వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పూరీ జగన్నాథ ఆలయ చరిత్ర ఏమిటి..? పూరీ పట్టణాన్ని పూర్వం ఏమని పిలిచేవారు..?

|
Google Oneindia TeluguNews

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151

మన భారతదేశంలో పురాణకాలం నుండీ ప్రసిద్ధి చెందిన పట్టణాలలో పూరీ ఒకటి. ఈ పట్టణం ఒరిస్సా రాష్ట్ర రాజధాని అయిన భువనేశ్వర్ కి 60 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ పట్టణాన్ని పూర్వం పురుషోత్తమ క్షేత్రమని, శ్రీ క్షేత్రం అని కూడా పిలిచేవారు. ఈ పట్టణంలో విష్ణువు జగన్నాధుని పేరిట కొలువై పూజలందుకుంటున్నాడు. ఈ ఆలయం వైష్ణవ దివ్యదేశాల్లో ప్రముఖమైనది మరియూ హిందువులు అతి పవిత్రంగా భావించే " చార్ ధాం " పుణ్యక్షేత్రాలలో ఒకటి.ఈ ఆలయాన్ని 1078 లో కళింగ పరిపాలకుడైన అనంతవర్మ చోడగంగాదేవ ప్రారంభించగా ఆయన మనవడైన రాజా అనంగ భీమదేవ్‌ పాలనలో పూర్తయింది. అంతకు ముందు అక్కడున్న ఆలయాన్ని ఇంద్రద్యుమ్న మహారాజు కట్టించాడని అంటారు. దీని వెనకో కథ ఉంది.

జగన్నాథుడిని పూజించిన విశ్వావసుడు

ఈ జగన్నాథుడు గిరిజనుల దేవుడనీ, నీలమాధవుడనే పేరుతో పూజలందుకున్నాడనీ స్థలపురాణం. అడవిలోని ఓ రహస్య ప్రదేశంలో ఉన్న ఈ జగన్నాథుణ్ని గిరిజనుల రాజైన విశ్వావసుడు పూజించేవాడట. విషయం తెలుసుకున్న ఇంద్రద్యుమ్న మహారాజు, ఆ రహస్యాన్ని కనిపెట్టడానికి విద్యాపతి అనే బ్రాహ్మణ యువకుణ్ని అడవికి పంపుతాడు. విశ్వావసుడి కూతురైన లలితను విద్యాపతి ప్రేమించి పెళ్ళాడతాడు. ఈ జగన్నాధ విగ్రహాన్ని చూపించమని పదేపదే ప్రాధేయపడుతున్న అల్లుడి విన్నపాన్ని కాదనలేని ఆ సవర రాజు, అతని కళ్లకు గంతలు కట్టి గుడి దగ్గరికి తీసుకువెళతాడు. విద్యాపతి ఆ దారి తెలుసుకునేందుకు తెలివిగా తాను వెళ్ళే ఆ దారి పొడుగునా ఆవాలు జారవిడుస్తాడు. కొన్నాళ్లకు అవి మొలకెత్తి దారి స్పష్టంగా తెలుస్తుంది. దీంతో వెంటనే అతను ఇంద్రద్యుమ్న మహారాజుకు కబురు పెడతాడు.

కలలో కనిపించిన జగన్నాథుడు

రాజు అడవికి చేరుకునే లోగా అక్కడ ఆ విగ్రహాలు మాయమవుతాయి. దీంతో ఇంద్రద్యుమ్నుడు నిరాశతో నిరాహారదీక్ష మొదలుపెట్టి, అశ్వమేథయాగం చేస్తాడు. నీలాచలం మీద ఓ ఆలయాన్ని నిర్మించి నరసింహస్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తాడు. ఒకనాడు ఆయన అక్కడే నిద్రిస్తుండగా, జగన్నాథుడు కలలో కనిపించి సముద్రతీరంలో చాంకీనది ముఖద్వారానికి వేప కొయ్యలు కొట్టుకొస్తాయనీ వాటితో విగ్రహాలు చేయించమనీ ఆదేశిస్తాడు. కొయ్యలైతే కొట్టుకొచ్చాయి కానీ, విగ్రహ నిర్మాణానికి ఎవరూ ముందుకు రాలేదు.ఏం చేయాలా అని రాజు ఆలోచిస్తున్న సమయంలో దేవశిల్పి విశ్వకర్మ వికలాంగుడి రూపంలో వస్తాడు. తానొక్కడినే రహస్యంగా ఓ గదిలో విగ్రహాలకు రూపకల్పన చేస్తాననీ, ఆ సమయంలో పచ్చి మంచినీళ్లు కూడా ముట్టుకోననీ, ఆ 21 రోజులూ అటువైపు ఎవరూ రాకూడదనీ, తన పనికి ఆటంకం కలగకూడదనీ షరతు విధిస్తాడు. రాజు అంగీకరిస్తాడు. రోజులు గడుస్తున్నా గదిలోంచి ఎలాంటి శబ్దమూ రాదు. దీంతో రాణి గుండిచాదేవి తొందర పెట్టడంతో గడువు పూర్తికాకుండానే రాజు తలుపులు తెరిపిస్తాడు.

పూరీ విగ్రహాలకు కనిపించని అభయహస్తం, వరదహస్తం


శిల్పి కనిపించడు. చేతులూ కాళ్లూ లేని, సగం చెక్కిన విగ్రహాలు మాత్రం దర్శనమిస్తాయి. పశ్చాత్తాపంతో రాజు బ్రహ్మదేవుడిని ప్రార్థిస్తాడు. చతుర్ముఖుడు ప్రత్యక్షమై ఇకమీదట అదేరూపంలో విగ్రహాలు పూజలందుకుంటాయని ఆనతిస్తాడు. తానే స్వయంగా వాటికి ప్రాణప్రతిష్ఠ చేస్తాడు. అందుకే పూరీ ఆలయంలోని విగ్రహాలకు అభయహస్తం, వరదహస్తం కనిపించవు. చతుర్దశ భువనాలనూ వీక్షించడానికా అన్నట్టు ఇంతింత కళ్లు మాత్రం ఉంటాయి.దేశంలో ఎక్కడ లేనివిధంగా పూజలందుకుంటున్న ఇక్కడి ఈ దారు దేవత మూర్తులను 8-12 లేదా 19 సంవత్సరాలకి ఒకసారి మార్చి నూతన దేవతా మూర్తులను ప్రతిష్టించుతూ ఉంటారు .దీనిని నవ కళేబర ఉత్సవంగా నిర్వహిస్తారు . ఈ ఆలయ ఆధ్వర్యంలో జరిగే ఉత్సవాలన్నింటికల్లా ముఖ్యమైనది జగన్నాథ రథయాత్ర." జగన్నాధ రధ యాత్ర " గా పిలవబడే ఈ రధయాత్రలో లక్షలాది మంది భక్తులు పాల్గొంటారు..

12 రోజుల పాటు జరిగే ఉత్సవం

సాధారణంగా ఏ హిందూ ఆలయంలోనైనా సరే, ఊరేగింపు నిమిత్తం మూలవిరాట్టును కదిలించరు. అందుకు ఉత్సవ విగ్రహాలుంటాయి. అలాగే ఊరేగింపు సేవలో ఏటా ఒకే రథాన్ని వినియోగించడం అన్ని చోట్లా చూసేదే. ఈ సంప్రదాయాలన్నింటికీ మినహాయింపు ఒడిశాలోని ఈ పూరీ జగన్నాథ స్వామి ఆలయం. బలభద్ర, సుభద్రలతో సహా ఈ ఆలయంలో కొలువైన జగన్నాథుడిని ఏడాదికొకసారి గుడిలోంచి బయటికి తీసుకువచ్చి భక్తులకు కనువిందు చేస్తారు. ఊరేగించేందుకు ఏటా కొత్తరథాలను నిర్మిస్తారు. అందుకే ఈ జగన్నాథ రథయాత్రను అత్యంత అపురూపంగా భావిస్తారు భక్తులు. ఈ ఉత్సవం ప్రతి సంవత్సరం ఆషాడ శుధ్ధ విధియ రోజున ప్రారంభమై 3 కిలోమీటర్ల దూరంలోని గుండిచా ఆలయం వరకు సాగుతుంది. ఆ తరువాత సుభద్ర , బలబద్ర సమేత జగన్నాథుని ఉత్సవ మూర్తులు బహుదా యాత్ర పేరిట తిరిగి పూరీ ఆలయానికి చేరటంతో ముగుస్తుంది. ఇది 12 రోజులు పాటు జరిగే ఉత్సవం .ఈ యాత్రకి రెండు నెలలముందు నించే దీనికి సంబంధించిన ఏర్పాట్లు మొదలవుతాయి.

రథం ఇలా ఉంటుంది

వైశాఖ బహుళ విదియనాడు రథనిర్మాణానికి కావలసిన ఏర్పాట్లు చేయమని ఆదేశిస్తాడు పూరీ రాజు. అందుకు అవసరమైన వృక్షాలను 1072 ముక్కలుగా ఖండించి పూరీకి తరలిస్తారు. ప్రధాన పూజారి, తొమ్మిది మంది ముఖ్య శిల్పులు, వారి సహాయకులు మరో 125 మంది కలిసి అక్షయ తృతీయనాడు రథ నిర్మాణం మొదలుపెడతారు. 1072 వృక్ష భాగాలనూ నిర్మాణానికి అనువుగా 2188 ముక్కలుగా ఖండిస్తారు. వాటిలో 832 ముక్కల్ని జగన్నాథుడి రథం తయారీకీ, 763 కాండాలను బలరాముడి రథనిర్మాణానికీ, 593 భాగాలను సుభద్రాదేవి రథానికీ వినియోగిస్తారు.ఆషాఢ శుద్ధ పాడ్యమినాటికి రథనిర్మాణాలు పూర్తయి యాత్రకు సిద్ధమవుతాయి. ఇందులో జగన్నాథుడి రథాన్ని " నందిఘోష " అంటారు. 45 అడుగుల ఎత్తున ఈ రథం పదహారు చక్రాలతో మిగతా రెండిటికన్నా పెద్దదిగా ఉంటుంది. ఎర్రటిచారలున్న పసుపువస్త్రంతో ‘నందిఘోష'ను అలంకరిస్తారు. బలభద్రుడి రథాన్ని " తాళధ్వజం " అంటారు. దీని ఎత్తు 44 అడుగులు. పద్నాలుగు చక్రాలుంటాయి. ఎర్రటి చారలున్న నీలివస్త్రంతో ఈ రథాన్ని కప్పుతారు. సుభద్రాదేవి రథం " పద్మధ్వజం " . దీని ఎత్తు 43 అడుగులు. పన్నెండు చక్రాలుంటాయి. ఎర్రటి చారలున్న నలుపు వస్త్రంతో పద్మధ్వజాన్ని అలంకరిస్తారు. ప్రతిరథానికీ 250 అడుగుల పొడవూ ఎనిమిది అంగుళాల మందం ఉండే తాళ్లను కడతారు. ఆలయ తూర్పుభాగంలో ఉండే సింహద్వారానికి ఎదురుగా ఉత్తరముఖంగా ఈ మూడు రధాలనీ నిలబెడతారు.

అంతా ఒక పద్ధతి ప్రకారం...

రధయాత్ర మొదటి రోజున మేళతాళాలతో గర్భగుడిలోకి వెళ్ళే పండాలు అని పిలవబడే ఇక్కడి పూజరులు ఉదయకాల పూజాదికాలు నిర్వహిస్తారు. శుభముహూర్తం ఆసన్నమవగానే ‘ మనిమా (జగన్నాథా) ' అని పెద్దపెట్టున అరుస్తూ రత్నపీఠం మీద నుంచి విగ్రహాలను కదిలిస్తారు. ఆలయ ప్రాంగణంలోని ఆనంద బజారు, అరుణస్తంభం మీదుగా వాటిని వూరేగిస్తూ బయటికి తీసుకువస్తారు. ఈ క్రమంలో ముందుగా దాదాపు ఐదున్నర అడుగుల ఎత్తుండే బలరాముడి విగ్రహాన్ని తీసుకువస్తారు. బలభద్రుడ్ని చూడగానే " జై బలరామా, జైజై బలదేవా " అంటూ భక్తులు చేసే జయజయధ్వానాలతో ఆ ప్రాంతమంతా మారుమోగిపోతుంది. బలరాముడి విగ్రహాన్ని ఆయన రథమైన తాళధ్వజంపై ప్రతిష్ఠింపజేస్తారు. అనంతరం ఆ స్వామి విగ్రహానికి అలంకరించిన తలపాగా ఇతర అలంకరణలను తీసి భక్తులకు పంచిపెడతారు. వాటి కోసం భక్తులు ఎగబడతారు. అనంతరం ఇదే పద్ధతిలో సుభద్రాదేవి విగ్రహాన్ని కూడా బయటికి తీసుకువచ్చి పద్మధ్వజం అనే రథం మీద ప్రతిష్ఠిస్తారు.

జగన్నాథుడి దర్శనం కోసం భక్తుల ఎదురు చూపులు


ఇక ఆ జగన్నాథుడిని దర్శించుకునే క్షణం ఎప్పుడెప్పుడా అని తహతహలాడిపోతుంటారు భక్తులు. దాదాపు ఐదడుగుల ఏడంగుళాల ఎత్తుండే జగన్నాథుడి విగ్రహాన్ని ఆలయ ప్రాంగణంలో నుంచి బయటికి తీసుకువస్తుండగానే " జయహో జగన్నాథా " అంటూ భక్తిపారవశ్యంతో జయజయధ్వానాలు చేస్తారు. ఇలా మూడు విగ్రహాలనూ రథాలపై కూర్చుండబెట్టే వేడుకను " పహాండీ " అంటారు. ఈ దశలో కులమత భేదాలు లేకుండా అందరూ జగన్నాథుడి విగ్రహాన్ని తాకవచ్చు. ఈ మూడు విగ్రహాలనూ తీసుకువచ్చేవారిని దైత్యులు అంటారు. వీరు ఇంద్రద్యుమ్న మహారాజుకన్నా ముందే ఆ జగన్నాథుడిని నీలమాధవుడి రూపంలో అర్చించిన సవరతెగ రాజు విశ్వావసు వారసులు. ఆలయ సంప్రదాయాల ప్రకారం ఊరేగింపు నిమిత్తం మూలవిరాట్టులను అంతరాలయం నుంచి బయటికి తీసుకువచ్చి రథాల మీద ప్రతిష్ఠింపచేసే అర్హత వీరికి మాత్రమే ఉంటుంది.

బంగారు చీపురుతో శుభ్రం చేసే సంస్థానాదీశులు

సుభద్ర, జగన్నాథ, బలభద్రులు రథారూఢులై యాత్రకు సిద్ధంగా ఉండగా పూరీ సంస్థానాధీశులు అక్కడికి చేరుకుంటాడు. జగన్నాథుడికి నమస్కరించి రథం మీదికి ఎక్కి స్వామి ముంగిట బంగారు చీపురుతో శుభ్రం చేస్తాడు. ఈ వేడుకను " చెరా పహారా " అంటారు. అనంతరం స్వామిపై గంధం నీళ్లు చిలకరించి కిందికి దిగి రథం చుట్టూ మూడుసార్లు ప్రదక్షిణం చేస్తాడు. ఇదే తరహాలో బలరాముడినీ, సుభద్రాదేవినీ అర్చించి వారి రథాల చుట్టూ కూడా ప్రదక్షిణ చేస్తాడు. అనంతరం రథాలకు తాత్కాలికంగా అమర్చిన తాటిమెట్లను తొలగిస్తారు. ఇక యాత్ర మొదలవడమే తరువాయి.జగన్నాథుడి రథం మీదుండే ప్రధాన పండా నుంచి సూచన రాగానే కస్తూరి కళ్లాపి చల్లి హారతిచ్చి " జై జగన్నాథా " అని పెద్దపెట్టున అరుస్తూ తాళ్లను పట్టుకుని రథాన్ని లాగడం మొదలుపెడతారు. విశాలమైన బోడోదండ అని పిలవబడే ప్రధానమార్గం గుండా ఈ యాత్ర మందగమనంతో సాగుతుంది.

నెమ్మదిగా కదిలే రథం

లక్షలాది భక్తజనం నడుమ జగన్నాథుడి రథం అంగుళం అంగుళం చొప్పున చాలా నెమ్మదిగా కదులుతుంది. దీన్నే ఘోషయాత్ర అంటారు. భక్తుల తొక్కిసలాటలో చక్రాలకింద ఎవరైనా పడినా, దారిలో ఏ దుకాణమో అడ్డువచ్చినా రథం వెనకడుగు వేసే ప్రసక్తే ఉండదు. అడ్డొచ్చిన దుకాణాలను కూలగొట్టైనా సరే ముందుకే నడిపిస్తారు.ఈ యాత్ర ఎంత నెమ్మదిగా సాగుతుందంటే జగన్నాథుడి గుడి నుంచి కేవలం మూడు మైళ్ల దూరంలో ఉండే గుండీచా గుడికి చేరుకోవడానికి దాదాపు పన్నెండుగంటల సమయం పడుతుంది. గుండీచా ఆలయానికి చేరుకున్నాక ఆ రాత్రి బయటే రథాల్లోనే మూలవిరాట్లకు విశ్రాంతినిస్తారు. మర్నాడు ఉదయం మేళతాళాలతో గుడిలోకి తీసుకువెళతారు. వారం రోజులపాటు గుండీచాదేవి ఆతిథ్యం స్వీకరించిన అనంతరం దశమినాడు తిరుగు ప్రయాణం మొదలవుతుంది. దీన్ని " బహుదాయాత్ర " అని అంటారు. ఆ రోజు మధ్యాహ్నానికి మూడు రథాలూ జగన్నాథ ఆలయానికి చేరుకుని గుడిబయటే ఉండిపోతాయి.

స్వామి వారిని దర్శించుకునేందుకు బారులు తీరే భక్తులు


మర్నాడు ఏకాదశినాడు స్వామివార్లను బంగారు ఆభరణాలతో అలంకరిస్తారు. సునావేషగా వ్యవహారించే ఈ వేడుకను చూసేందుకు బారులు తీరుతారు భక్తులు. ద్వాదశినాడు విగ్రహాలను మళ్లీ గర్భగుడిలోని రత్నసింహాసనంపై అలంకరించడంతో యాత్ర పూర్తయినట్లే. యాత్రపేరిట పదిరోజులుగా స్వామి లేని ఆలయం నూతన జవజీవాలు పుంజుకుని కొత్తకళ సంతరించుకుంటుంది.ఇలాంటి ఎన్నో విశిష్టతలూ , భిన్న సంస్కృతులూ, సాంప్రదాయాలు కలగలిసిన ఈ పూరీ జగన్నాధుని ఆలయాన్ని ఏటా ఎన్నో లక్షల మంది సందర్శిస్తారు.

English summary
Purushottama, Sri Kshetram Purijagannadhanu importance..
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X