాడు కృష్ణుడు! ఒక్కసారి ఉలిక్కిపడ్డాడు.
'ఏమంటున్నావు రాధా! నువ్వు నాకంటే విలువైనదానివా? ఎలా?'
'భక్తుడికి, భగవంతుడు దాసుడు కాదా, వాసుదేవా!'
'అవును'
'నువ్వు ప్రేమకు బానిసవు కదా కృష్ణా'
'నిజం'
'నువ్వు నా ప్రేమకు బానిసవు కదా ప్రియా!'
'అనుమానమెందుకు రాధా!'
'నువ్వు బానిసవు. నేను యజమానురాలిని. నేనే గొప్ప కదూ'
'ఒప్పుకున్నాను రాణీ! మరి నిన్ను నువ్వే ఎలా కోరుకుంటావు?'
'ఎప్పటికీ నువ్వు బానిసగానే ఉండాలి, నేను యజమానురాలుగానే ఉండిపోవాలి. ఇదే నా కోరిక జగన్నాథా'
కృష్ణుని హృదయం ద్రవించింది. ఒకరిని బానిసగా మార్చగలిగిన ప్రేమ సామాన్య ప్రేమ కాదు. పరమ పవిత్ర ప్రేమ. ఏ కారణం లేనిది, ఏ అవసరం లేనిది, ఏ షరతులు లేనిది రాధ ప్రేమ. అటువంటి ప్రేమను కృష్ణునికి ఇస్తున్నది రాధ. అతనికింకేమి కావాలి! కృష్ణుణ్ణి పూజించే వారెందరో, ఆరాధించే వారింకెందరో.
కానీ, ఆ రాధ మాదిరిగా ప్రేమించేవారేరీ? రాధకు కృష్ణుడి అవసరం కంటె, కృష్ణుడికే రాధ అవసరం అధికం. రాధ కృష్ణుడిపై ఆధారపడి ఉందో, లేదో కానీ కృష్ణుని ఉనికి మాత్రం పూర్తిగా రాధపైనే ఆధారపడి ఉంది. ఈ క్షణంలో కృష్ణుని అవతారానికి సార్ధకత లభించింది.
కన్నయ్య పాదాలకు రాధ నమస్కరించబోయింది.
వద్దని రాధను వారించాడు. రాధ పాదాలకు తానే మోకరిల్లాడు నందనందనుడు. సాష్టాంగ ప్రణామం చేశాడు.
'ఏ.. ఏమిటిది!.. మా.. మాధవా!' రాధ కంఠం గద్గదమయింది. ఆ ప్రణయమూర్తి మూగదయింది.
'బానిస, యజమానికి నమస్కరించాలి కదా!'
కృష్ణుని వినయసౌశీల్య వచనాలు విన్న బృందావనం అతనికి ప్రణమిల్లింది.
రాధ పాదాల స్పర్శకు కృష్ణునిలో విద్యుత్తు ప్రవహించింది. కృష్ణుడు మోకాళ్లపై కూర్చున్నాడు. మాధవుని కళ్లలో నీళ్లు... రాధ కళ్లల్లో నీళ్లు.. అతని చుబుకాన్ని పైకెత్తి, సూటిగా కృష్ణుని కళ్లల్లోకి రాధ చూసింది. ఆమె కన్నీటి చుక్కలు అతని కళ్లలో కురిశాయి. అతని కన్నీటితో ఆమె కన్నీరు సంగమించింది. మాధవుని చెక్కిళ్లపై ధారలు ప్రవహిస్తున్నాయి.

ఆ పవిత్ర జలాన్ని దోసిలితో పట్టి, తీర్థంగా స్వీకరించి యమున తరించింది. పొన్నలు వెన్నలుగా కరిగి నీరయ్యాయి. జాబిల్లి కళ్ల నుండి జాజులు వర్షించాయి. ఆ అమల ప్రేమికులను, ఆ అమర ప్రేమికులను అభిషేకించాయి.

యశోదా ప్రియసుతుడు, ఉదయచంద్ర వదనుడు, సౌమ్య, సౌజన్యగుణధాముడు శ్రీకృష్ణుడు. అద్వితీయ సౌందర్యరాశి, అనుపమాన ప్రేమవారాశి రాధాదేవి. అనిర్వచనీయం, వర్ణనాతీతం, అలౌకికం, జగదేక ప్రేమకావ్యం 'రాధామాధవం'.

English summary
sudh Ashtami (Friday, 6.09.2019) is called Radhashtami. Radhashtami symbol of sacred love.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X