మాయా సర్కార్‌పై అవిశ్వాసం
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లో మాయావతి ప్రభుత్వంపై ప్రతిపక్షాలన్నీ కలిసిఅవిశ్వాస తీర్మానం ప్రతిపాదించడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి. మార్చి మొదటివారంలో జరిగే శాసనసభ సమావేశాల మొదటి రోజునేఅవిశ్వాస తీర్మానం ప్రతిపాదించే ఆలోచనలో ప్రతిపక్షాలున్నాయి.
కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీతో పార్టీ శాసనసభ్యులు గంట సేపు సమావేశమైన అనంతరం కాంగ్రెస్ లెజిస్టేచర్ పార్టీ నేత ప్రమోద్ తివారీ ఈ విషయం చెప్పారు. స్పీకర్ కేశరీనాథ్ త్రిపాఠీపై కూడా అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించనున్నట్లు ఆయన తెలిపారు.
సమాజ్‌వాదీ పార్టీ నేత ములాయం సింగ్ యాదవ్‌ను సోనియాగాంధీ ఆదివారం రాత్రి కలిశారు. కాంగ్రెస్ నుంచి చీలిపోయిన ఎనమండుగురు శాసనసభ్యులు బేషరతుగా మాయావతి ప్రభుత్వానికి మద్దతు ప్రకటించడానికి సిద్ధంగా లేరు. ఈ నేపథ్యంలో బిఎస్‌పి, బిజెపి సంకీర్ణ ప్రభుత్వంపై అవిశ్వాసం ప్రతిపాదించాలని ప్రతిపక్షాలు నిర్ణయం తీసుకున్నాయి.
భవిష్యత్తు కార్యక్రమాన్ని రూపొందించుకోవడానికి కాంగ్రెస్ నుంచి చీలిపోయి అఖిల భారతీయ కాంగ్రెస్ దళ్‌ను ఏర్పాటు చేసిన ఎనమండుగురు శాసనసభ్యుల్లో ఏడుగురు ఆదివారం రాత్రి సమావేశమయ్యారు. మాయావతి నేతృత్వంలోని ప్రభుత్వాన్ని సమర్థించాలా వద్దా అనే విషయంపై తాము ఇంకా ఏ నిర్ణయమూ తీసుకోలేదని సిఎల్‌పి చీలిక గ్రూప్ సీనియర్ నేత అఖిలేష్ సింగ్ అన్నారు. ప్రభుత్వాన్ని కాపాడడం తమ ప్రథమ లక్ష్యం కాదని ఆయన చెప్పారు. ఈ విషయంపై ఆయన వివరణ ఇవ్వలేదు.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!