వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శనిత్రయోదశి అంటే ఏమిటి... ఆరోజున ఎలాంటి పూజలు ఆచరించాలి..?

|
Google Oneindia TeluguNews

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151

"నీలాంజన సమాభాసం రవిపుత్ర యమాగ్రజం
ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చ"

ఖగోళ పరంగా శని, సూర్యుడి నుండి ఆరవ గ్రహం. సౌర వ్యవస్థలో అన్ని గ్రహాల కంటే పెద్దదైన గురు గ్రహం తరువాత, శని అతి పెద్ద గ్రహం. ఇది పూర్తిగా వాయువులతో కూడుకుని ఉంటుంది. దీని సగటు వ్యాసార్థం, భూమి వ్యాసార్థానికి ఆరు రెట్లు ఉంటుంది. సగటు సాంద్రత భూమి సాంద్రతలో ఎనిమిదవ వంతు ఉంటుంది. కానీ, శని ఘనపరిమాణం చాలా ఎక్కువ కావడం దాని ద్రవ్యరాశి భూమికి 95 రెట్లు ఉంటుంది.

నవగ్రహాలలో ఏడవ వాడైన శనీశ్వరుడు సూర్యభగవానునికి ఛాయాదేవికి కలిగిన కుమారుడని పురాతనాలు చెబుతున్నాయి. సోదరుడు యమధర్మరాజు , సోదరి యమున , స్నేహితులు హనుమాన్ , కాలభైరవుడు , ఇతర పేర్లు కృష్ణా , శౌరి , బభ్రు , రోద్రాంతక , సూర్యపుత్ర , కాశ్యపస గోత్రం. నిజానికి శని భగవానుడిని మనసారా పూజించి ఆరాధించే భక్తులను కష్టాల నుండి గట్టెక్కించే కళంకములేని కరుణామూర్తి శనీశ్వరుడని భక్తుల విశ్వాసం.

What is shanitrayodhashi, Why is it important ?

శనిత్రయోదశి ప్రాముఖ్యత:- జ్యోతిష్య శాస్త్రరీత్యా శని శనివారానికి అధిపతి. ఏ వ్యక్తికైనా పూర్వజన్మ సుకృత , దుష్కృత ఫలితాలను ప్రదానం చేసే అధికారం శనిది. ఆధ్యాత్మిక జ్యోతిష్యం లో శనిని పూర్వజన్మలోని సంచిత కర్మలకు అధిష్టాత గా చెప్పబడింది. శని దశల్లో వ్యక్తికి పూర్వజన్మలోని దుష్కర్మలకు సైతం దండన లభిస్తుంది. భౌతిక దృష్టిలో శని క్రూరుడుగా కనపడినా వాస్తవానికి అగ్ని పరీక్షకు గురి చేసి వ్యక్తిని సత్కర్మల వైపు మళ్ళిస్తాడు.. ఈశ్వర శాసనం లో శని దండనాధికారి. శని మనం చేసిన దుష్కర్మలకే దండన విధిస్తాడు. నిష్పక్షపాతంగా ఉన్న న్యాయాధిపతిలా శని దండన విధిస్తాడు.

శనివారానికి స్థితి కారకుడైన శ్రీమన్నారాయణుడు అధిపతి , త్రయోదశి కి అధిపతి కామదేవుడు. అంటే శివుడు. అలా శివకేశవుల క్రియలకు శని అధిపతి అయ్యాడు. అందుకే శనిత్రయోదశి శని కి ఇష్టమైన రోజు. త్రయోదశి తిథి శివుడికి ఎంతో ప్రీతికరమైనది. క్షీరసాగర మదనం జరిగి అమృతం ఉద్భవించిన తరువాత, హాలా హలాన్ని దిగమింగి తన కంఠం లో దాచుకొని లోకాలను కాపాడిన శివుడికి కృతఙ్ఞతలు చెప్పడానికి దేవతలందరూ ఆయన వద్దకు వెళ్ళినది ఈ త్రయోదశి తిథి నాడే అని పురాణాల ద్వారా తెలుస్తుంది.

ఆ సమయంలో శివుడు, మన గణాల ప్రకారం 2 గంటల 24 నిమిషాల పాటు ఆనంద తాండవం చేసాడట. ఆ శివ తాండవాన్ని దేవతలందరూ పరవశించి చూస్తూ ఆనందించారని చెప్పబడింది. ఆ తాండవం చేసిన సమయమే ప్రదోషం. ప్రదోషమంటే మునిమాపు వేళ "దోషం" అంటే రాత్రి అని అర్ధం. చంద్రున్ని దోషకరుడు అని అంటారు. రాత్రికి కారణమయ్యేవాడనే అర్ధం. ప్రదోషమంటే దోష ప్రారంభకాలం. అంటే రాత్రి ప్రారంభ సమయం.

ప్రదోష కాలం లో చేసే పూజా పునస్కారాలు దానధర్మాలు మామూలు సమయంలో చేసే వాటికంటే అధిక శుభఫలితాలనిస్తాయి. అలాగే ఈ సమయంలో చేసే పాపాలు కూడా అధిక చెడు ఫలితాలనిస్తాయి. శని త్రయోదశి ప్రదోష సమయాన శివుడికి అభిషేకం చేయడం చాల విశేషంగా లభిస్తుంది. ఈ సమయంలో శివుడికి చేసే పూజలు అత్యంత ఫలితాలనిస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి. జాతక రీత్యా శని బాగాలేని వారు , శని దశ అంతర్దశలు జరుగుతున్న వారు. ఏలినాటి శని , అష్టమ శని , అర్దాష్టమ శని వలన పీడింప బడుతున్నారో అటువంటి వారు ఈ రోజు శని పరిహారాలు చేయడం ఉత్తమం.

నువ్వుల నూనెతో శనికి అభిషేకం చేయడం , శనిత్రయోదశి రోజున ఉపవాసం ఉండడం , రావిచెట్టుకి ప్రదక్షిణాలు చేసి ఆవనూనె తో దీపం పెట్టడం , నువ్వుల నూనెలో ముఖం చూసుకొని ఆ నూనెని దానం చేయడం. కాకులకు అన్నం పెట్టడం , నల్ల కుక్కలకు అన్నం పెట్టడం , నల్లని గొడుగు , నల్లని వస్త్రాలు , తోలు వస్తువులు , నవధాన్యాలు , ఇనుము పేదవారికి దానం చేయడం మంచిది.

శనిగ్రహదోషాలవలన బాధపడుతున్నవారు "నీలాంజన సమాభాసం , రవిపుత్రం యమాగ్రజం , ఛాయా మార్తాండ సంభూతం , తం నమామిశనైశ్చరం" అనే స్తోత్రాన్ని వీలైనన్ని ఎక్కువసార్లు పఠించటం. వీలైనంతసేపు ఏపని చేస్తున్నా ఇష్ట దైవ మంత్రాన్ని జపించాలి. వికలాంగులకు ఆకలి గొన్న జీవులకు భోజనం పెట్టటం ఎవరివద్ద నుండి ఇనుము, ఉప్పు, నువ్వులు, నువ్వులనూనె చేతితో తీసుకోకుండా వుండటం చేయాలి.

మద్య మాంసాదులను ముట్టరాదు. వీలైనవారు శివార్చన స్వయముగా చేయటము. శనీశ్వర గాయత్రి: "ఓం కాక ధ్వజాయ విద్మహే , ఖడ్గ హస్తాయ ధీమహి తన్మోమంద ప్రచోదయాత్‌" , శనీశ్వర దోషపీడితులు ఈ గాయత్రి మంత్రాన్ని నిత్యం ఉదయం ఇరవై ఒక్కసార్లు జపించవలెను ఈ విధంగా శనిని పూజించి ఆరాధిస్తే బద్ధకం, చెడు ఆలోచనలు, రోగాలు, అపమృత్యు దోషము, దారిద్ర్యం తొలగుతాయి. వృత్తి పరమైన సమస్యలు, వివాహంలో ఆటంకాలు, శత్రు భయం, కోర్టు సమస్యలలో ఉన్న వారి సమస్యలు కూడా తొలగుతాయని శాస్త్రాలు తెలియ జేస్తున్నాయి.

దేవునికి సంబంధించిన పూజనే కాని వ్రతమేగాని నిష్టాతో చేయాలి. చిత్త శుద్దిలేని ఆచారాలకు, భక్తిలేని పూజలకు ఫలితాలు కనబడవు. మనిషై పుట్టినవారికి దానధర్మ గుణం ఉండాలి. పేదలకు తోచిన సహాయం చేస్తూ ఉండాలి. ప్రకృతిలో మనతో పాటు సాటి జీవులైన పశు ,పక్ష్యాదులకు సహృదయంతో వాటికి ధాన్యం గింజలు, అవి తినే గ్రాసం వేయాలి, త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయాలి. ఆనందమయ జీవనం మనకు కావాలంటే, నీ ఆలోచన, ఆశయం సాటివారి జీవితంలో ఆనందమయజీవనం నాలాగే కొనసాగాలి అనే భావనకు రావాలి, పేదవారికి తోచిన సహాయం చేయాలనే స్థితికి వచ్చినప్పుడు మన పూజకు శుభఫలితాలు లభిస్తాయి.

English summary
shaneeshwara is born to surya Bhagavan and Chaayadevi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X