వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సంక్షోభంలో వాజ్‌పేయి సర్కార్‌

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ : తెహల్కాడాట్‌కామ్‌ సృష్టించిన దుమారంతో వాజ్‌పేయి సర్కారు సంక్షోభంలో పడింది. రక్షణశాఖలోని అవినీతి పురాణాన్ని టేపులతో సహా తెహల్కా బయటపెట్టిన తర్వాత గత రెండు రోజులుగా చోటుచేసుకుంటున్న పరిణామాలు వాజ్‌పేయి సర్కారును తీవ్ర సంక్షోభంలోకివెట్టాయి.

రక్షణ మంత్రి జార్జ్‌ ఫెర్నాండెజ్‌ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేసిన మమతా బెనర్జీ తన డిమాండ్‌కు ఎన్‌డిఎ నేతల నుంచి సానుకూల స్పందన రాకపోవడంతో ఎన్‌డిఎ నుంచి వైదొలగుతున్నట్టుగా ప్రకటించారు. మమత బృందం ఎన్‌డిఎ నుంచి బయటపడిన కొన్ని గంటల్లోనే జార్జ్‌ఫెర్నాండెజ్‌ రక్షణ మంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్టుగా ప్రకటించారు.

రెండు రోజుల పాటు రాజీనామా చేయడానికి బెట్టు చేసిన సమతాపార్టీ అధ్యక్షురాలు జయాజైట్లీ కూడా తన పదవికి రాజీనామా చేశారు. జార్జ్‌ రాజీనామా ప్రధాని వాజ్‌పేయికి ఏ మాత్రం యిష్టం లేనప్పటికీ బయటనుంచి వస్తున్న ఒత్తిళ్లకు తోడుగా మిత్రపక్షాలైన యునైడెట్‌ జనతాదళ్‌ వంటి పార్టీలు కూడా జార్జ్‌ రాజీనామా చేయల్సిందేననడంతో ఈ నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు.

జార్జ్‌ రాజీనామ్‌ చేసినప్పటికీ ఎన్‌డిఎ సర్కారు నుంచి వైదొలగాలనే తమ నిర్ణయంలో మార్పులేదని మమత స్పష్టం చేసింది. మమత నిర్ణయం వల్ల వాజ్‌పేయి సర్కారు బలం తగ్గింది. తృణమూల్‌కు లోకసభలో తొమ్మిది మంది సభ్యులు వున్నారు.

ఈ పరిణామాల నేపధ్యంలో రాష్ట్రపతి కెఆర్‌ నారాయణన్‌ గురువారం నాడు ప్రధాని వాజ్‌పేయిని పిలిపించుకుని మాట్లాడారు. దాదాపు 40 నిమిషాల పాటు ఈ ఇద్దరు అగ్రనేతలు సమావేశమయ్యారు. తెహల్కా కథనం దరిమిలా ఉత్పన్నమైన పరిణామాలను ప్రధాని, రాష్ట్రపతికి వివరించారు.

కాగా ఎన్‌డిఎ సర్కారు సంక్షోభంలో ఇరుక్కోవడంతో ఇదే అదనుగా ఎప్పటికీ కాట్లాడుకునే విపక్షాలన్నీ ఏకమై లోక్‌మోర్చా పేరిట కొత్త కూటమిని హడావుడిగా ప్రారంభించాయి. వృద్ధ మార్క్సిస్ట్‌ నేత జ్యోతిబసు అధ్యక్షునిగా, ములాయం సింగ్‌ యాదవ్‌ కన్వీనర్‌గా ఏర్పడిన ఈ కొత్త కూటమిలో మధుదండావతే, హరికిషన్‌ సింగ్‌ సూర్జిత్‌ వంటి హేమాహేమీలు వున్నారు.

ఆర్‌జెడి నేత లాలూ ప్రసాద్‌ను కూడా ఈ కూటమిలోకి లాగే ప్రయత్నాలు సాగుతున్నాయి. మరో వైపు కొత్త కూటమికి తమ సంపూర్ణ సహకారం వుంటుందని కాంగ్రెస్‌ ప్రకటించింది.ఎన్‌డిఎ నుంచి మమతా బెనర్జీ బయటపడటంతో పశ్చిమ బెంగాల్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌-తృణమూల్‌ కాంగ్రెస్‌ కలసి పోటీ చేసేందుకు మార్గం సుగమం అయిందని కాంగ్రెస్‌ వర్గాలు అంటున్నాయి.

శరవేగంతో మారుతున్న రాజకీయ సమీకరణలు ఎన్‌డిఎ సర్కారు గుండెల్లో గుబులు పుట్టిస్తున్నాయి. ప్రభుత్వం ఊపిరి తీసుకునే అవకాశం కూడా లేకుండా మూడు రోజులుగా పార్లమెంట్‌ను ప్రతిపక్షాలు స్తంభింపజేస్తున్నాయి. ప్రతిపక్షాల తీరుపై గురువారం నాడు వెంకయ్యనాయుడు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన తీరును చూస్తుంటే ప్రభుత్వం ఎంత అభద్రతతో వుందో అర్ధం అవుతుందని పరిశీలకులు అంటున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X