ఇస్లామాబాద్‌ః ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపుతామని ప్రకటించిన పాక్ అధినేత ముషారఫ్ ఈ దిశగా ఇప్పటికే కొన్ని తీవ్రవాద సంస్థలను నిషేధించారు. త్వరలో హర్కత్ ఉల్ ముజాహిదీన్, అల్ బదర్, హర్కత్ ఉల్ జిహాద్ ఏ ఇస్లామీ సంస్థలను కూడా నిషేధించే అవకాశం వున్నదని వార్తలు వస్తున్నాయి.
ఈ విషయంలో ఉన్నతస్థాయి అధికార వర్గాల్లో మంతనాలు జరుగుతున్నాయని తెలిసింది. హర్కత్ ఉల్ ముజాహిదీన్, అల్ బదర్ పార్టీ నేతలు, కార్యకర్తలను పోలీసులు ఇప్పటికే అరెస్టు చేస్తున్నట్టుగా వార్తలు వెలువడుతున్నాయి. హర్కతుల్ నేత ఫజ్లూర్ రహమాన్ ఖలీల్ పోలీసుల దాడినుంచి తప్పించుకుని అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఇప్పటివరకు 1957 మంది తీవ్రవాదులను అరెస్టు చేసినట్టుగా, తీవ్రవాద సంస్థలకు చెందిన 615 కార్యాలయాలను మూసివేసినట్టుగా పాక్ నేత ముషారఫ్ ప్రకటించారు.