వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాంగ్రెస్‌ నేతలది అధికార అహంకారం: కెసిఆర్‌

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: అధికారం రాగానే రాష్ట్రంలోని కాంగ్రెస్‌ నాయకులు కండ్లు మూసుకుపోయి అహంకారంతో మాట్లాడుతున్నారని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కె. చంద్రశేఖర్‌ రావు విమర్శించారు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌ నాయకులు ఏం మాట్లాడారని ఆయన ప్రశ్నించారు. నాలుగు జిల్లాల పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన గురువారం హైదరాబాద్‌లో మాట్లాడారు. తొమ్మిదేళ్ల తెలుగుదేశం పాలనలో చావు దెబ్బలు తిని చితికిలపడిన కాంగ్రెస్‌కు తెలంగాణ ప్రాణం పోసిందని ఆయన అన్నారు.

పెద్దపల్లి లోక్‌సభ ఎన్నికల్లో సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకుడు జి. వెంకటస్వామి రెండో ఎసార్సీ గురించి మాట్లాడారా? అని ఆయన అడిగారు. ఉఫ్‌మంటే తెరాస పోతుందనే ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ (పిసిసి) డాక్టర్‌ కె. కేశవరావును ఆయన అవహేళన చేశారు. తెలంగాణ విషయంలో కేశవరావు కన్నా బలమైన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడే కొట్టుకుపోయారని ఆయన అన్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రి డాక్టర్‌ వై.యస్‌. రాజశేఖర్‌ రెడ్డి గులాబీ కండువా కట్టుకున్నారని ఆయన గుర్తు చేశారు. తెరాస లేకుంటే తెలంగాణలో తెలుగుదేశం పార్టీని ఓడించడం కాంగ్రెస్‌కు సాధ్యమయ్యేదా? కాంగ్రెస్‌ నాయకుల సంగతి ఎవరికి తెలియదని ఆయన ప్రశ్నించారు.

తెలంగాణపై కాంగ్రెస్‌ అధిష్ఠాన వర్గం మీద ఎప్పటికప్పుడు ఒత్తిడి తెస్తూ ముందుకు తీసుకొని పోతున్నామని, తెలంగాణకు మద్దతిస్తున్న యుపిఎ భాగస్వామ్య పక్షాల సలహాలను కూడా పరిగణనలోకి తీసుకుని సాగుతున్నామని, వారి మాట కాదని బయటకు వస్తే అప్పుడు జరిగే పరిణామాలను చూసి ఇదేమైనా పిల్లల ఆటనా అనేది కూడా వీళ్లేనని ఆయన అన్నారు.

కేవలం ముఖ్యమంత్రి రాజశేఖర్‌ రెడ్డి తెలంగాణ వ్యతిరేక విధానాల వల్ల ఇక్కడ ప్రభుత్వం నుంచి బయటకు వచ్చామని ఆయన చెప్పారు. తెలంగాణ ఉద్యమం తెలంగాణ రాష్ట్ర సాధ్యమయ్యే వరకు ఆరిపోదని, ఇది వ్యక్తుల మీద ఆధారపడి లేదని, ప్రజల మనస్సులో ఉందని, ప్రజల ఆవేదనను గుర్తించకుండా మాట్లాడడం తెలివిలేనితనమేనని ఆయన అన్నారు. 13 మున్సిపాలిటీలలో తమ మద్దతుతోనే కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిందని ఆయన చెప్పారు.

పోతిరెడ్డిపాడు వ్యవహారంపై తాము ఆందోళన చెప్పేటప్పటికి తమపై కుట్ర ప్రారంభమైందని, తెరాస మళ్లీ ప్రజల్లోకి వెళ్తుందని భయపడి తమపై కుట్ర చేస్తున్నారని, తమలోని కొందరు శాసనసభ్యులను పట్టుకుని కుట్రను అమలు చేయడానికి ప్రయత్నిస్తున్నారని ఆయన అన్నారు. తప్పని పరిస్థితిలో మనసులో బాధతో ముగ్గురు శాసనసభ్యులను తెలంగాణ ద్రోహులుగా ప్రకటించామని ఆయన చెప్పారు. కమ్యూనిస్టులపై కూడా ఆయన తీవ్ర విమర్శలు చేశారు.

తెలుగుదేశం గోదావరి యాత్ర ముంచే యాత్రనా అని ఆయన ప్రశ్నించారు. తొమ్మిదేళ్లు రాజ్యం చేసిన చంద్రబాబునాయుడుకు ఇప్పుడు తెలంగాణ ప్రాజెక్టులు గుర్తొచ్చాయా అని ఆయన అడిగారు. పోతిరెడ్డిపాడుకు, పోలవరం ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు. తెలంగాణ ద్రోహుల భరతం పడతామని ఆయన హెచ్చరించారు. తాము ఎక్కడా దారి తప్పలేదని, తెలంగాణ సాధన కోసం సరిగా ముందుకు సాగుతున్నామని ఆయన చెప్పారు. యుపిఎ చేత తెలంగాణ రాకపోతే దాని నుంచి రెండు మూడు నెలల్లో బయటకు వస్తామని, ఆ తర్వాత చేపట్టే ఉద్యమానికి పునాదులను పటిష్టం చేసుకోవడమే ఇప్పుడు తమ ముందున్న కర్తవ్యమని ఆయన అన్నారు. సంస్థాగతంగా బలం పుంజుకోవడానికి చర్యలు తీసుకుంటున్నామని ఆయన చెప్పారు. ఫిబ్రవరిలో లక్ష మందితో తెలంగాణ జాగరణ సేన మహాసమ్మేళన్‌ నిర్వహిస్తామని ఆయన చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X