ప్రతి పౌరుడికి గుర్తింపు కార్డు: బాబు
హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రతి పౌరుడికి గుర్తింపు కార్డులు ఇవ్వనున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చెప్పారు. జనాభా లెక్కలసేకరణపై, జనన,మరణాల నమోదుపై దక్షిణాది రాష్ట్రాల రెండు రోజుల సదస్సు ప్రారంభ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రతి పౌరుడి సామాజిక భద్రతా కార్డు కూడా ఇవ్వనున్నట్లు ఆయనతెలిపారు. వచ్చే నగర పాలక సంస్థ ఎన్నికలకు ముందుగానే గుర్తింపు కార్డులను హైదరాబాద్‌లో ఇస్తామని ఆయన చెప్పారు. హైదరాబాద్‌తో ఈ కార్యక్రమాన్ని చేపట్టి రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తామని ఆయన అన్నారు. జనాభా లెక్కలసేకరణ సరిగా లేదనే ఫిర్యదుపై విచారణ జరిపిస్తామని ఆయన చెప్పారు.
సామాజిక భద్రతా కార్డులను ఇచ్చే కార్యక్రమాన్ని అన్ని రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలని ఆయన సూచించారు. తీవ్రవాదం, ఉగ్రవాదం, హింస పెచ్చరిల్లుతున్న ప్రస్తుత తరుణంలో సామాజిక భద్రతా కార్డుల జారీ అవసరమని, ఈ కార్డుల వల్ల వాటిని నిరోధించడం సాధ్యమవుతుందని ఆయన అన్నారు. ప్రతి పౌరుడు ఎక్కడికి వెళ్లినా గుర్తింపు కార్డును చూపించాల్సి వుంటుందని ఆయన అన్నారు.
రాష్ట్రంలో 2011 జనాభా లెక్కల సేకరణను కంప్యూటర్ ఆన్‌లైన్ ద్వారా చేపడుతామని ముఖ్యమంత్రి చెప్పారు.వివాహాల నమోదును కూడా తప్పనిసరి చేయనున్నట్లు ఆయన తెలిపారు.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!