వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సంపాదకుల ప్రతిస్పందన

By Staff
|
Google Oneindia TeluguNews

ఆగ్రా:ప్రధాని వాజ్‌పేయితో మూడవ విడత చర్చలకు ముందుగా పాక్‌ అధినేత జనరల్‌ ముషారఫ్‌ సోమవారం నాడు ఉదయం భారత్‌కు చెందిన పత్రికల సంపాదకులతో కలసి బ్రేక్‌ఫాస్ట్‌ తీసుకున్నారు. ఈ బ్రేక్‌ఫాస్ట్‌ సమావేశాన్నే ఆయన విజయవంతంగా ప్రెస్‌ మీట్‌గా మలచి శిఖరాగ్ర సదస్సుపై ప్రధాని వాజ్‌పేయ్‌ కంటే ముందుగానే తమ వైఖరిని బహిర్గతం చేశారు.

కాశ్మీర్‌, కాశ్మీర్‌, కాశ్మీర్‌ మాత్రమే తన ఏకైక ఎజెండా అనే విషయం ఈ సమవేశంలో ముషారఫ్‌ విజయవంతంగా స్పష్టం చేయగలిగారు. ఈ సమావేశంపై పలువురు సంపాదకుల వ్యాఖ్యలు ఈ విధంగా వున్నాయి.

చందన్‌ మిత్రా-ఎడిటర్‌ పయోనీర్‌: కాశ్మీర్‌పై పాక్‌ పదేపదే చెబుతున్న వైఖరికే జనరల్‌ ముషారఫ్‌ కట్టుబడి వున్నాడు. ఏ మాత్రం పట్టువిడుపులేని ధోరణి ప్రకటించారు. ముషారఫ్‌ ప్రస్తావించిన నాలుగంచెల ఫార్మూలాలో రెండో అంచె కాశ్మీర్‌ను కీలక సమస్యగా గుర్తించేవరకు భారత్‌-పాక్‌ ద్వైపాక్షిక సంబంధాల్లో ఏ మాత్రం మార్పుకు ఆస్కారం లేదు. జనరల్‌ తన మొండి వైఖరినే ఈ సంపాదకుల సమావేశంలో విస్పష్టంగా వెల్లడించారు.

దిలీప్‌ పడ్కోంకర్‌-ఎడిటర్‌ టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా: ముషారఫ్‌ వైఖరి పూర్తి తాత్కాలిక ప్రాతిపదికనే వున్నది. శిఖరాగ్ర ఫలితాలను తనంతతాను దెబ్బతీయరాదన్న ధోరణే జనరల్‌లో కనిపించింది. సాధ్యమైనంతవరకు ఆయన పట్టువిడుపు ధోరణి చూపే ప్రయత్నమే ఆయన చేశారు. అయితే ఆయన సహజంగా దౌత్య వేత్త కాకపోవడం వల్ల మాటల్లో నిర్మోహమాటంగా వున్నారు.

ఎంజె అక్బర్‌-ఎడిటర్‌ ఆసియన్‌ ఏజ్‌: ఎంతో కొంత పురోగతికి అవకాశం వున్నదనే సూచనే ముషారఫ్‌ మాటల్లో కనిపించింది. శిఖరాగ్ర చర్చల గురించి కేంద్ర సమాచార శాఖ మంత్రి సుష్మాస్వరాజ్‌ హడావుడిగా ఎవరినీ సంప్రదించకుండా చేసిన ప్రకటన వల్ల పాకిస్తాన్‌ విధిలేక మరో ప్రకటన విడుదల చేయాల్సివచ్చింది.

ముషారఫ్‌ బ్రేక్‌ఫాస్ట్‌ కాశ్మీర్‌తో పూర్తి చేశారని ఒక ఎడిటర్‌ వ్యాఖ్యానించారు కాగా, విజయవంతంగా మీడియా అటెన్షన్‌ను జనరల్‌ ముషారఫ్‌ కొట్టేయడం వల్ల భారత్‌ ఇప్పుడు దానిని కౌంటర్‌ చేసే ప్రయత్నం ప్రారంభించిందని అధికార వర్గాలు చెప్పాయి.

ముషారఫ్‌ ఇండియాలో మాట్లాడుతున్నట్టుగా కాకుండా పాకిస్తాన్‌లో దేశీయ మీడియా సమావేశంలో మాట్లాడినట్టుగా వ్యవహరించారని పలువురు ఎడిటర్లు వ్యాఖ్యానించారు. సంపాదకులతో భేటీలో ముషారఫ్‌ వ్యవహరించిన తీరుకు ప్రధాన కారణం ఒక టీవీ ఛానెల్‌కు సుష్మా స్వరాజ్‌ ఇచ్చిన ఇంటర్వ్యూ కారణం కావచ్చనే అభిప్రాయం వినవస్తున్నది.

ఆగ్రా శిఖరాగ్ర చర్చల్లో సీమాంతర ఉగ్రవాదం, పాక్‌ జైళ్లలోని యుద్ధఖైదీలు, వాణిజ్య విషయాలు తప్ప కాశ్మీర్‌ ఊసు రాలేదంటూ సుష్మాస్వరాజ్‌ టీవీ ఇంటర్వ్యూలో ప్రకటించారు. దీనిపై పాకిస్తాన్‌ వర్గాలు తీవ్ర నిరసన వ్యక్తం చేశాయి. పాక్‌ విదేశాంగ శాఖ ప్రతినిధి వెంటనే ఒక ప్రకటన విడుదల చేస్తూ ఆగ్రా సదస్సులో కాశ్మీర్‌ సమస్య తప్పకుండా ప్రస్తావనకు వచ్చివుంటుందని ఆ ప్రకటన పేర్కొంది.

  • ఆగ్రాశిఖరాగ్రం
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X