వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎపి రాజధాని అని వచ్చాం, లేకుంటే వస్తామా?: వైయస్‌

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: తెలంగాణ స్థానికులకు ఉద్యోగాల్లో అన్యాయాన్ని సవరించడానికి విడదులైన 610 జివో అమలుపై గురువారం శాసనసభలో తీవ్ర గందరగోళం చెలరేగింది. తెలంగాణ రాష్ట్ర సమితి (టి ఆర్‌యస్‌), తెలుగుదేశం పార్టీ సభ్యులకు మధ్య తీవ్ర వాగ్వివాదం చెలరేగింది. ఆ తర్వాత ముఖ్యమంత్రి డాక్టర్‌ వై.యస్‌. రాజశేఖర్‌ రెడ్డి వ్యాఖ్యలతో సభ మరింత వేడెక్కింది. 304 నిబంధన కింద 610 జీవో అమలుపై గురువారం కూడా శాసనసభలో చర్చ కొనసాగింది.

తెలంగాణకు ఉద్యోగాల్లో అన్యాయం జరిగి వుంటే సవరించడానికి ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకోవాలని గాదె వెంకటరెడ్డి (కాంగ్రెస్‌) కోరారు. తాను తెలంగాణకు వ్యతిరేకిని కానని ఆయన అన్నారు. తెలుగుదేశం శాసనసభా పక్షం నాయకుడు టి. దేవేందర్‌ గౌడ్‌ తెలంగాణ రాష్ట్ర సమితిపై తీవ్రంగా ధ్వజమెత్తారు. తెలంగాణ వెనకబాటుకు ఈ ప్రాంత నాయకులే కారణమని ఆయన అన్నారు. ఈ సమయంలో టి ఆర్‌యస్‌కు చెందిన హరీష్‌ రావు జోక్యం చేసుకుని తెలంగాణ వెనకబాటుకు తెలుగుదేశం నాయకులు కారణమనేది దేవేందర్‌ గౌడ్‌ అంగీకరిస్తున్నారని, బలవంతులకూ బలహీనులకూ మధ్య జరుగుతున్న పోరాటమని చక్కని మాట అన్నారని అంటూ మీ పార్టీ అధ్యక్షుడిని అంగీకరింపజేసి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు తీర్మానం చేసేలా ఎందుకు చూడరని దేవేందర్‌ గౌడ్‌ను ప్రశ్నించారు. దీనికి దేవేందర్‌గౌడ్‌ ఘాటుగా ప్రతిస్పందించారు. ఆయనేమో విందులు, వినోదాలు చేసుకుంటూ ఉంటారు, వీరా తెలంగాణ తెచ్చేది? అని ఆయన అన్నారు.

తమ ప్రభుత్వ హయాంలో తెలంగాణ అభివృద్ధికి అన్ని చర్యలూ తీసుకున్నామని, తెలంగాణలో ఏదైనా అభివృద్ధి జరిగి వుంటే అది తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే జరిగిందని దేవేందర్‌ గౌడ్‌ అన్నారు. తెలంగాణ రాష్ట్రమే ఏర్పడుతుంది, ఇక 610 జీవో అమలు ఎందుకని అన్న టి ఆర్‌యస్‌ నాయకుడు ఏమయ్యారని ఆయన అడిగారు. తెలంగాణ సాధించడమే ఏకైక లక్ష్యమని చెప్పిన టి ఆర్‌యస్‌ నేతలు ప్రభుత్వంలో చేరి నిస్సహాయులయ్యారని ఆయన వ్యాఖ్యానించారు. వారు తెచ్చేది బానిస తెలంగాణనా, పెత్తందారీ తెలంగాణనా అని, అటువంటి తెలంగాణ తమకు అవసరం లేదని ఆయన అన్నారు. వీరా తెలంగాణను తెచ్చేది? అని ఆయన టి ఆర్‌యస్‌ నాయకులను ఎత్తిపొడిచారు. దీంతో సభ వాతావరణం వేడెక్కింది. ఈ సమయంలో ముఖ్యమంత్రి జోక్యం చేసుకున్నారు. దేవేందర్‌ గౌడ్‌ పరుషమైన పదజాలం వాడకుండా హరీష్‌రావు ప్రశ్నకు సమాధానం చెప్పి వుంటే బాగుండేదని ఆయన అన్నారు.

ఎపి రాజధాని అని వచ్చాం, లేకుంటే వచ్చేవారమా?: వైయస్‌

ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అని తాము హైదరాబాద్‌కు వచ్చామని, తెలంగాణ రాజధాని మాత్రమే అయి వుంటే వచ్చి వుండేవారం కాదని, కర్నూలు రాజధాని అక్కడికే వెళ్లేవారిమని ముఖ్యమంత్రి డాక్టర్‌ వై.యస్‌. రాజశేఖర్‌ రెడ్డి చర్చలో జోక్యం చేసుకుని అన్నారు. చరిత్రను తిరగరాయడం సాధ్యం కాదని అంటూ ఆయన పరోక్షంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు సాధ్యం కాదని చెప్పారు. బాబ్రీ మసీదు అయినా, మరేదైనా చరిత్రను తిరగరాయడం సాధ్యం కాదని ఆయన అన్నారు.

తెలంగాణ విషయంలో తెలంగాణ రాష్ట్ర సమితికి ఒక విధానం ఉందని, టి ఆర్‌యస్‌ ఒక విధానం ఉందని ఆయన అన్నారు. తెలంగాణపై టి ఆర్‌యస్‌కు ఒక ప్రత్యేక వైఖరి ఉన్నదని, ఆ వైఖరితోనే ఎన్నికల్లో పోటీ చేసి అధికారంలోకి వచ్చారని, వారి లక్ష్య సాధన కోసం వారు చిత్తశుద్ధితో కృషి చేస్తున్నారని, వారు కృషి చేయడం లేదని చెప్పలేమని ఆయన అన్నారు. తెలంగాణ విషయంలో తమ ఆలోచనలు తమకు ఉన్నాయని ఆయన అన్నారు.

ప్రస్తుతం ఉద్యోగాలకు సంబంధించిన 610 జీవోపై మాత్రమే చర్చ జరుగుతోందని, తెలంగాణ అభివృద్ధిపై కాదని, ఉద్యోగాల విషయంలో చిన్న అన్యాయాన్ని కూడా పెద్దగా చేసి చెప్పే ఆనవాయితీ ఉన్నదని, ఉద్యోగాల విషయంలో ఏవైనా ఇబ్బందులుంటే వాటిని అధిగమించడానికి కృషి చేస్తామని ఆయన చెప్పారు. తాను ఏం చేయడానికైనా సిద్ధమేనని, ప్రత్యేక ట్రిబ్యునల్‌ వేయడానికైనా సిద్ధమేనని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X