వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మనసు: నీళ్లు కలిసినా పాలను ఆస్వాదించే హంస కావాలి

|
Google Oneindia TeluguNews

జీవితం ఉన్నదే ఆస్వాదించేందుకు. అనాలోచితంగా గడిపేందుకు కాదు. ఆస్వాదన అనే పదమే, ఆ అంశమే చాలా ఉన్నతంగా, ఉదాత్తంగా ఉంది. అన్నింటినీ ఆస్వాదించలేం. ఆ పదార్థానికి లేదా ఆ అంశానికి ఒక పవిత్రత ఉండాలి. ఓ ప్రమాణం ఉండాలి. గొప్ప స్థాయి ఉండాలి. వెన్నెలను ఆస్వాదించగలం. గులాబీలను ఆస్వాదించగలం. ప్రేమను, ప్రకృతిని ఆస్వాదించగలం. మందారాలను, మకరందాన్ని ఆస్వాదించగలం. పల్లేరు ముళ్లను, ఉమ్మెత్త కాయలను, మురుగు కాలువను, చెత్తకుప్పను ఆస్వాదించలేం. జీవితం ఆస్వాదనీయ అంశం. ఆస్వాదనీయ వనరు, వరం.

జీవితం నవరసాల మొలక. అన్ని రకాల రసాలతో నిండిన ఫలవృక్షం. మంచి-చెడు, తీపి-చేదు, సుఖం-దుఃఖం! మన మన సొక రుచి మొగ్గలు తొడిగిన జిహ్వ అయితే జీవితంలోని అన్ని రసాలను పరిశీలించి కావలసినదాన్ని మాత్రమే మనో జిహ్వతో ఆస్వాదించగలం. అందుకు మామూలు మనసు సరిపోదు. అది హంస కలవాలి. నీళ్లు కలిసిఉన్నా పాలను మాత్రమే ఆస్వాదించే హంస అయిఉండాలి.

Your Heartstrings should like Swan, that separate milk from water

జీవన వ్యవహారంలో అన్నిరకాల మంచిని, మాలిన్యాలను కలగలుపుకొని సాగే జీవితం... ప్రవహించే గంగా నది లాంటిది. గంగ అతి పవిత్రమైంది. దాని పుట్టుక, గమనం, గమ్యం... పరమ పవిత్రం. అయినా దాని ప్రమేయం లేకుండా మాలిన్యాలు, మురుగులు, స్నానమాచరించినవారి పాపాలు, చివరకు శవాలు కలుస్తూనే ఉంటాయి. అదేమీ దానికి పట్టదు. ప్రవహించినంత మేర, మలినాలు కలిగినంతమేరా ఎక్కడికక్కడ వదిలించుకుంటూ, తొలగించుకుంటూ, పవిత్రీకరిస్తూ ప్రవహించటమే దాని పరమ కర్తవ్యంగా ముందుకు సాగుతుంది. జీవితమూ అంతే. అదో ప్రవాహం. మాలిన్యంతోనూ మిళితం కాక తప్పదు. అందులోని శుద్ధ క్షీరం లాంటి అంశాలను మాత్రమే ఎన్నుకునే అవకాశం మనకుంది. మనసుకే ఉంది. కల్మశాన్నంతా నిరాకరించి క్షీరంలాంటి ఉన్నత విలువలను ఒడిసిపట్టే నేర్పును అలవరచి మన మనసును హంసలా మార్చుకునే అవకాశం, అదృష్టం, మనకున్నాయి.

అందువల్ల జీవన ప్రవాహంలోని బురదను మనసు పూసుకోకూడదు. మురుగు తాగకూడదు. ఆ ప్రవాహ ఉద్ధృతిలో కొట్టుకుపోకూడదు. మనలోని మనసు హంస కావాలి. గంగానదీ సమీరాల మీద కలహంస కావాలి. అప్పుడే మాలిన్యాలు మనసునంటవు. అది హంసలా స్వచ్ఛ క్షీరాలను మాత్రం, క్షీరం వంటి శుద్ధాంశాలను మాత్రం స్వీకరిస్తుంది, ఆస్వాదిస్తుంది.

మనసు ఒక అపురూప ఆభరణం. అద్వితీయ అనుభూతి. దాదాపు జడమైన ఈ దేహాన్ని కదిలించి చైతన్యవంతం చేసి, అర్థవంతం చేసే ఓ అమూల్య వరం. మనిషికి దేవుడు అమర్చిన దేహమనే అమ్ముల పొదిలోని రామబాణమది. పెద్దన్నలా ఆ మనసు వెనకుంది. నడిపించే బుద్ధి సలహాలతో, సహకారంతో మనసు సత్యమార్గంలో నడిస్తే మనల్ని అది ఉన్నత శ్రేణిలో నిలబెట్టగలదు. ఉత్తమ స్థాయిలో నడిపించగలదు. ప్రలోభాలకు తలొగ్గకుండా ఉన్నత ప్రమాణాలుగల అంశాలనే ఎన్నుకుని ఆస్వాదించి జీవితాన్ని శుద్ధక్షీరం సేవించిన పసివారిలా నిర్మలం చేసుకోవచ్చు.

మనం దీన్ని సాధన చేస్తే నిషిద్ధ వస్తుజాలంపై కోరికను వదిలించుకుని ఆ రుచుల తాలూకు రుచి మొగ్గలు క్రమేణా రాలిపోతాయి. అప్పుడు ఏ మాలిన్యం లేని జీవితం మందాకినీ జలం అవుతుంది. గంగా సలిలం అవుతుంది. అమృత కలశం అవుతుంది. అప్పుడు మామూలు మనిషే రాముడిలా ధర్మనిరతుడు అవుతాడు. హరిశ్చంద్రుడిలా సత్యవ్రతుడు అవుతాడు. బుద్ధుడిలా అహింసామూర్తి అవుతాడు. ఒకవేళ అంతకాకపోయినా ఎంతో కొంతైనా అవుతాడు. అది మన మనోహంస విచక్షణమీద ఆధారపడి ఉంటుంది. దానికి మన బుద్ధి ఇచ్చే శిక్షణమీద ఆధారపడి ఉంటుంది!

English summary
Your Heartstrings should like Swan, that separate milk from water.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X