ఆర్టీసి సమ్మెలో కాంగ్రెస్, వామపక్షాలు
హైదరాబాద్: ఆర్టీసి సమ్మెలో మంగళవారంనాడు కాంగ్రెస్, వామపక్షాలు కూడా పాలు పంచుకున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఎపిఎస్‌ఆర్‌టిసి) ఉద్యోగుల సమ్మె మంగళవారంనాటికి తొమ్మిదో రోజుకు చేరుకుంది. ఆర్టీసి ఉద్యోగులు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల్లో చేపట్టిన ధర్నాలు, ర్యాలీలు, బహిరంగ సభల్లో కాంగ్రెస్, వామపక్షాలు పాల్గొన్నాయి.
గుంటూరులో ఆర్టీసి ఉద్యోగుల సమ్మె విధ్వంసానికి దారి తీసింది. హైదరాబాద్‌లో తొమ్మిది వామపక్షాలు ప్రదర్శన నిర్వహించాయి. ఈ సందర్భంగా వామపక్షాలు కార్యకర్తలు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. వామపక్షాల కార్యకర్తలకు, పోలీసులకు మధ్య కొద్దిసేపు పెనుగులాట జరిగింది. తిరుపతిలో ర్యాలీలు, ధర్నాలు, బహిరంగ సభలు జరిగాయి. రీజినల్ కార్యాలయం వద్ద తాత్కాలిక ఉద్యోగుల నియామకం కోసం జరుపుతున్న ఇంటర్వ్యూలను ఆందోళనకారులు అడ్డుకున్నారు. అనంతపురంలో ఆర్టీసి ఉద్యోగులు కాంగ్రెస్, వామపక్షాల కార్యకర్తలతో కలిసి ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. రాజమండ్రి, కాకినాడల్లోసిపిఎం, సిఐటియు కార్యకర్తలు ఊరేగింపులు జరిపారు.
రాష్ట్రంలో 28 శాతం బస్సులు నడుస్తున్నాయని ప్రభుత్వం ప్రకటించింది. ఆర్టీసి సమ్మె వల్ల ఉత్పన్నమైన పరిస్థితులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఒక ఉన్నత స్థాయి సమావేశంలో సమీక్షించారు. బస్సులను ఇంకాపెంచుతామని, క్యాజువల్ ఉద్యోగులతో వాటిని నడిపిస్తామని రవాణా శాఖ మంత్రి బి.వి. మోహన్‌రెడ్డి సమావేశానంతరంవిలేకరులతో చెప్పారు.