• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కాశ్మీర్‌ ఒక్కటే సమస్య కాదు

By Staff
|

న్యూఢిల్లీ: పాకిస్తాన్‌ అధినేత జనరల్‌ ముషారఫ్‌తో భారత్‌ జరిపే చర్చల్లో కేవలం జమ్మూ కాశ్మీర్‌ సమస్య మాత్రమే వుండదని ప్రధాని వాజ్‌పేయి స్పష్టం చేశారు. సోమవారం నాడు ముషారఫ్‌ పర్యటనను పురస్కరించుకుని ప్రధాని ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశం దాదాపు మూడు గంటల పాటు సాగింది.

ఈ సమావేశం తర్వాత పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రమోద్‌మహాజన్‌ విలేకరులతో మాట్లాడుతూ, సమావేశం వివరాలు వెల్లడించారు. జమ్మూకాశ్మీర్‌ భారత్‌కు సంబంధించినంత వరకు మత సమస్య కాదని భారత సమైక్యత, సమగ్రతలకు సంబంధించిన సమస్య మాత్రమేనని అఖిలపక్షంలో ప్రధాని స్పష్టం చేశారు. సమావేశంలో పాల్గొన్న పార్టీలన్నీ పాకిస్తాన్‌తో సయోధ్యకు ప్రధాని చేస్తున్న ప్రయత్నాలను బేషరతుగా సమర్ధించాయని మహాజన్‌ చెప్పారు. శిఖరాగ్ర చర్చలకు ముషారఫ్‌ను ఆహ్వానిస్తు ప్రధాని తీసుకున్న నిర్ణయాన్ని సమర్ధించడంతో పాటు ప్రతిపక్షాలను కూడా విశ్వాసంలోకి తీసుకోవాలన్న ప్రధాని నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేశాయి.

పాకిస్తాన్‌ హై కమిషనర్‌ ఇచ్చే తేనీటి విందులో హురియత్‌ కాన్ఫరెన్స్‌ నేతలను పాక్‌ పాలకుడు కలుసుకుని మంతనాలు జరపరాదని భారత్‌ పాకిస్తాన్‌కు విస్పష్టంగా తేల్చిచెప్పినట్టు ప్రధాని అఖిలపక్షానికి తెలియజేశారు. హురియత్‌ కాన్ఫరెన్స్‌ నేతలు భారతపౌరులు కనుక జమ్మూ కాశ్మీర్‌ సమస్యపై వారి వాదనను భారత ప్రభుత్వానికి వినిపించాలి తప్ప పరాయి దేశ పాలకులతో మంతనాలు జరపాడానికి వారికి అధికారం, హక్కు లేవని ఆయన పేర్కొన్నారు. అయితే ఈ విషయంలో భారత ప్రభుత్వ అభిప్రాయాన్ని, అభ్యంతరాలను పాక్‌ నేతకు తెలియజేసే విషయంలో భారత్‌ ప్రొటోకాల్‌ ప్రకారం వ్యవహరిస్తుందని కూడా ఆయన చెప్పారు.

జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాదులకు అండగా తమ బలగాలను దింపే కార్యక్రమానికి పాక్‌ స్వస్తి చెప్పాలని, అదే విధంగా టెర్రరిస్టులను ప్రొత్సహించే కార్యక్రమాన్ని కట్టిపెట్టాలని అప్పుడు భారత్‌తో నిర్యుద్ధ సంధికి పాక్‌ చేస్తున్న ప్రతిపాదనకు అర్ధం వుంటుందని సమావేశంలో ప్రసంగించిన రక్షణశాఖ మంత్రి జస్వంత్‌ సింగ్‌ చెప్పారు. జమ్మూ కాశ్మీర్‌లో బలగాల మొహరింపు పూర్తిగా భారత్‌ అంతర్గత వ్యవహారమని ఈ విషయంలో పరాయి దేశాల అభిప్రాయాలు, సూచనలు తమకు ఆమోదయోగ్యం కావని కూడా ఆయన వెల్లడించారు.

కాంగ్రెస్‌ నేత సోనియా గాంధీ ప్రభుత్వానికి ముషారఫ్‌తో చర్చల పూర్తి మద్దతు తెలిపారు. తాను ఇటీవల అమెరికా పర్యటించిన సందర్భంగా ఎన్‌ఆర్‌ఐలు ఏర్పాటు చేసిన సభల్లో ప్రసంగిస్తూ, జమ్మూ కాశ్మీర్‌తో సహా కీలకమైన జాతీయ అంశాల్లో భారత్‌లోని అన్ని పార్టీలు ఏకాభిప్రాయంతో వ్యవహరిస్తున్నట్టుగా తెలిపానని అన్నారు. హోం మంత్రి అద్వానీ, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మన్మోహన్‌ సింగ్‌, సమాజ్‌వాద్‌ పార్టీ నేత ములాయంసింగ్‌ యాదవ్‌, బహుజన్‌ పార్టీ నేత మాయవతి, సిపిఎం నేత సోమనాథ్‌ చటర్జీ కూడా సమావేశంలో మాట్లాడారు.

కేంద్ర మంత్రులు రామ్‌ విలాస్‌ పాశ్వాన్‌, అనంద్‌ గితే, దిగ్విజయ్‌ సింగ్‌, పూర్ణో సంగ్మా,సుఖ్‌దేవ్‌ సింగ్‌ థిండ్సా, అలీ మహమూద్‌ నాయక్‌ ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల హడావుడిలో వున్న కారణంగా తెలుగుదేశం పార్టీ ప్రతినిధులెవ్వరూ ఈ సమావేశంలో పాల్గొనలేదు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more