వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సమైక్య ఆంధ్రతోనేఅభివృద్ధిః బాబు

By Staff
|
Google Oneindia TeluguNews

తిరుపతిః 35ఏళ్ళ పాటు ఆంధ్రప్రదేశ్‌ ను పరిపాలించిన కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణా, రాయలసీమ ప్రాంతాలు అభివృద్ధికి నోచుకోలేదంటూ ప్రాంతీయ తత్వాన్ని రెచ్చగొట్టడం విచారకరమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. సమైక్య ఆంధ్ర రాష్ట్రంతోనే అభివృద్ధి సాధ్యమని ఆయన స్పష్టం చేశారు. కాంగ్రెస్‌ పచ్చి అవకాశవాద రాజకీయాలు నడుపుతున్నదని ఆయన మండిపడ్డారు. జన్మభూమి కార్యక్రమంలో భాగంగా గురువారం ఆయన చిత్తూరు, అనంతపురం జిల్లాలో పర్యటించారు.

తిరుమలలో ఐదుకోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన రెండో క్యూ కాంప్లెక్స్‌ ను ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఈ క్యూ కాంప్లెక్‌ నుంచి అదనంగా 20 వేల మంది స్వామి వారిని దర్శించుకొనే వీలుంటుంది. క్యూ కాంప్లెక్స్‌ ప్రారంభం అనంతరం చంద్రబాబు విలేకరులతో మాట్లాడుతూ అభివృద్ధి పథంలో పయనిస్తున్న తెలుగుదేశం పార్టీని కాంగ్రెస్‌ వారు ప్రాంతీయ తత్వంతో గెలవాలనుకోవడం శోచనీయమన్నారు. కరీంనగర్‌ లోని ఎస్‌.ఎల్‌.బి.సి.కి తెలుగుదేశం ప్రభుత్వం 900 కోట్లు రూపాయలు ఖర్చు చేస్తే కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వం కేవలం 9 కోట్లు కేటాయించిందని, తెలంగాణాపై ఎవరికి ప్రేమఎక్కువో దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చునని ఆయన అన్నారు.

మహారాష్ట్రను విడగొట్టి విదర్భ రాష్ట్రం ఏర్పాటును వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్‌ పార్టీ ప్రత్యేక తెలంగాణా ఏర్పాటు కోరడం విడ్డూరంగా వుందన్నారు. అధికారంలోకి వస్తే రైతలకు ఉచితంగా కరెంట్‌ ఇస్తామంటూ సి.ఎల్‌.పి. నేత వై.ఎస్‌. రాజశేఖర రెడ్డి ప్రకటించారని, కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాలలో రైతుల నుంచి విద్యుత్‌ ఛార్జీలు వసూలు చేస్తునే వున్నారని చంద్రబాబు అన్నారు. కాంగ్రెస్‌ ద్వంద్వ వైఖరికి, అవకాశవాదానికి ఇవి నిదర్శనాలని ఆయన చెప్పారు. వెనుకబడిన ప్రాంతాలను అభివృద్ధి చేసేందుకు తెలుగుదేశం పార్టీ అంకితభావంతో కృషి చేస్తున్నదని ఆయన చెప్పారు.

ఆ తరువాత ముఖ్యమంత్రి అనంతపురం జిల్లాలో జరిగిన వివిధ గ్రామ సభల్లో పాల్గొన్నారు. శింగనమలలో చంద్రబాబు నిర్వహించిన గ్రామసభ ఆసక్తి కరంగా సాగింది. మహిళా సంక్షేమం గురించి చంద్రబాబు వివరిస్తుండగా, నాసిరకం విత్తనాలు మా కొంపలు కూలుస్తున్నాయంటూ వేరుశనగరైతులు ముఖ్యమంత్రికి అడ్డుతగిలారు. దీనిపై ముఖ్యమంత్రి వెంటనే స్పందిస్తూ రైతులకు మాట్లాడే అవకాశం కల్పించారు. రైతుల డిమాండ్లపై సత్వరం చర్యలు తీసుకోవలసిందిగా అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X