విధి లేకే సోనియా రాజీనామా: చంద్రబాబు
హైదరాబాద్: విధిలేకే సోనియా గాంధీ రాజీనామా చేశారని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు. ఇందులో సోనియా చూపిన త్యాగమేమీ లేదని ఆయన అన్నారు. కాంగ్రెస్ తాను తీసుకున్న గోతిలో తానే పడిందని ఆయన వ్యాఖ్యానించారు. ప్రత్యర్థులపై కక్ష సాధింపు చర్యల్లో భాగంగా జయాబచ్చన్పై కాంగ్రెస్ ఎన్నికల కమీషన్‌కు ఫిర్యాదు చేసిందని, దాంతో జయా బచ్చన్ సభ్యత్వాన్ని ఇసి రద్దు చేసిందని, ఇదే స్థితి సోనియాకు కూడా వచ్చి వుండేదని, ఇది తెలిసే సోనియా గాంధీ రాజీనామా చేశారని ఆయన అన్నారు.
సోనియా గాంధీని రక్షించేందుకు ప్రభుత్వం ఆర్డినెన్స్‌ను తెచ్చే ప్రయత్నం చేసిందని, రాజీనామా చేయకపోయి వుంటే సోనియా సభ్యత్వాన్ని ఎన్నికల కమీషన్ రద్దు చేసి వుండేదని ఆయన అన్నారు. పార్లమెంటు సభ్యులకు, శాసనసభ్యులకు ఒక ప్రవర్తనా నియమావళి వుండాలని ఆయన అన్నారు. రాష్ట్రంలో శాసపనసభ్యులకు కూడా అది వర్తించాలని ఆయన అన్నారు. అమితాబ్ బచ్చన్ కుటుంబంపై కాంగ్రెస్ వ్యక్తిగత కక్షకు దిగుతోందని ఆయన విమర్శించారు. అమితాబ్ ఇంటిపై ఆదాయంపన్ను శాఖ అధికారులతో దాడులు చేయించడం, అమితాబ్‌ను చలనచిత్రోత్సవానికి ఆహ్వానించకపోవడం అందులో భాగమేనని ఆయన అన్నారు.