వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
క్రమశిక్షణ ఉల్లంఘిస్తే వేటు: పార్టీవారికి బాబు హెచ్చరిక
హైదరాబాద్: పార్టీలో క్రమశిక్షణా రాహిత్యాన్ని సహించబోమని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు హెచ్చరించారు. మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులకు వ్యతిరేకంగా పనిచేసేవారిపై వేటు తప్పదని ఆయన సోమవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. పార్టీ అభ్యర్థులకు వ్యతిరేకంగా పనిచేసే పార్టీవారిపై జిల్లా, మున్సిపల్ కమిటీలు క్రమశిక్షణా చర్యలు తీసుకుంటాయని చెప్పారు. సీనియర్ నాయకులు అన్ని కోణాల నుంచి క్షుణ్నంగా పరిశీలించి అభ్యర్థులను ఎంపిక చేశారని ఆయన చెప్పారు. ఏవైనా సమస్యలుంటే పార్టీ కార్యాలయానికి ఫాక్స్ ద్వారా తెలియజేస్తే తగిన చర్యలు తీసుకుంటామని, అందువల్ల పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడడం మంచిది కాదని ఆయన అన్నారు.
పరోక్ష ఎన్నికల వల్లనే మున్సిపల్ ఎన్నికల్లో అవినీతి, గందరగోళం చోటు చేసుకుంటున్నాయని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. వేలాది కోట్ల రూపాయలు దోచుకుంటున్నవారిని వదిలేసి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపక్షాలపై విరుచుకుపడుతోందని ఆయన వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ను మున్సిపల్ ఎన్నికల్లో గెలిపిస్తే స్థానిక సంస్థలను కూడా అమ్మేస్తుందని ఆయన అన్నారు. వరంగల్ జిల్లా పరిషత్ చైర్మన్ బస్వారెడ్డిని ప్రభుత్వం సస్పెండ్ చేయడంపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!