వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఐటిసేవలో ఆఖరు ఊపిరి

By Staff
|
Google Oneindia TeluguNews

ఐటి రంగానికి సంబంధించి ఇండియాలో సింగిల్‌మన్‌ షోగా పరిశీలకులు అభివర్ణించే వ్యక్తి దేవాంగ్‌మెహతా. ఆయన ఉత్త షోమన్‌ మాత్రమే కాదు, నిఖార్సయిన కార్యకర్త కూడా. ఆయన హఠాన్మరణం వార్త భారత ఐటి రంగం హరాయించుకోవడానికి చాలా కాలమే పడుతుంది. దేశంలో ఐటి రంగం సంచలనం ప్రారంభంతోనే మెహతా కూడా వార్తల్లోకి రావడం ప్రారంభమయింది.

దేశంలో ఐటి పరిశ్రమను ఈ స్థాయిలో ప్రమోట్‌ చేసిన వ్యక్తి మరొకరు లేరు. నాస్కామ్‌ ఉద్యోగిగా పదేళ్ల క్రితం జీవితాన్ని ప్రారంభించిన మెహతా అనతికాలంలో నాస్కామ్‌ అత్యున్నత స్థానాన్ని అందుకున్నారు. నాస్కామ్‌ అధ్యక్షునిగా ఆయన బహుపాత్రాభినయనాన్ని అలవోకగా ప్రశంసనీయంగా నిర్వహించారు. ఐటి రంగం తరఫున ప్రభుత్వం తరఫున లాబియింగ్‌ జరపడంలోనూ, ఐటి రంగం ద్వారా సమకూరే ప్రయోజనాలను ప్రభుత్వం ఎవిధంగా సద్వినియోగం చేసుకోవచ్చో వివరించడంలోనూ, మరో వైపు ఐటి పరిశ్రమ కొత్త అవకాశాలను అందుకోవడానికి సహకరించడంలో ఆయన తలమునకలుగా వుండే వారు.

పరిశ్రమ విషయంలోనే కాదు పరిశ్రమకు ప్రాణాధారమైన మానవవనరుల విషయంలో కూడా మెహతా కృషి అనితరసాధ్యమైంది. అమెరికా హెచ్‌1బి వీసాల పెంపునకు జరిగిన లాబీయింగ్‌లో మెహతా చురుగ్గా పాల్గొన్నారు. యూరప్‌ దేశాల్లో భారతీయ నిపుణలుకు అవకాశాల కోసం వెంపర్లాడారు. చాలా దేశాల్లో భారతీయ నిపుణులకు ద్వారాలు తెరుచుకోవడంలో మెహతా పాత్ర వుంది. ఈ రోజు భారతీయ ఐటి నిపుణలు ప్రపంచమంతా విస్తరించుకుని వున్నారంటే అందుకు వారి స్వీయప్రతిభే కారణమైనప్పటికీ దాని వెనక మెహతా లాంటి వారు సమకూర్చిన పూర్వరంగం కూడా వుంది. గుజరాత్‌కు చెందిన సామాన్య మహిళ అల్లికలను ఇంటర్నెట్‌ ద్వారా అంతర్జాతీయ మార్కెట్‌లోకి తెచ్చి, గ్రామీణ ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెట్‌ అవకాశాలను ప్రయోగాత్మకంగా చూపింది మెహతానే.

దేశంలోని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం ఐటికి సంబంధించి ఏదో రూపంలో దేవాంగ్‌మెహతా సలహా సహకారాలను ఆశించేవనడంలో అవాస్తవం లేదు. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబుకు కూడా దేవాంగ్‌ సన్నిహితుడు. ఆంధ్రప్రదేశ్‌లో ఐటి పరిశ్రమ అభివృద్ధికి ఆయన సేవలను రాష్ట్రప్రభుత్వం వినియోగించుకున్నది. తరుచు హైదరాబాద్‌ వస్తూ ఇక్కడ జరిగే ఇన్వెస్ట్‌మెంట్‌ ప్రమోషన్‌ ఈవెంట్స్‌లో చురుగ్గా పాల్గొంటూ ఆంధ్రులకు కూడా మెహత చిరపరచితుడయ్యారు.
ఐటి పరిశ్రమ తరఫున లాబియింగ్‌ చేసినప్పటికీ లాబియింగ్‌ ఉభయకుశలోపరి విధంగానేవుండేది తప్ప, అవాంఛనీయమైన లబ్ధికోసం ప్రయత్నించినట్టుగా వుండేది కాదు.

ఇప్పుడే వేళ్లూనుకుంటున్న ఐటి రంగాన్ని కుదురకోనిస్తే ప్రభుత్వానికి కోట్లాది రూపాయల రాబడి మునుముందు ఏటూ పోదని, ఇప్పుడే పరిశ్రమపై భారం వేసి దానిని ఎదగనీయకుండా చేయవద్దని ఆయన అంటుండేవారు.

దేవాంగ్‌ మెహతా గుజరాతీ. ఆయన తండ్రి ఫార్మా కంపెనీల తరఫున లాబియింగ్‌ చేస్తుండేవారు. చిన్నప్పటినుంచే వ్యాపార వ్యవహారాలు ఆయనకు వంటపట్టాయి. దానికి తోడు లండన్‌లో సిఎ చదువు ఈ వ్యాపార ధోరణిని మరింత నిగ్గు తేల్చింది.
ఐటిలో వున్న అపారమైన అవకాశాలను భారతీయ సంస్థలు అందుకునేలా నాస్కామ్‌ తరఫున మెహతా చేసిన కృషి సామాన్యమైనది కాదు. నెలలో సగం రోజులు విదేశాల్లో మరో సగం రోజులు దేశంలోని ప్రధాన నగరాల్లో తిరుగుతూ ఆయన దేశీయ సంస్థలకు ఆర్డర్లు ఇప్పించడానికి ప్రయత్నం చేసేవారు. చిన్న మధ్య తరహా ఐటి సంస్థల ప్రతినిధులను వెంటతీసుకుపోయి వివిధ దేశాల్లో సెమినార్లు, సదస్సులు, ఎగ్జిబిషన్లు నిర్వహించేవారు. అవకాశాలను వెతికిపట్టుకోవడం వాటిని దేశీయ సంస్థలకు మళ్లించడం, ఎప్పటికప్పుడు సమాచారాన్ని నాస్కామ్‌ సభ్య సంస్థలకు అందజేయడం, ఇండస్ట్రీ ట్రెండ్స్‌ మీద అప్‌డెట్‌గా వుంచడానికి కృషి చేయడం మాటలు కాదు.సాఫ్ట్‌వేర్‌ ఎగుతిపైనే కాకుండా ఐటి ఆధారిత సర్వీసులకు మునుముందున్న భవిష్యత్తును గుర్తించి ఆ రంగంలో కూడా పరిశ్రమలను ప్రోత్సహించిన ఘనత దేవాంగ్‌కు దక్కుతుంది.

అవివాహితునిగా వుండటం వల్ల ఆయన చక్రభ్రమణానికి ఏ అడ్డూ వుండేది కాదు. నమ్మిన సిద్ధాంతం కోసం, నమ్మిన కార్యం కోసం అంకితమై పనిచేయడం, చివరకు ఆ పనిలోనే ఆఖరు శ్వాస తీయడం మామూలు విషయాలు కావు. పిన్న వయస్సులో తనవు చాలించడం ఒక్కటే బాధా కరమైన విషయం అయినప్పటికీ ఒక నిండు జీవితకాలంలో సాధ్యం కాని కృషిని మెహతా తన స్వల్ప జీవితంలో చేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X