• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఈ శరీరం-ఆత్మ ఏమిటి? భగవద్గీతలో ఏం చెప్పారు, దేనిని దేంతో పోల్చారు?

|

మనల్ని మనం చూసుకొనేపుడు ముందుగా కన్పించేది భౌతిక శరీరం. ఒకచోటు నుంచి మరోచోటుకి పోవాలన్నా, జ్ఞానేంద్రియాల ద్వారా వచ్చే ప్రాపంచిక విషయాలను గ్రహించాలన్నా చైతన్యం ఉంటేనే సాధ్యమవుతుంది. మన దైనందిత జీవితంలో జాగ్రదావస్థలోనే గాకుండా, గాఢ నిద్రలో ఉన్నపుడు మనస్సు , ఇంద్రియాలు పనిచెయ్యవు. ఐనా ఊపిరి పీల్చుకోడం, గుండె కొట్టుకోవడం అనే ప్రక్రియలు జరుగుతూనే ఉంటాయి. అప్పుడు మనలను జీవింప జేసేది ప్రాణము. అది శ్వాస రూపంలో ప్రాణశక్తిగా శరీరాన్ని, అవయవాలను నడిపిస్తుంది. ఈ ప్రాణ శక్తి మనలో ఉండే సూక్ష్మ శక్తి. దేహంలో ఉండే చేతనమంతా ప్రాణము యొక్క వ్యాపారమే నని చెప్తారు.

జీవం అంటే శరీరానికీ ప్రాణానికీ ఉండే సంబంధమని చెప్పుకోవచ్చు. ఈ సంబంధం తెగిపోతే ప్రాణం పోయిందని అంటాం. అప్పుడీ భౌతిక శరీరాన్ని మృతదేహమంటాం. వాస్తవానికి శరీరం గాని, ప్రాణం గాని స్వతఃగా చైతన్యం లేనివే. మరి వీటికి చైతన్యాన్ని కలిగించే దేదో తెలుసుకోవాలి. ఒక విషయం గాని, వస్తువుగాని మనకు తెలియాలంటే అక్కడ చూసే వాడొకడు ఉండాలి. చూడబడే వస్తువు లేక విషయం ఉండాలి. ఈ రెండిటినీ కలిపే చూడటం అనే ప్రక్రియ జరగాలి. అంటే చూసేవాడు, చూడబడే వస్తువు, చూడడం అనే క్రియ ఉండాలి. ఆ వస్తువుతో భౌతిక సంబంధం లేకపోయినా మనస్సు జ్ఞానేంద్రియాల ద్వారా; ఆ జ్ఞానాన్ని కల్గించేది చైతన్యమే. మనస్సు, ఇంద్రియాలు అన్నీ ప్రకృతి నుంచే ఏర్పడ్డాయి. ప్రకృతి జడము. అంచేత ఇవి చైతన్యవంతములు కావు. చూసే వస్తువుకు, చూసే వాడికి చూడడం అనే ప్రక్రియలకు వెనుక ఎరుక ఉన్నపుడే ఆ వస్తువు తెలియ బడుతోంది. ఆ ఎరుకే(awareness) చిత్త వృత్తి ద్వారా విషయానుభవం కలిగించేది.

What is this body and Soul?

స్వప్న జాగ్రదావస్థలలో సహితం శరీరాన్ని ఆశ్రయించి ఉండే ప్రాణం కూడ ఇంద్రియాలూ, మనస్సులాగ శాశ్వతం కాదు. కాని వీటన్నిటికీ చైతన్యాన్ని ఇచ్చేది, చిత్త వృత్తుల ద్వారా విషయానుభవం కలిగించేదీ, చూసే వాడి వెనుక ఉండే చైతన్యమనే ఎరుకను ఆత్మ అంటారు. అదే అన్ని భూతాల అంతరాత్మగా చెప్పబడే బ్రహ్మము, లేక క్షేత్రజ్ఞుడు.

ఇదే విషయాన్ని ప్రశ్నోపనిషత్తులో ప్రాణం ఆత్మ నుంచే అంటే బ్రహ్మము నుండే ఉద్భవించి నట్లుగా చెప్ప

బడింది. ప్రాణానికీ ఆత్మకూ గల సంబంధం మనిషికీ నీడకూ ఉండే సంబంధం వంటిదని అంటోంది. అంటే నీడను మనిషి నుంచి విడదీయలేం. అలాగే ప్రాణానికీ ఆత్మకూ ఉండే సంబంధం కూడా విడదీయలేనిదే. శరీరంలో ఆత్మ ఉన్నదంటే ప్రాణము ఉంటుంది. ఛాందోగ్యోపనిషత్తులో ప్రాణము ముఖ్య ప్రాణముగా చెప్పబడింది. ఆత్మ దేన్లో అద్దమునందు వలె ప్రతిబింబము చెందుతుందో, అదే ప్రాణమని చెప్పబడింది. రాజువద్ద ముఖ్యాధికారి పనులన్నిటినీ ఎలా చేసి పెడుతుంటాడో, అలా ఆత్మ క్రింద, సర్వాధికారాన్నీ ప్రాణము జరుపుతుంది. ఇది పరమాత్మను నీడలా అంటి ఉంటుందని చెప్ప బడింది.

మనస్సు ఆత్మకు అనుభవాలను కలిగించే పని ముట్టు లాంటిది. మనస్సు ద్వారా బాహ్యవిషయాలను అనుభవంలోకి తెచ్చుకొని, తిరిగి కర్మేంద్రియాల ద్వారా పనులను చేయిస్తుంది. ఇలా ప్రాణమే మనలో సమస్తాన్ని నడిపిస్తూ, ఆత్మ వల్ల చైతన్యం కలిగి ఉంటుంది. ఆత్మ ప్రాణ వాయువూ కాదు, మనస్సూ కాదు. అది శుద్ధమైనదని వేదాలు చెబుతున్నాయి.

రమణ మహర్షి వారు ఆత్మను గురించి ఇలా అంటారు. "చూడబడేది, చూసేది, చూపు అన్నీఅదే. ఆత్మ సాక్షాత్కారంలో చూడబడేదేమీ ఉండదు. ఎరుకయే దాని సస్వరూపం. దాని వెలుగులోనే శరీరము, అహంకారము, ప్రపంచమూ ప్రకాశిస్తాయి. మనస్సెంత ఉరకలు వేస్తున్నా అది అత్మవల్లనే. మనస్సు, శరీరం, ప్రపంచం వీటికి ఆత్మను విడిచి ఉనికి లేదు. చూసేవాడు ఆత్మ. కాని ప్రజలది తెలిసికోక, చూడబడే దానివెంట పరుగులు పెడుతుంటారు. తానున్నాని తెలిసినా, తానెవరో మాత్రం తెలియదు. అతడు ప్రపంచాన్ని చూస్తాడు. కాని అది బ్రహ్మమేనని గ్రహించడు".

"తెంపులేని ఎరుకయే ఆత్మ. మనిషి అంటే దేహము, ఆత్మ, మనస్సుల కలయిక. ఆత్మే చైతన్యవంతమైన శక్తి. దాన్నుంచే పుట్టి ; మనస్సు జడమైన దేహంతో కలసి ఇది నేను, అది నేను అంటుంది. అదే దేహాత్మ బుద్ది. ఆత్మ లేకుండా మనస్సు నిలువలేదు. మనస్సు ప్రాణం సహాయంతో దేహానికి కదలికను ఇచ్చి, తను చక్రవర్తిలా దేహేంద్రియాలతో ఇష్టం వచ్చినట్లు పనులు చేయించు కుంటుంది".

భగవద్గీతలో ఆత్మ గురించి ఇలా చెప్పబడింది. ఈ విశ్వమంతా వ్యాపించివున్న ఆత్మనాశనం లేనిది. దానినెవరూ అంతం చేయలేరు. నాశనం లేని ఆత్మకు ఈ శరీరాలు శాశ్వతాలు కావు. ఆత్మ చంపేది కాని చచ్చేది కాని కాదు, ఆత్మకు పుట్టడం చావడం అనేవి లేవు. అది ఒకప్పుడు ఉండి, మరొకప్పుడు లేకపోవడం జరగదు. జన్మరహితమూ, శాశ్వతమూ, అనాది సిద్ధమూ అయిన ఆత్మ నిత్యం. మానవుడు చినిగిపోయిన పాతబట్టలను విడిచిపెట్టేసి కొత్తబట్టలు వేసుకున్నట్లే ఆత్మ కృశించిన శరీరాలను వదలి కొత్త దేహాలు పొందుతుంది. ఈ ఆత్మను ఆయుధాలు నరకలేవు; అగ్ని కాల్చలేదు; నీరు తడుపలేదు; గాలి ఎండబెట్టలేదు. ఆత్మ ఖండించరానిది, కాలనిది, తడవనిది, ఎండనిది; అది నిత్యం, సర్వవ్యాప్తం, శాశ్వతం, చలనరహితం, సనాతనం. ఆత్మ జ్ఞానేంద్రియాలకు గోచరించదు. మనస్సుకు అందదు. వికారాలకు గురికాదు. ఇది స్థిరమైనది, అభిన్నము, ఆకారము లేనిది. దేశ, కాల, నిమిత్తాలకు అతీతమైనదీను. నిత్య పరిశుద్ధం. పరిపూర్ణము.

ఆ ఆత్మయే బ్రహ్మమని 'అయమాత్మా

బ్రహ్మ' - అని బృహదారణ్య

కోపనిషత్తు నందు చెప్పబడింది. అంటే ఈ జీవాత్మయే బ్రహ్మ. ఐతరేయోపనిషత్తు తృతీయాధ్యాయం మానవునికీ భగవంతునికీ ఉండే సంబంధాన్ని వివరిస్తుంది. అన్ని కార్యకలాపాలకూ ఆత్మే ఆధారమనీ, ఆ ఆత్మే బ్రహ్మమనీ చెబుతోంది. శరీరం లయమైనా ఆత్మలయమవ్వదు. నిత్యము, శుద్ధము, బుద్ధము (అంటే జ్ఞానరూపము), ముక్తము ( బంధం లేనిది), ఇది ఇంత అని చెప్పడానికి తగ్గ కారణం లేపోడం వల్ల నిరవధికము. దేశాన్ని బట్టి గాని కాలాన్ని బట్టి గాని దీనికి పరిమితులు లేవు గనుక అనంతమని చెప్పబడింది. జ్ఞానానికి అవధి లేదు గనుక సర్వజ్ఞమని చెప్పబడింది.

స్వయం ప్రకాశము, విజ్ఞాన మయము. నామరూప రహితము, గుణరహితము, అద్వితీయము, నిత్యబోధా స్వరూపము, సచ్చిదానందము, ఉపాధి రహితము. బ్రహ్మము సత్యము, జ్ఞానము, అనంతమని చెప్పబడింది. సర్వ వ్యాపి, సర్వజ్ఞుడు. ఏకము అద్వితీయము అవడం చేత వాస్తవానికి లక్షణాలు చెప్పలేం. అంచేతనే మనో వాక్కులకు అతీతమైనదని, అనిర్వచనీయమని చెప్పబడింది. ఈ లక్షణాలు సాధకుడు అవగాహన చేసుకునేందుకు బ్రహ్మము ప్రపంచంలో ఉండే వస్తువువంటిది కాదని చెప్పడానికే సత్యత్వాది లక్షణాలు అరుంధతీ న్యాయంగా చెప్పబడ్డాయి. అరుంధతీ న్యాయమంటే - అరుంధతీ నక్షత్రం చూప దలచుకునే వాడు దాని దగ్గరే ఉన్న ఒక పెద్ద నక్షత్రాన్ని అదే అరుంధతి అని చూపి, తర్వాత అది కాదు నిజమైన అరుంధతి అని చెప్పి, నిజమైన అరుంధతిని ఏ విధంగా చూపుతాడో అలాగే ఈ సత్యత్వాది లక్షణాలు చెప్పబడ్డాయి.

ఒకడు ఈ ఆత్మను ఆశ్చర్యంగా చూస్తున్నాడు. ఇంకొకడు దీన్ని గురించి విచిత్రంగా మాట్లాడుతున్నాడు. మరొకడు వింతగా వింటున్నాడు. అయితే ఈ ఆత్మ స్వరూపస్వభావాలు పూర్తిగా తెలుసుకున్న వాడు ఒక్కడూ లేడని భగవద్గీతలో చెప్పబడింది. శాస్త్రం అవిద్యచేత కలిగే భేదం తొలగించడం కోసమే గాని, బ్రహ్మమంటే 'ఇది' అని కొమ్ము పట్టుకొని ఎద్దును చూపినట్లు చూపడానికి కాదు శాస్త్ర ప్రయోజనం. బ్రహ్మ ఏ ప్రమాణానికీ విషయం కాదు. శాస్త్రం ఆవిధమైన కల్పితమైన సంసారాన్ని తొలగించి, ఆత్మస్వరూపాన్ని మనకు అంద చెయ్యడానికే.

ఆత్మ భగత్ సముద్రానికి చెందిన బిందువు. పరమాత్మ నుంచి భౌతిక శరీరాల్లోకి దిగుతూ అంధకారమనే పొరలతో ఆవరించబడి తానెవరో, ఎక్కడనుంచి వచ్చిందో మరచిపోతుంది. అపుడు ద్వైతభావమేర్పడి, నేను, నాది అనడం మొదలుపెడుతుంది. ఇదే ఆహంకారమంటే. తన మూలాన్ని మరచి, శరీరమే తానని భ్రమలో పడుతుంది. మనస్సు చంచలమైనది. ఇంద్రియాల ద్వారా బయటకు, లోపలకు తిరుగాడుతూనే ఉంటుంది. విషయాలతో ఐక్యం చెంది, కోర్కెలతో జీవుడిని ఉర్రూతలూగిస్తుంటుంది. ఇలా మనస్సుతో పెట్టుకున్న సంబంధం వల్ల, శరీరానికే యజమానిగా ఉండవలసిన ఆత్మ, మనసు చేయించే పనులయొక్క కర్మ ఫలాన్ని, అనుభవించ వలసి వస్తుంది. ఇదే బంధాన్ని కల్గించేది, మనలను ఈ జనన మరణ సంసార చక్రంలో బందీలను చేసేదీను. అందువల్ల ఆత్మకు తానెవరో, ఎక్కడనుండి వచ్చిందో తెలుసుకొని తన స్వంతమైన ధామాన్ని చేరే వరకూ ఈ బాధలు తప్పడంలేదు.

మనశరీరంలో ఉండే సత్పదార్ధమే ఆత్మ. మిగిలినవన్నీ నాశనమయ్యేవే. ఇదే శరీరాన్ని, ఇంద్రియాలనూ, మనస్సునూ, బుద్దినీ , ప్రాణాన్నీ నడిపించే చైతన్యం. ఇది లేకుండా మన శరీరంలో ఏ కార్యమూ జరుగదు. అందుకే ఆత్మను యజమాని అనేది.

భగవద్గీతలో మన శరీరము రధముగా పోల్చబడింది.

బుద్ది- దీన్ని నడిపే సారధిగా

జ్ఞానేంద్రియాలు - పరుగిడే గుర్రాలుగా

మనస్సును - పగ్గములుగా

జ్ఞాన విషయాలు - మార్గాలుగానూ

జీవుడు / ఆత్మ - దీన్లో ప్రయాణం చేసేది గాను చెప్పబడింది.

జీవితం గురించి, గమ్యం గురించి సరైన అవగాహన లేకపోతే మనస్సు అదుపులోలేక, ఇంద్రియాలు తమ ఇష్టంవచ్చినట్లు ప్రవర్తిస్తాయి. మనస్సును సరిగ్గా నియంత్రించే బుద్దియొక్క అదుపాజ్ఞలలో ఉంటే శరీరమనే రధం సరిగ్గా నడుస్తుంది. మనస్సుని బిగించడం అంటే కోర్కెలను అదుపులో పెట్టుకుని వైరాగ్యాన్ని అభ్యసిస్తే సాక్షిగా ఉండే ఆత్మ మనకు లభ్యమవుతుంది.

English summary
Atman, in Hinduism, is considered as eternal, imperishable, beyond time, "not the same as body or mind or consciousness, but is something beyond which permeates all these".
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X