ఇది ఎన్నికల బడ్జెట్: విపక్షాలు
న్యూఢిల్లీ: రైల్వే మంత్రి నితీష్‌కుమార్ బుధవారం లోక్‌సభలో ప్రతిపాదించిన రైల్వే బడ్జెట్‌ను ప్రతిపక్షాలు ప్రజాకర్షక బడ్జెట్‌గా ప్రతిపక్షాలు అభివర్ణించాయి. ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఈ బడ్జెట్‌ను ప్రతిపాదించారని, దీని వల్ల రైల్వేలో స్తబ్దత నెలకొంటుందని విమర్శించాయి.
రైల్వే బడ్జెట్ గొప్పగా లేదని, రైల్వే విస్తరణకు, దాని సామర్థ్యాన్ని పెంచడానికి ఇది ఏ మాత్రం పనికి రాదని కాంగ్రెస్ నాయకుడు శివరాజ్ పాటిల్ వ్యాఖ్యానించారు. నిరుడు చేసినట్లుగా రైల్వే ఛార్జీలను పెంచుతూ ప్రభుత్వం అనుబంధ బడ్జెట్‌ను తెస్తుందని కాంగ్రెస్ నాయకుడు పి.ఆర్. దాస్‌మున్షీ అనుమానం వ్యక్తం చేశారు. భద్రత కొరవడి రైల్వే ప్రయాణికులు మూడు శాతం తగ్గారని ఆయన చెప్పారు. ఈ ఏడాది రైల్వే ప్రమాదాల్లో మరణించినవారికి నితీష్‌కుమార్ నివాళులు అర్పించకపోవడాన్ని ఆయన తప్పు పట్టారు.
బడ్జెట్లో చెప్పుకోదగిందేమీ లేదని, గ్రామీణ ప్రాంతాలను పూర్తిగా నిర్లక్ష్యం చేయడం నిరాశజనకంగా ఉన్నదని మాజీ రైల్వే మంత్రి రామ్‌విలాస్ పాశ్వాన్ అన్నారు. ఇది వివక్షాపూరితమైన బడ్జెట్ అని సిపిఎం నాయకుడు వి. రాధాకృష్ణన్ వ్యాఖ్యానించారు. డిమాండ్ ఉన్నప్పటికి తమిళనాడు రాష్ట్రానికి ఒక్క కొత్త ప్రాజెక్టును కూడా ప్రతిపాదించలేదని అన్నాడియంకె. నాయకుడు పి.హెచ్. పాండ్యన్ అన్నారు. బడ్జెట్‌ను సమాజ్‌వాదీ పార్టీ నాయకుడు ములాయం సింగ్ యాదవ్ తీపితో కలిపి పెట్టిన చేదుగా అభివర్ణించారు.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!