శ్రీనగర్‌ః జమ్మూ కాశ్మీర్ సరిహద్దుల్లోని కార్గిల్ సెక్టార్‌లో పాకిస్తాన్ దళాలు విచక్షణ రహితంగా గుళ్ల వర్షం కురిపించడంతో కార్గిల్ సెక్టార్‌లో ఒక నివాస గృహం విధ్వంసమైంది. శనివారం మధ్యాహ్నం పాక్ దళాలు కార్గిల్ సెక్టార్‌లో అధీనరేఖ ప్రాంతాల్లో ముందస్తు హెచ్చరిక లేకుండా భారీ ఎత్తున కాల్పులు జరిపింది.
చంచుక్ అనే గ్రామంలో నివాస గృహంపై షెల్ పడటంతో పూర్తిగా ధ్వంసమైంది. అయితే సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్తతల దృష్ట్యా ఈ గ్రామం నుంచి ప్రజలు పూర్తిగా ఖాళీ చేసి వెళ్లిపోయారు. అందువల్ల ప్రాణనష్టం ఏమీ జరగలేదు. కార్గిల్ పోరు తర్వాత ఈ సెక్టార్‌లో పాకిస్తాన్ బలగాలు మళ్లీ తెగబడి కాల్పులకు దిగడం ఇదే మొదటిసారి. సరిహద్దు పొడవునా పాక్ దళాలు మందుపాతర్లు అమర్చినట్టుగా తెలిసింది. పాక్ సైన్యం తమకు ప్రతికూలంగా వున్న చోట్ల మందుపాతర్లు ఏర్పాటు చేస్తున్నట్టుగా అధికారులు చెప్పారు.