• search
  • Live TV
తిరుపతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

నేడు కలియుగ వాసుని అపర భక్తురాలు తరిగొండ వెంగమాంబ వర్దంతి

|

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151

భక్తికి ప్రతిరూపంగా కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లిగా అంటరానితనం నిర్మూలన కర్తగా మెట్ట ప్రాంత ఆరాధ్య దేవతగా విరాజిల్లుతున్న తరిగొండ వెంగమాంబ 18 వ శతాబ్దానికి చెందిన తెలుగు కవయిత్రి, తిరుమల వేంకటేశ్వర స్వామి భక్తురాలు. వేంకటాచల మాహాత్మ్యము, ద్విపద భాగవతము వంటి ఆధ్యాత్మిక కావ్యాలు రచించింది.

జీవిత విశేషాలు:- వెంగమాంబ చిత్తూరు జిల్లా గుర్రంకొండ మండలములోని తరిగొండ గ్రామములో వాసిష్ఠ గోత్రీకుడైన కానాల కృష్ణయ్య , మంగమాంబ అను నందవరీక దంపతులకు 1730లో జన్మించింది. వెంగమాంబ బాల్యంలో తన తోటి పిల్లల్లాగా ఆటలాడుకోక ఏకాంతంగా కూర్చొని భక్తి పారవశ్యంలో మునిగితేలేది. ఆ చిరు ప్రాయంలోనే అనేక భక్తి పాటలను కూర్చి మధురముగా గానము చేసేది. తండ్రి ఆమె భక్తిశ్రద్ధలను గమనించి ఆమె నైపుణ్యమును సానబెట్టుటకు సుబ్రహ్మణ్య దీక్షితులు అనే గురువు వద్దకు శిక్షణకు పంపినాడు. దీక్షితులు ఆమె ప్రతిభను గుర్తించి తనకు తెలిసిన పరిజ్ఞానమంతా వెంగమాంబకు బోధించాడు. అనతి కాలములోనే వెంగమాంబ ప్రశస్తి నలుమూలల పాకడముతో తండ్రి ఆమె విద్యాభ్యాసాన్ని మాన్పించి తగిన వరుని కోసం వెతకడం ప్రారంభించాడు.

Who is Tarigonda Vengamamba..? As a devotee of Lord venkateshwara what did she do?

ఇంటి పనులలో సహాయము చేయమని తల్లి చెప్పినపుడు తన సేవ భగవంతునికే అర్పణమని వెంగమాంబ తిరస్కరించింది. అనేక మంది వరులు ఆమెను చూచి చాలా అందముగా ఉన్నదనో, చాలా తెలివైనదనో నెపములతో పెళ్లి చేసుకొనుటకు సమ్మతించలేదు. చివరకు ఇంజేటి వెంకటాచలప్ప వెంగమాంబను చూసి ముగ్ధుడై ప్రేమలో పడి ఆమెను వివాహమాడుటకు అంగీకరించాడు. తండ్రి వివాహం జరిపించాడు. వివాహానంతరము వెంకటాచలప్ప ఆమె భక్తి మౌఢ్యాన్ని వదిలించే ప్రయత్నం చేసాడు కానీ వెంగమాంబ అతనిని దగ్గరికి రానివ్వలేదు.

ఈమె తిరుమలలో ఆలయానికి ఉత్తరాన 15 కి.మీ. దూరాన దట్టమైన అడవులలో తుంబురు కోన వద్ద యోగాభ్యాసం చేస్తూ గడపినట్లు తెలుస్తున్నది. ఈమెకు వేంకటేశ్వరుడు కలలో కనిపిస్తూ ఉంటాడని అనేవారు. తిరుమలలో ఉత్తర వీధిలో ఉత్తర దిశలో ఉన్న వనంలో ( ప్రస్తుతం ఉన్న ఒక పాఠశాలలో ) ఈమె సమాధి ఇప్పటికీ ఉంది. ఈమె ప్రతి రాత్రి ఊరేగింపుగా తన ఇంటి ముంగిటికి వచ్చే భోగ శ్రీనివాసమూర్తికి వెండి పళ్ళెంలో ముత్యాల హారతి ఇస్తూ ఉండేదట. ఇందుకోసం ఒక్కొక్కదినం నగిషీలు చెక్కబడిన వెండిపళ్ళెంలో ఒక్కొక్క దశావతార ఘట్టాన్ని సమర్పించేదట. ఈ విషయం క్రీ.శ. 1890లో ఈస్ట్ ఇండియా కంపెనీవారు తయారు చేసిన కైంకర్య పట్టీ వలన తెలుస్తున్నది. ఈమె తన జీవితాంతం శ్రీవేంకటేశ్వరుణ్ణి ఆరాధించింది. చివరకు క్రీ.శ.1817 ఈశ్వర సంవత్సరం శ్రావణ శుద్ధ నవమినాడు తరిగొండ వెంగమాంబ వేంకటేశ్వరస్వామిని స్మరిస్తూ సజీవ సమాధి చెందింది.

రచనా వైశిష్ట్యం:- సాహిత్యంలో మెలకువలు, రహస్యాలు తెలియకనే , అలంకార వ్యాకరణాది శాస్త్రాలు చదవకనే కేవలం తన ఇష్టదైవం తరిగొండ నృసింహస్వామి దయ వల్లనే తనకు కవిత్వం చెప్పడం వచ్చిందని, తన కృతి వేంకటాచలమాహాత్మ్యం అవతారికలో వేంకమాంబ ఇలా అన్నది.

నా చిననాట నోనామాలు నైన నా

చార్యుల చెంతనే జదువలేదు

పరుగు ఛందస్సులో బది బద్యములనైన

నిక్కంబుగా నేను నేరలేదు

లలికావ్యనాటకాలంకారశాస్త్రము

ల్వీనులనైనను వినగలేదు

పూర్వేతిహాస విస్ఫురితాంధ్రసత్కృతు

ల్శోధించి వరుసగ జూడలేదు

చేరి తరికుండపురి నారసింహదేవు

డాన తిచ్చిన రీతిగ నే నిమిత్త

మాత్రమున బల్కుదును స్వసామర్థ్యమివ్వ

దరయ నించుక యేని నా యందు లేదు.

కావ్యరచనలో పూర్వకవులు తొక్కని దారి లేదు. చెప్పని భావాలు లేవు కదా. నువ్వు కొత్తగా చెప్పేదేముందని ఇప్పుడు కావ్యం రచించావు? ప్రాచీనుల కన్న నీ గొప్పతనం ఏమిటి? అనేప్రశ్నకు, తల్లితండ్రులకు, చిన్నపిల్లల జిలిబిలి పలుకులు ముద్దుగొల్పుతూ ఉంటాయని తరిగొండ వేంకమాంబ పండితులను , ప్రజలను ఇలా వేడుకుని , తన కావ్యాన్ని రుచి చూపింది.

పండితాగ్రగణ్యులార ప్రజలారా నా

బాలభాష కసూయపడక వినుడు

తల్లిదండ్రులు చిన్నపిల్లల పల్కుల

కానంద మొందెడునట్టు యిందు

మీరు నా తప్పొప్పు లేరీతిగానైన

గేలి సేయక చిత్తగింపవలయు

నాంధ్రగీర్వాణ మహాకృతులుండగా

నిప్పుడీ కృతి వినవేల యనగ

భక్ష్యములు మెక్కి యావల బచ్చడియును

నంజుకొనిన విధంబున నా ప్రబంధ

మాలకింతు రటంచు బేరాస చేత

నేను రచియింతు దాని మన్నించి గనుడు.

పండితులను, ప్రజలను, తన కావ్యాలను స్థాలీపులాకన్యాయంగా స్వీకరించి తనని ఉద్ధరించమని వేడుకొనడంలో వెంగమాంబ వినయశీలం స్పష్టమవుతూంది. రచన తర్వాత లక్షణం పుడుతుంది. కవి సమాజజీవి. శాస్త్రాలన్నీ సమాజజీవితం నుంచే పుడతాయి. శాస్త్రాన్ని అభ్యసించకపోయినా జీవితానుభవం ఉంటుంది కాబట్టి శాస్త్ర విషయాలు, అనుభవ విషయాలు సహజంగానే రచనలో చోటు చేసుకుంటాయి.

వేంకమాంబ గంభీరమైన యోగ రహస్యాలను సరళ సుందరమైన భావమధురమైన శైలిలో వివరించింది. లలితమైన శృంగార భావనలను కూడా రమణీయశైలిలో చెప్పింది. యోగతత్వ విషయాలను ఎంతో విజ్ఞానప్రదంగా చెప్పింది. ప్రణయకోపాలను , సవతి మాత్సర్యాలను , నర్మగర్భసంభాషణలను, స్త్రీల ఎత్తిపొడుపు మాటలను , శ్రీకృష్ణుని శృంగారలీలలను , సహజంగా , రసవత్తరంగా , హృదయానికి హత్తుకునేలా చెప్పింది. ఆమె ఆత్మవిశ్వాసంతో మధురభక్తి కాక , జ్ఞానాత్మకమైన యోగభక్తితో, పాండిత్యాన్ని ప్రదర్శిస్తూ రచనలు చేసింది.

ఈమె పాడుకోడానికి వీలైన సింగారపు పాటలు, నలుగు పాటలు, ఆరగింపు పాటలు , నిద్ర పుచ్చే పాటలు , మంగళహారతి పాటలు వ్రాసి, తన రచనలను సంగీత సాహిత్య సమ్మేళనాలుగా రూపొందించింది. తరికొండ వేంకమాంబ రచించిన శ్రీకృష్ణమంజరి చాలా ప్రశస్తమైన స్తుతికావ్యం. దీనిని వావిలికొలను సుబ్బారావు ("ఆంధ్ర వాల్మీకి" వాసుదాస స్వామి) తమ భక్తిసంజీవని అనే పత్రికలో జనవరి 1929 సంచికలో ప్రచురిస్తూ, ఈమెను మహాయోగిని , భక్తురాలు, కవయిత్రిగా పేర్కొన్నాడు.

శ్రీ వెంకటేశ! నా చిత్తంబు నందు

నీ పాదయుగళంబు నిల్పవే కృష్ణ

నన్నేల తరిగొండ నరహరాకృతిని

బ్రత్యక్షమై నన్ను బాలింపు కృష్ణ !

అని ఈ స్తుతిమంజరి కావ్యం మొదలై చివరలో ఈమె తల్లిదండ్రులు కానాల మంగమాంబ, కృష్ణయామాత్యుడు అని చెప్పడం జరుగుతుంది.

సంస్కృత వరాహ , భవిష్యోత్తర , పద్మపురాణాలలోని వేంకటాచల మహాత్యం ప్రశంసలు ఆధారంగా , వేంకమాంబ , 'వేంకటాచల మాహాత్మ్యం' రచించింది. దీనిలో పద్మావతీ శ్రీనివాసుల వివాహ వృత్తాంతాన్ని ఎంతో రమణీయంగా రూపొందించింది. .స్త్రీ హృదయాంతరాళాలలోని సున్నితభావాలను , ఆత్మాభిమానాన్ని , ఆత్మగోపనాన్ని వేంకమాంబ అత్యంతమార్దవంగా , మార్మికతతో , చాకచక్యంతో , సరసంగా చిత్రించింది. శ్రీనివాసుని ద్వితీయవివాహసందర్భంలో లక్ష్మీదేవి అనుభవించిన బాధను ఆమె సమర్థంగా వర్ణించింది. ఇది వెంకటగిరి క్షేత్రమహాత్యం వర్ణించే కావ్యం.

వేంకమాంబ తాను భాగవతం ద్వాదశస్కంధాలను ద్విపద కావ్యాలుగా రచించినట్టు, వేంకటాచల మాహాత్మ్యంలోని ఒక పదంలో చెప్పుకొంది.

ఈ ద్విపద భాగవతంలో తత్వార్థాలను పామరులకు కూడా సరళ సుబోధకం చేయడానికి వేంకమాంబ తేటతెలుగు పదాలను ప్రయోగించి సంక్షిప్తసుందరం గావించినట్టు ఈ ద్విపద పంక్తులను బట్టి తెలుస్తున్నది. వేశ్యాంగన ముద్దుపళని వ్రాసిన రాధికా సాంత్వనము అనే శృంగార ప్రబంధంలో వలె మితిమీరిన శృంగారవర్ణనలు చేయక కులాంగన అయిన వేంకమాంబ శృంగారం పేర అసభ్యవర్ణనలు చేయలేనని వేంకటేశ్వరమాహాత్మ్యంలో శ్రీకృష్ణునికి, అనగా కలియుగ ప్రత్యక్షదైవం వేంకటేశ్వరస్వామికి ఇలా విన్నవించుకోవడం సమంజసంగానే ఉంది.

శృంగారాకృతి తోడ పచ్చి పదముల్‌ శృంగారసారంబు తో

డం గూఢంబుగ జెప్పు నీవనగ నట్లే చెప్పలేనన్న నన్‌

ముంగోపంబున జూచి లేచి యటనే మ్రొక్కంగ మన్నించి

తచ్ఛృంగారోక్తులు తానె పల్కికొను నా శ్రీకృష్ణుని సేవించెదన్‌.

వేంగమాంబ తన కావ్యంలో పచ్చి శృంగార వర్ణనలు చేయలేదు సరి కదా, అక్కడక్కడ సందర్భోచితంగా వెలువడిన శృంగార పద్యాలు కూడా కృతిపతి శ్రీకృష్ణుని చమత్కారాలే అని లోకానికి చెప్పినట్టు తెలిస్తున్నది. ఎరుకసాని పాత్రను వేంకటాచల మాహాత్మ్యం కావ్యంలో ప్రవేశపెట్టి పాత్రోచితభాషగా సోదిభాషను ప్రయోగించి, నాటకీయతను, రమణీయతను కలిగించింది వేంకమాంబ అవ్వోయవ్వ నీ తలంచిన తలంపు మేలవుతాదంట. దేవుళ్లు పలుకుసుండారు. తలచిన తలపేమంటివా, సెప్పెద విను దయితమ్మ ! ఆ నల్లనయ్య యే దిక్కు నుండి వచ్చినాడంటావా ? తల్లి ఇదిగో ఈ మూల నుండి వచ్చాడే....తరిగొండ వేంగమాంబ శైలి, వేదాంతవిషయవివరణ సందర్భంలో కూడా మధురమై వ్యావహారికానికి సన్నిహితమై ఉండటం విశేషం.

ఆమె రచనలు ఆత్మజ్ఞానానికి, ఔచిత్యానికి ఆటపట్టు. ఈమె నిర్గుణోపాసన నుంచి, సగుణోపాసులోకి దిగి మధురభక్తి సంప్రదాయాన్ని గురించి ప్రబోధాత్మకమైన, భక్తిదాయకమైన, రసోప్లావితమైన, అధ్యాత్మికచింతనాభరితమైన కమనీయ కావ్యాలను రమణీయంగా రచించి, ఆంధ్రపాఠకలోకానికి అందించింది. శ్రీమహావిష్ణువు వరాహావతారంలో హిరణ్యాక్షుని సంహరించి పాతాళాంతర్గతయైన భూమిని ఉద్ధరించిన తరువాత తన అవతారం గురించి భార్య లక్ష్మీదేవి ఏమి అడుగుతుందో ఎలా గేలి చేస్తుందో అని తన సందేహాలను విష్ణువు గరుత్మంతునితో హాస్యంగా సంభాషించిన ఘట్టాలను ఆమె వర్ణించిన తీరు అత్యద్భుతమని విమర్శకులు శ్లాఘించారు.

విశేషాలు:- పలు ప్రక్రియలలో ఇన్ని గ్రంథాలు వ్రాసిన కవయిత్రులు ఆ కాలంలో లేరు. ఇటీవలే వెంగమాంబకు సంబంధించిన జీవిత విశేషాలను, రచనల వివరాలను తెలుపుతూ ఒక జాతీయ సదస్సును తిరుమల తిరుపతి దేవస్థానములు ఉద్యోగుల శిక్షణా సంస్థ డైరెక్టర్ భూమన్ ప్రారంభించాడు. ఆమె కీర్తనలకు ప్రాచుర్యం కలిగించే లక్ష్యంతో "జీవనగానం" అవే సి.డి.ని 2007లో విడుదల చేశారు.

తరిగొండ శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో వెంగమాంబ ప్రతిమ తరతరాలుగా పూజలు అందుకొంటున్నది. జనవరి 1 న ఇతర పర్వదినాలలో ప్రత్యేక పూజలు జరుగుతాయి. ఉత్తర మాడా వీధిలో నివసించే తరిగొండ వెంగమాంబ హారతి తీసుకోనిదే బ్రహ్మోత్సవాల సమయంలో ఆమె ఇంటి ముందు నుండి కదలని రథానికి గుర్తుగా ప్రతీరోజూ రాత్రి ఏకాంతసేవ అనంతరం వెంగమాంబని పాట పాడి హారతి ఇమ్మని భక్తులూ, అర్చకులూ అడిగేవారట. కాలక్రమంలో అది ఒక సేవగా స్థిరపడిపోయింది. ఈ సేవనే తరిగొండ ముత్యాల హారతి అనేవారు. వెంగమాంబ తరువాత ఆమె దత్తపుత్రిక వారసురాలయ్యింది. అదే పరంపర నేటికీ కొనసాగుతుంది.

English summary
Today marks an important day in history. Tarigonda Vengamamba who was a staunch devotee of Lord Venkateshwara died and today is her death anniversary.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X