బ్రహ్మముహూర్తం కాలం ఎప్పుడు?: ఈశా ఫౌండేషన్ ఏం చెబుతోంది?
ఇవ్వాళ కార్తీకమాసం తొలి సోమవారం. హిందువులు అత్యంత పవిత్రంగా భావించే మాసం కావడం వల్ల తెల్లవారు జాము నుంచే ఆలయాలు భక్తులతో నిండిపోయాయి. శైవక్షేత్రాలు, వైష్ణవ ఆలయాల ముందు భక్తులు బారులు తీరారు. నదీ స్నానానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇటీవల కురుస్తోన్న భారీ వర్షాల వల్ల చెరువుల్లో సమృద్ధిగా నీరు చేరింది. నదులన్నీ పరవళ్లు తొక్కుతున్నాయి. ఎటు చూసినా జలసవ్వడి వినిపిస్తోంది. తొలి సోమవారం కావడం వల్ల నదీ తీరాల్లో భక్తుల కోలాహలం నెలకొంది.
సోమవారం.. నదీ స్నానం..
పురాణాల్లో ఈ మాసానికి అత్యంత ప్రాముఖ్యత ఉంది. శివకేశవులకు అత్యంత ప్రీతకరమైన మాసంగా భావిస్తారు. అధ్యాత్మికంగా ఎంతో ప్రాముఖ్యత ఉన్న నెల ఇది. కార్తీకమాసంలో నదీ స్నానం చేయడం వల్ల ఈ మాసంలో నదీ స్నానం చేయడం వల్ల దోషాలు తొలగిపోతాయని నమ్మకం ఉంది. అందుకే- ప్రతి సోమవారం కూడా గంగానదీమతల్లిలో భక్తులు పవిత్ర స్నానాలను ఆచరిస్తుంటారు. చాలామంది శ్రీకృష్ణుడిని దీపాలు వెలిగించి పూజిస్తారు. పురాణాల ప్రకారం శ్రీమహావిష్ణువు కార్తీక పూర్ణిమ నాడు మత్స్యావతారాన్ని ధరించినట్లు విశ్వసిస్తారు.
బ్రహ్మముహూర్తంలో..
సంవత్సరంలో ఏ రోజైనా బ్రహ్మముహూర్తంలో నిద్ర లేవాలని పెద్దలు చెబుతుంటారు. అలా వీలు కానప్పుడు కనీసం కార్తీకమాసంలోనైనా బ్రహ్మముహూర్తంలో నిద్ర లేవాలని, ఆ సమయం ముగిసేలోగా స్నానాదులు ముగించుకుని.. దీపాలను వెలిగించాలని అంటుంటారు. శాస్త్రపరంగా, సాంకేతిక పరంగా ఎలాంటి దోషాలు లేని సమయంగా దీన్ని భావిస్తారు. అలాంటి సమయంలో, దేవుడి ముందు దీపాలను వెలిగించి దినచర్యలను ప్రారంభించడం మంచిదనేది ఆధ్యాత్మికవేత్తల అభిప్రాయం.

బ్రహ్మముహూర్తం కాలం ఎప్పుడు?
బ్రహ్మముహూర్త సమయం తెల్లవారు జామున 3:30 గంటల నుంచి 5:30 లేదా 6 గంటల వరకు ఉంటుందని సద్గురు జగ్గీ వాసుదేవ్‌కు చెందిన ఈశా ఫౌండేషన్ చెబుతోంది. అర్ధరాత్రి దాటిన తరువాత.. సూర్యోదయానికి ముందు ఉన్న కాలం అత్యంత కీలకమైనదనే విషయాన్ని శాస్త్రీయబద్ధంగా కూడా నిరూపితమైనదని పేర్కొంటోంది. భూమికి రక్షణ వ్యవస్థగా ఉంటూ వస్తోన్న ఓజోన్ శాతం ఈ బ్రహ్మముహూర్త సమయంలో గాలిలో మిళితమై ఉంటుందని, అది శరీరానికి తగలడం చాలా మంచిదనే అభిప్రాయం కూడా ఉంది.
పురాణాలు ఏం చెబుతున్నాయి..
బ్రహ్మముహూర్త సమయంలో దేవతలు భూలోక సంచారం చేస్తుంటారని పురాణాలు స్పష్టం చేస్తోన్నాయి. అందుకే ఆ కాలానికి పురాణాలు ఎంతో ప్రాధాన్యత ఇచ్చాయని, బ్రహ్మముహూర్త సమయంలో పూజాదికాలను ముగించాలని, వీలు కాకపోతే కనీసం దీపాన్నయినా వెలిగించాలని, ఇలా చేయడం వల్ల దేవతలు ప్రసన్నులు అవుతారని ఆధ్యాత్మిక వేత్తలు చెబుతుంటారు. తెల్లవారు జామున 5 గంటలకే దేవాలయాలన్నీ తెరచుకోవడానికి ఇదే ప్రధాన కారణమనేది వారి అభిప్రాయం. ఆలయాల్లో సుప్రభాత సేవ ప్రారంభించడానికి గల కారణం కూడా ఇదే.

ఒత్తిళ్లు మటుమాయం..
తెల్లవారు జామునే నిద్ర లేచి, స్నానాదికాలను ముగించుకోవడం ఆరోగ్యపరంగా కూడా ఎంతో మంచిదనే విషయం తెలిసిందే. ఆ సమయంలో శారీరకపరంగా, మానసికపరంగా ఎలాంటి ఒత్తిళ్లు ఉండవని, ఒక సానుకూల దృక్పథం అనేది కలుగుతుందని నిపుణులు చెబుతుంటారు. ఈ ఉరుకులు, పరుగుల జీవనంలో రోజువారీ కార్యక్రమాలతో మనకు తెలియకుండానే శరీరం, మనస్సు అలసిపోతుంటాయని, వాటి నుంచి దూరం కావడానికి కనీసం గంట కాలాన్నయినా, కేటాయించక తప్పదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.