కరువును ఎదుర్కున్నాం: ప్రధాని
న్యూఢిల్లీ: దేశంలోని కరువు పరిస్థితులను సమర్థంగా ఎదుర్కున్నామని ప్రధాని అటల్‌బిహారీ వాజ్‌పేయి అన్నారు. మొత్తం 14 రాష్ట్రాల్లో కరవు నెలకొన్నదని ఆయన చెప్పారు. ఈ ప్రాంతాల్లో రెండు రూపాయలకు కిలో బియ్యం సరఫరా చేశామని, పనికి ఆహార పథకాన్ని అమలు చేశామని ఆయన చెప్పారు. నిజానికి ఆహార ధాన్యాలను ఎగుమతి చేశామని ఆయన చెప్పారు.
దక్షిణ ఢిల్లీలో 200 ఎకరాలలో విస్తరించిన ఆస్త కుంజ్ ఆధ్యాత్మిక సముదాయానికి ఆయన శనివారం శంకుస్థాపన చేశారు. ధరలు పెరగకుండా జాగ్రత్తలు తీసుకున్నామని, ద్రవ్యోల్బణాన్ని నియంత్రించామని ఆయన చెప్పారు. భారత్ శక్తివంతమైన దేశంగా ఎదుగుతోందని ఆయన అంటూ మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ప్రజలు తమ ఆలోచనాసరళిని మార్చుకోవాలని ఉద్బోధించారు.
దేశ రాజధానిలో తన ప్రయాణం సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలతో ప్రజలు అసౌకర్యానికి గురవుతున్న విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. దీన్ని విభిన్న రకాలుగా చూస్తున్నారని ఆయన అన్నారు. ఆయన పెద్ద ప్రధానమంత్రి అయిపోయారు; రోడ్లన్నీ ఆగిపోతున్నాయి. జబ్బు పడిన నా పాపను ఆస్పత్రికి తీసికెళ్లాలి; ఇదేమిటి? అని కొందరంటున్నారు అని వాజ్‌పేయి అన్నారు.
ప్రధాని వచ్చారు. మనం కొద్దిసేపు ఆగిపోతే నష్టమేమీ లేదు. ఆయన భవిష్యత్తులో మంచి చేస్తారు. మనం కొనియాడుతామని మరికొందరు అంటున్నారు అని ప్రధాని అన్నారు.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!