వెంకటేశ్వరరావు విచారణకు సిఐడి ప్రయత్నం
హైదరాబాద్: కృషి బ్యాంక్ చైర్మన్ కొసరాజు వెంకటేశ్వరరావును తమ కస్టడీలోకి తీసుకోవడానికి సిఐడి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. వెంకటేశ్వరరావును సిఐడి పోలీసులు మంగళవారం రాత్రి హైదరాబాద్‌కు తీసుకొచ్చారు. డిపాజిటర్లను మోసగించి బ్యాంకాక్‌లో తలదాచుకుంటున్న వెంకటేశ్వరరావు నకిలీ పాస్‌పోర్టు కేసులో బ్యాంకాక్ పోలీసులకు చిక్కి జైలు జీవితం గడుపుతుండగా ఆ విషయం రాష్ట్ర పోలీసులకు తెలిసింది.
వెంకటేశ్వరరావుకు వచ్చే నెల 11వ తేదీ వరకు కోర్టు జ్యుడిష్యల్ రిమాండ్ విధించింది. వెంకటేశ్వరరావును విచారణ నిమిత్తం తమకు అప్పగించాలని సిఐడి పోలీసులు గురువారం పిటిషన్ దాఖలు చేయనున్నారు. వెంకటేశ్వరరావుకు ముంబాయిలోనూ, థాయ్‌లాండ్‌లోనూ బినామీ పేర్లతో ఆస్తులున్నట్లు అనుమానిస్తున్నారు. వెంకటేశ్వరరావు ఆల్కెమీ వెంచర్స్, మొదలైనవాటిలో పెట్టుబడులు పెట్టినట్లు సమాచారం. వెంకటేశ్వరరావు కేసులో పోలీసులు 500 మంది సాక్షులను గుర్తించారు. వెంకటేశ్వరరావు చేతిలో 8003 మంది డిపాజిటర్లు మోసపోయారు.