హైదరాబాద్ః వర్ధమాన నటి ప్రత్యూష మృతికి సంబంధించి వెలువడుతున్న విభిన్న కథనాలపై శుక్రవారం నాడు రాష్ట్ర అసెంబ్లీలో సిపిఎం సభ్యుడు నోముల నర్సింహయ్య ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కేసుకు సంబంధించి పత్రికల్లో ఇప్పటికే పలు రకాల అనుమానాలు వ్యక్తం చేస్తూ కథనాలు వస్తున్నాయని ఆయన చెప్పారు.
ఈ కేసులో నగర పోలీసుల వైఖరిని, కేర్ ఆస్పత్రి సిబ్బంది వ్యవహారశైళిని ఆయన తప్పుబట్టారు. ప్రత్యూష వంటిపై వున్న గాయాలు చికిత్స కోసం డాక్టర్లు చేసిన గాయాలని పోలీసు కమిషనర్వివరణ ఇవ్వడాన్ని ఆయన ఆక్షేపించారు. ఈ వివరణ డాక్టర్లు ఇచ్చి వుండాల్సిందని ఆ గాయాలు వైద్యం కోసం చేసినవని వైద్యుల కంటే ముందే అత్యుత్సాహంగా కమిషనర్ కితాబు నివ్వడమేమిటని ఆయన ప్రశ్నించారు. ఈ కేసును నిష్పాక్షికంగా సమగ్రంగా దర్యాప్తు జరిపించి దోషులు ఎంతటివారైనా శిక్షపడేట్టుగా చేయాలని ఆయన డిమాండ్ చేశారు.