• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

పోలింగ్‌: ఘర్షణలు, లాఠీచార్జీలు, కాల్పులు

By Staff
|

హైదరాబాద్‌: పంచాయతీ ఎన్నికల తొలి దశ పోలింగ్‌లో పలు చోట్ల ఘర్షణలు, పోలీసుల లాఠీచార్జి, పోలింగ్‌ నిలిపివేత వంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి. కడప జిల్లా బేనేపల్లి, ఉప్పనూరు గ్రామాల్లో పోలీసులు కాల్పులు జరిపారు. దీంతో ఓటింగ్‌ ఆగిపోయింది. కరీంనగర్‌ జిల్లాలో మూడు చోట్ల పోలీసులు లాఠీచార్జి చేశారు. కరీంనగర్‌ జిల్లా హుస్నాబాద్‌లో పోలీసులు నిష్కారణంగా లాఠీచార్జి చేశారంటూ సిపిఐ కార్యకర్తలు ఆందోళను దిగారు. కరీంనగర్‌ జిల్లా మొగిలిపేటలో కాంగ్రెస్‌, తెలుగుదేశం పార్టీల కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. దీంతో పోలీసులు లాఠీచార్జి చేశారు. ఇదే ఇల్లందుకుంటలో కూడా ఘర్షణ చెలరేగింది. దీంతో పోలీసులు లాఠీచార్జి చేశారు.

ప్రకాశం జిల్లాలో పలు చోట్ల పోలింగ్‌కు ఆటంకం కలుగుతోంది. కడప జిల్లాలో తెలుగుదేశం పార్టీ ఏజెంట్లను కాంగ్రెస్‌ కార్యకర్తలు బెదిరించారు. దీంతో అక్కడ తెలుగుదేశం పార్టీకి ఏజెంట్లే కరువయ్యారు. ప్రకాశం జిల్లా సంతమగులూరు మండలం మన్నేపల్లిలో తెలుగుదేశం పార్టీ ఏజెంట్లను గెంటేసి కాంగ్రెస్‌ కార్యకర్తలు రిగ్గింగ్‌కు పాల్పడ్డారు. నల్లగొండ జిల్లా పెదరావులపల్లిలో గుర్తులు తారుమారయ్యాయి. దీంతో పోలింగ్‌ను నిలిపేశారు. ప్రకాశం జిల్లా సియస్‌పురం మండలం అరవెపల్లిలో కూడా తెలుగుదేశం పార్టీ ఏజెంట్లను కాంగ్రెస్‌వారు గెంటేసి రిగ్గింగ్‌ చేశారు. ఇదే ధర్మవరంలో రెండు పార్టీల వారు బ్యాలెట్‌ బాక్స్‌లను ఎత్తుకుపోయారు. నల్లగొండ జిల్లాలో మూడు చోట్ల పోలింగ్‌ ఆగిపోయింది. దేవరకొండ మండలం షేరుపల్లిలో సిపిఐ కార్యకర్తలు దౌర్జన్యానికి పాల్పడి రిగ్గింగ్‌కు దిగారు. దీంతో పోలింగ్‌ ఆగిపోయింది. మట్టంపల్లి మండలం గుండ్లపల్లిలో సర్పంచ్‌ ఇంట్లో పోలింగ్‌ అధికారి మోటార్‌ సైకిల్‌ను పెట్టారు. దీంతో కుమ్మక్కయ్యారంటూ ఆ మోటార్‌ సైకిల్‌ను తగులపెట్టారు. దీంతో పోలింగ్‌ ఆగిపోయింది. కరీంనగర్‌ జిల్లా మొగిలిపేటలో పోలీసులు లాఠీచార్జి చేశారు. ఈ లాఠీచార్జిలో ఇద్దరు మహిళలతో సహా నలుగురు గాయపడ్డారు. ప్రకాశం జిల్లా నర్రమాపల్లిలో కాంగ్రెస్‌ కార్యకర్తల రిగ్గింగ్‌ను ఆపడానికి తెలుగుదేశం కార్యకర్తలు అడ్డుకోవడానికి ప్రయత్నించారు. దీంతో ఘర్షణ చెలరేగింది. తూర్పు గోదావరి జిల్లాలో సర్పంచ్‌పై దాడి జరిగింది.

అనంతపురం జిల్లా ప్యాదిండిలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై కాంగ్రెస్‌వారు దాడి చేశారు. ఈ దాడిలో పది మంది గాయపడ్డారు. మెదక్‌ జిల్లాలో కూడా పలు చోట్ల ఘర్షణలు చెలరేగాయి. కడప జిల్లా కొత్తపల్లిలో పోలింగ్‌ బూత్‌లోకి శాసనసభ్యుడు వరదరాజులు రెడ్డి ప్రవేశించారు. దీన్ని వ్యతిరేకిస్తూ మాజీ శాసనసభ్యుడు ధర్నాకు దిగారు. అనంతపురం జిల్లా మాగుటూరు, కొండేపల్లి గ్రామాల్లో బ్యాలెట్‌ బాక్సుల్లో ఇంకు పోశారు. దీంతో పోలింగ్‌ ఆగిపోయింది. కృష్ణా జిల్లా మైలవరం ఆరవ సెగ్మెంట్‌ యంపిటిసి బ్యాలెట్‌ పేపరు తారుమారైంది. దీంతో ఎన్నిక రద్దయింది. మెదక్‌ జిల్లా గజ్వెల్‌లో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. పోలీసులు లాఠీచార్జి చేశారు. ఆదిలాబాద్‌ జిల్లాలో ఒక యంపిటిసి అభ్యర్థిపై దాడి జరిగింది. బుధవారం పోలింగ్‌ జరిగిన 11 జిల్లాల్లోనూ పలు ప్రాంతాల్లో ఓట్లు గల్లంతయ్యాయనే ఆరోపణలు వచ్చాయి.

అనంతపురం జిల్లా సుబ్బారావు పేట పోలింగ్‌ కేంద్రంలో బిజెపి ఏజెంట్‌ను కిడ్నాప్‌ చేశారు. నల్లగొండ జిల్లా శిల్పకుంట గ్రామంలో సిపియం, న్యూడెమొక్రసీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. ఇదే జిల్లా అడవిదేవులపల్లి, ముదిమాణిక్యం గ్రామాల్లో కాంగ్రెస్‌, టిడిపి కార్యకర్తల మధ్య ఘర్షణ చెలరేగింది. కడప జిల్లా ముద్దనూరులో బాంబు పేలుళ్లు జరిగాయి. రిగ్గింగ్‌ యధేచ్చగా జరిగింది. ప్రకాశం జిల్లా రాచర్ల మండలం ఆకవీడులో కాంగ్రెస్‌, తెలుగుదేశం పార్టీల కార్యకర్తల మధ్య ఘర్షణ చెలరేగింది. పోలీసులు నాలుగు రౌండ్లు గాలిలోకి కాల్పులు జరిపారు. ఇదే జిల్లా కొత్తపట్టణంలో కూడా ఇరు పార్టీల కార్యకర్తల మధ్య ఘర్షణ చెలరేగింది. పోలీసులు మూడు రౌండ్లు గాలిలోకి కాల్పులు జరిపారు. అనంతపురం జిల్లా పుట్లూరు, పెనుకొండ మండలాల్లో రీపోలింగ్‌ నిర్వహించాలని డిమాండ్‌ చేస్తూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు బైఠాయింపు జరిపారు. తూర్పు గోదావరి జిల్లా పెద్దనాపల్లిలో కాంగ్రెస్‌, టిడిపి కార్యకర్తల మధ్య ఘర్షణ జరగడంతో పోలింగ్‌ నిలిచిపోయింది. ఇదే జిల్లా దారగట్టలో మావోయిస్టులు బ్యాలెట్‌ పత్రాలను, జీపును ఎత్తుకెళ్లారు. ప్రకాశం జిల్లా కల్లుచువ్వలపాడులో పోలీసులు నాటుబాంబులు స్వాధీనం చేసుకున్నారు. కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలులో కాంగ్రెస్‌, టిడిపి కార్యకర్తల మధ్య ఘర్షణ చెలరేగడంతో పోలీసులు 144వ సెక్షన్‌ విధించారు. కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలోని వేంపల్లెలో టిడిపి, కాంగ్రెస్‌ కార్యకర్తలు పరస్పరం అవగాహనకు వచ్చి రిగ్గింగ్‌ చేసుకున్నారు. కృష్ణా జిల్లా వట్టికూటపాడులో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. ఇద్దరు గాయపడ్డారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X