ఛార్జీల మోతలేని రైల్వే బడ్జెట్
న్యూఢిల్లీ: ప్రయాణికులకు ఊరట కలిగించే బడ్జెట్‌ను రైల్వే మంత్రి నితీష్ కుమార్ బుధవారం శాసనసభలో ప్రతిపాదించారు. ప్రయాణికుల ఛార్జీలను, సరుకుల రవాణా రేట్లను ఆయన పెంచలేదు. రాజధాని, శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణం ఖర్చుల భారాన్ని తగ్గించారు. ద్రవరూపంలోని పెట్రోలియం గ్యాస్, డీజిల్, పెట్రోల్, సిమెంటు రవాణా ఛార్జీలను హేతుబద్ధం చేస్తూ తగ్గించారు.
రద్దీ తక్కువగా వుండే సమయాల్లో కొన్ని ఎంపిక చేసిన రైళ్లలో ఛార్జీలను తగ్గిస్తూ నితీష్ కుమార్ లోక్‌సభలో రైల్వే బడ్జెట్‌ను ప్రతిపాదించారు. అన్ని రాజధాని ఎక్స్‌ప్రెస్ రైళ్లలో ఈ ఏడాది జులై 15 నుంచి సెప్టెంబర్ 15వ తేదీ వరకు ఎసి ఫస్ట్ క్లాస్, ఎసి టూ- టయర్ ప్రాథమిక ఛార్జీలను ప్రయోగాత్మకంగా పది శాతం తగ్గించారు.
ఛార్జీలను హేతుబద్దం చేయడం వల్ల రాజధాని రైళ్లలో హజ్రత్ నిజాముద్దీన్, తిరువనంతపురంల మధ్య ఎసి టూ టయర్ ఛార్జీలు 22 శాతం, ఎసి ఫస్టు క్లాస్ ఛార్జీలు 19 శాతం తగ్గుతాయి. శతాబ్ది ఎక్స్‌ప్రెస్ బేసిక్ ఛార్జీల తగ్గింపు వల్ల న్యూఢిల్లీ, భోపాల్‌ల మధ్య ఎగ్జిక్యూటివ్ క్లాస్ ఛార్జీలు 13 శాతం తగ్గుతాయి.
వచ్చే ఆర్థిక సంవత్సరానికి రైల్వే వార్షిక ప్రణాళిక రూ.12,918 కోట్లు. ఇందులో ప్రత్యేక రైల్వే భద్రతా నిధి రూ. 2,311 కోట్ల ప్రణాళిక కూడా ఉంది. ప్రాంతీయ ఆకాంక్షలను తీర్చేందుకు బడ్జెట్‌లో 50 కొత్త రైళ్లను, 13 రైళ్ల ఫ్రీక్వెన్సీ పెంపు, 23 రైళ్ల పొడిగింపు ఉన్నాయి.
రోడ్డు రవాణా పోటీని తట్టుకునేందుకు కొన్ని సరుకుల రవాణా ఛార్జీలను తగ్గిస్తూ వర్గీకరణ చేశారు. పెట్రోల్ వర్గీకరణను 280 క్లాస్ నుంచి 250 క్లాస్‌కు మూడు దశల్లో తగ్గించారు. దీని వల్ల పెట్రోల్ రవాణా ఛార్జీలు 10.7 శాతం తగ్గుతాయి. మిగతా సరుకుల రవాణాను రెండు దశలుగా వర్గీకరించారు. ఇందులో హై స్పీడ్ డీజిల్, ఫర్నేస్ ఆయిల్, నాఫ్తా, లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్, కంప్రెస్‌డ్ గ్యాసెస్, లూబ్రికేటింగ్ ఆయిల్, ఇనుము, ఉక్కు, దుక్క ఇనుము, ఇనుప రజను, సిమెంట్ షీట్స్, పెట్రోలియం కోక్, సోడా యాష్ ఉన్నాయి. సరుకుల రవాణా 5.3 శాతం నుంచి 9.5 శాతం మధ్యలో తగ్గుతుంది.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!