twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'అనుమానమే..'

    By Staff
    |

    Anumanaspadam
    -జోశ్యుల సూర్యప్రకాష్‌
    చిత్రం: అనుమానాస్పదం
    విడుదల తేదీ - ఫిబ్రవరి 9, 2007
    నటీనటులు ఆర్యన్‌ రాజేశ్‌, హంసనందిని, జయప్రకాశ్‌ రెడ్డి,
    తనికెళ్ల భరణి, వనితా రెడ్డి, సుభాష్‌, మూలవిరాట్టు, దేవిచరణ్‌..
    సంగీతం: ఇళయరాజా
    కథ, మాటలు: ఆకెళ్ల వంశీకృష్ణ
    సినిమాటోగ్రఫీ: పి జి విందా
    నిర్మాతలు: సతీష్‌ తాటి, జై ఆర్నాల
    స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వంశీ

    చిరకాల విరామానంతరం 'వంశీ' అందించిన మరో ఫారెస్ట్‌ ఎడ్వెంచర్‌ 'అనుమానాస్పదం' థ్రిల్లర్‌గా కొనసాగిన కథనం చాలా చోట్ల 'లాగ్‌'లతో 'ఫిల్‌' అయి కిల్‌ అవడం జరిగింది. 'ఐ నో వాట్‌ యు డిడ్‌ ఇన్‌ లాస్ట్‌ సమ్మర్‌' నాటి ట్విస్టుకి వీరప్పన్‌ ఏలిన అడవి ప్రాంతం బ్యాక్‌గ్రౌండ్‌ కలిపినా ప్రేక్షకులకు పట్టడం 'అనుమానాస్పదం'గా ఉంది.

    అడవి దొంగ 'ధీరప్పన్‌' జీవితాన్ని 'సత్యమంగళం' అడవుల్లో 'సర్వమంగళం' పాడారు పోలీసులు. అంతకాలం దోచిన సొమ్ము (600 కోట్లు) నిధి రూపంలో అక్కడే దాచాడని ఓ జర్నలిస్టు (సూర్య) కనుక్కుంటాడు. ఆ రహస్యాన్ని సహచరుడు భావరాజు సత్యనారాయణ ఉరఫ్‌ బాస్‌ (ఆర్యన్‌) చేతిలో పెట్టి మరణిస్తాడు ఆయన. ఆ ప్లానుతో నిధిని దోచేద్దామని ప్లాన్‌ చేస్తాడు బాస్‌. ఓ గైడు (జయప్రకాశ్‌ రెడ్డి), వంటమనిషి, బాంబుల డిస్పోజర్‌ (వనితారెడ్డి), డాక్టర్‌ (హంసానందిని), పనివాడు సూరితో కలిసి అడవిలోకి ప్రవేశిస్తాడు. అక్కడ ధీరప్పన్‌ మరణించలేదని కొందరు నమ్మి ఆరాధిస్తుంటారు. వాళ్లని, కొన్ని అపాయాలని తప్పించుకుని నిధిని చేరుతాడు. అక్కడి నుంచి దీనిని సిటీకి తెచ్చే ప్రయత్నంలో హత్యలు ప్రారంభమవుతాయి. ఎవరు వీటిని చూస్తున్నారు? హీరో, హీరోయిన్లు ఎలా తప్పించుకున్నారనేది తెరపై చూడాల్సిందే.

    'తప్పు చేసిన వారికి శిక్ష తప్పదు' అనేది నలిగిన సినిమా రూల్‌ అయినా తప్పనిసరి. దాన్ని అతిక్రమించి, ఈ సినిమాలో నిధిని దోచుకుందామని బయలుదేరిన హీరోపై సానుభూతి కరువవడం అనేది సహజనంగా జరిగేదే. దాంతో హీరో గెలవాలన్న ఆలోచన ఎక్కడా కలగదు. అంతేకాక 'ఐ నో వాట్‌ యు డిడ్‌ ఇన్‌ లాస్ట్‌ సమ్మర్‌' సినిమా అక్కడి సమాజంపై ఒక సెటైర్‌. ఓ మంచి వ్యక్తి చెడు తిరుగుళ్లు తిరిగే కొందరి చేతుల్లో దెబ్బతినడం, అందుకు రివెంజ్‌ తీర్చుకోవడం దాని ఇతివృత్తం. దాంతో సహజంగా ఆ వ్యక్తి రివెంజ్‌కి రీజన్‌ ఉంటుంది. కానీ ఈ సినిమాలో హత్యలు చేసేవాడికి సరైన కారణం ఉండదు. వాడికి నిధే కావాలనుకుంటే రహస్యంగా ఏ మార్చి ఎత్తుకుపోవచ్చు. అలాగే చివర్లో హంతకుడు చనిపోయే ముందు ముళ్లు విప్పదీస్తూ నిజాలు చెప్పడం పాత పద్ధతే. హీరోనే ఆ మిస్టరీ ఛేదిస్తే బాగుండేది. అలా కాకపోవడంతో 'పాసివ్‌'గా మిగిలి ఏ చర్యా తీసుకోక ప్రేక్షకుడిలా మిగిలిపోతాడు. ఇక వంశీ ప్రతిభ అంతా పోస్టర్‌ డిజైన్లకే పరిమితం అయినట్టు కనిపిస్తుంది. పాటలు బాగున్నా కథ వేడెక్కే సమయంలో అడ్డుపడటానికి తప్ప పనికి రాలేదు. రెగ్యులర్‌గా వంశీ నుంచి ఆశించే పంచ్‌ కామెడీ మిస్‌ అయింది. కథ మలుపు ఇంటర్వెల్‌ వరకూ రాకపోవడంతో ముడిపడక ఫస్టాఫ్‌లో పసలేని సీన్లు పడి డల్‌ చేశాయి. హీరోయిన్‌ లవ్లీగా లేకపోవడం, రొమాన్స్‌ పండకపోవడం మరో మైనస్‌. ఉన్నంతలో జయప్రకాశ్‌రెడ్డి, తనికెళ్ల భరణి బాగా చేశారు. ఆర్యన్‌ రాజేశ్‌ ఉన్నంతలో నటించడానికి ప్రయత్నించినా పాత్ర పరంగా పెద్దగా అవకాశం లేకపోయింది. అక్కడక్కడ పాటల్లో పాత వంశీ ముద్ర కనపడటం కొంత రిలీఫ్‌. చక్కని లొకేషన్లు పట్టించిన కెమెరా (పి జి విందా), షార్ప్‌గా కట్‌ చేసిన ఎడిటర్‌ శ్రీకర్‌ ప్రసాద్‌ అభినందనీయులు.విజువల్‌గా బాగున్నా కథ లేకపోవడంతో ఇది ప్రేక్షకులను ఎంతవరకు అలరిస్తుందన్నది 'అనుమానమే'.

    (గమనిక: వినోదం, అసభ్యత లేకపోవడం, సాంకేతిక విలువలు, కథన నైపుణ్యం తదితర అంశాల ఆధారంగా మా రేటింగ్‌ ఉంటుంది. సినిమా జయాపజయాలకు రేటింగ్‌కు సంబంధం ఉండనవసరం లేదు)

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X