• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఆరోపణలు రుజువు చేస్తే ఏ శిక్షకైనా సిద్ధం: వైయస్‌

By Staff
|

హైదరాబాద్‌: రాజోలిబండ మళ్లింపు పథకం (ఆర్‌డియస్‌)పై మినీ విద్యుత్‌ ప్రాజెక్టు పనులను తన తోడల్లుడు సుబ్బారెడ్డికి అప్పగించాలని తాను కర్ణాటక ప్రభుత్వాన్ని ప్రభావితం చేసినట్లు వచ్చిన ఆరోపణలపై న్యాయ విచారణకు ఆదేశించడానికి తాను సిద్ధమని ముఖ్యమంత్రి డాక్టర్‌ వై.యస్‌. రాజశేఖర్‌ రెడ్డి సవాల్‌ చేశారు. తాను కర్ణాటక ప్రభుత్వాన్ని ప్రభావితం చేసినట్లు రుజువైతే తాను ఏ శిక్షకైనా సిద్ధమని, ఒక వేళ చేసిన ఆరోపణలు రుజువు చేయలేకపోతే తెలుగుదేశం సభ్యుడు డాక్టర్‌ నాగం జనార్దన్‌ రెడ్డి శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తారా అని ఆయన అన్నారు. రుజువు చేయలేకపోతే నాగం జనార్దన్‌ రెడ్డి రాజీనామా చేసి తిరిగి పోటీ చేయవచ్చునని ఆయన అన్నారు.

ఆర్డీయస్‌పై మినీ విద్యుత్‌ప్రాజెక్టు నిర్మాణంపై శాసనసభలో జరిగిన చర్చ సందర్భంగా తనపై వచ్చిన ఆరోపణలకు ముఖ్యమంత్రి తీవ్రంగా స్పందించారు. ప్రతిపక్ష నాయకుడు నారా చంద్రబాబునాయుడిపై, ఇతర తెలుగుదేశం సభ్యులపై ఆయన తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి ప్రసంగానికి తెలుగుదేశం సభ్యులు అడుగడుగునా అడ్డు తగిలారు. తన వ్యక్తిత్వాన్ని దెబ్బ తీసే ప్రయత్నానికి తెలుగుదేశం నాయకులు గత ఆరేడేళ్లుగా పాల్పడుతున్నారని ఆయన అన్నారు. తనపై, తన బంధువులపై రుజువు చేయలేని ఆరోపణలు చేస్తూ బురద చల్లే పని పెట్టుకున్నారని ఆయన అన్నారు. తనను క్రిమినల్‌గా చిత్రీకరించడానికి చేయని ప్రయత్నమంటూ లేదని ఆయన అన్నారు. తనపై 1996లో 26 కేసులు నమోదు చేశారని, అందులో ఒక్క కేసులో కూడా తాను నేరం చేసినట్లు రుజువు కాలేదని, తనపై క్రిమినల్‌ ముద్ర వేయడానికి చేతనైన ప్రయత్నం చేశారని, కానీ ప్రజలు అంగీకరించలేదని ఆయన అన్నారు. తన కుమారుడు వైయస్‌ జగన్మోహన్‌ రెడ్డిపై తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో సూట్‌కేసు బాంబు ఆరోపణలు చేసి, వాయిదా తీర్మానం కూడా ప్రతిపాదించారని, ఈ విషయంలో తెలుగుదేశం పార్టీకి బిజెపి తోడుగా నిలిచిందని ఆయన అన్నారు.

తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో జివికె, స్పెక్ట్రమ్‌లకు యేటా అదనంగా 200 కోట్ల రూపాయలు చెల్లించేలా ఒప్పందాలు చేసుకున్నారని, ఆ ఒప్పందాలను పునఃపరిశీలించాలని తాము డిమాండ్‌ చేసినా వినలేదని ఆయన గుర్తు చేశారు. తనకు తప్పించుకునే అలవాటు లేదని, వెన్నుపోట్లు పొడిచిన సంఘటనలు తన జీవితంలో లేవని, ఒకటి చెప్పి మరోటి చేసే అలవాటు లేదని తెలుగుదేశం సభ్యులు చేసిన వ్యాఖ్యలకు ప్రతిస్పందిస్తూ అన్నారు.

తన సుబ్బారెడ్డికి దక్కిన మినీ విద్యుత్‌ ప్రాజెక్టు వల్ల ఏడాదికి ఎక్కువలో ఎక్కువ తనకు తెలిసినంత వరకు 30 లక్షల రూపాయల ఆదాయం ఉంటుందని, దీని కోసం తాను లక్ష మంది రైతుల గొంతులు కోస్తానా అని, తనను తెలిసినవారెవరూ తనపై వచ్చిన ఈ ఆరోపణను నమ్మబోరని ఆయన అన్నారు. హెరిటేజ్‌ వల్ల ఎపి డైరీని ఎలా నిర్వీర్యం చేశారో అందరికీ తెలుసునని, మూడు లక్షల లీటర్ల పాలు సేకరించే చిత్తూరు డైరీ దెబ్బ తిన్నదని, ఈ హెరిటేజ్‌లో మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భాగస్వామి అని, చంద్రబాబు సతీమణి దానికి మేనేజింగ్‌ డైరెక్టరని, ఈ విషయాన్ని తాను ఎప్పుడైనా ప్రస్తావించానా అని ఆయన అన్నారు.

పెళ్లి అయిన తర్వాత స్త్రీకే పుట్టింటితో పెద్దగా సంబంధం ఉండదని, సుబ్బారెడ్డి తన తోడల్లుడని, తన భార్య చెల్లెలి మొగుడని, ఆయనకు ఎదో వస్తే తనపై ఆరోపణలు చేస్తున్నారని, సుబ్బారెడ్డి సభకు వచ్చారని, వస్తే తప్పేమిటని, ఆయనేం దొంగనా, దోపిడీదారుడా అని ఆయన అన్నారు. మినీ విద్యుత్‌ ప్రాజెక్టు సుబ్బారెడ్డికి ఇవ్వాలని తాను కర్ణాటక మంత్రులకు లేఖలు రాశారని అంటున్నారని, తాను కొన్ని లక్షల మందికి లేఖలు రాశానని, ఆ లేఖల వల్లనే తాను ఈ స్థాయికి వచ్చానని ఆయన అన్నారు.

చంద్రబాబు సొంత బావమరిది బాలకృష్ణ ఇంట్లో రెండు హత్యలు జరిగాయని రాజశేఖర్‌ రెడ్డి గుర్తు చేస్తూ చంద్రబాబు పోలీసులకు ఫోన్‌ చేశారని అన్నానా, ఆ సంఘటనలతో చంద్రబాబుకు సంబంధం ఉందని తాను ఆరోపించానా, కనీసం బాలకృష్ణ పేరేనా ఎత్తానా ఆయన అడిగారు. తనకు సంస్కారం ఉందని, అయితే ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు మాత్రం ఏదో రకంగా బురద చల్లి రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆయన అన్నారు. సినీనటి ప్రత్యూష మృతి కేసులో మాజీ హోం మంత్రి టి. దేవేందర్‌ గౌడ్‌ కుమారుడి గురించి పత్రికల్లో వచ్చిందని, అంత మాత్రానా తాను ఆ విషయం ఎత్తానా అని ఆయన అన్నారు. ఈ సమయంలో తెలుగుదేశం సభ్యులు తీవ్ర అభ్యంతరం తెలియజేస్తూ స్పీకర్‌ పోడియం వద్దకు దూసుకెళ్లారు. ముఖ్యమంత్రి సమాధానం ముగిసిన తర్వాత సభ్యులకు అవకాశం ఇస్తానని స్పీకర్‌ కె. ఆర్‌.సురేష్‌ రెడ్డి వారికి చెప్పారు.

తన తోడల్లుడు సుబ్బారెడ్డి విద్యుత్‌ ప్రాజెక్టుపై ఆరు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారని, ఆ డబ్బులో పోతే పోయాయి తప్పుకోమంటే తన తోడల్లుడు వైదొలగవచ్చునని, అయితే కర్ణాటక ప్రభుత్వం ఆ పనులను మరెవరికో అప్పగించదనే గ్యారంటీ ఏమీ లేదని ఆయన అన్నారు. మినీ విద్యుత్‌ ప్రాజెక్టు వ్యవహారంపై ఒక సాంకేతిక కమిటీని వేసి లాభం కలిగేలా చూద్దామని ఆయన అన్నారు. ఆర్డీయస్‌ కింది చివరి ఆయకట్టు భూములకు కూడా నీరందేలా చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X