వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాంగ్రెస్‌ను తెలంగాణలో తుడిచిపెడతాం: కెసిఆర్‌

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఉద్యమాన్ని ఉధృతం చేసి కాంగ్రెస్‌ ద్రోహాన్ని ఎండగడతామని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖరరావు అన్నారు. తమ ఆందోళనను ఉధృతం చేస్తామని, ప్రజాస్వామ్య పద్ధతిలో, శాంతియుతంగా ఉద్యమాన్ని నడిపిస్తామని, తాము హింసను ప్రోత్సహించబోమని ఆయన శుక్రవారం సాయంత్రం మీడియా ప్రతినిధుల సమావేశంలో చెప్పారు. రెండో ఎస్సార్సీకి అంగీకరిస్తూ తెరాస నేత నరేంద్ర సంతకం చేశారనే కాంగ్రెస్‌ నాయకుల వ్యాఖ్యలను ప్రస్తావించగా కాంగ్రెస్‌ అబద్దాలకోరు అని ఆయన అన్నారు. తెలంగాణపై ఏర్పాటయిన యుపిఎ సబ్‌ కమిటీ చైర్మన్‌ ప్రణబ్‌ ముఖర్జీ హైదరాబాద్‌లో ఏమన్నారో అందరికీ తెలిసిందేనని ఆయన అన్నారు. కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీతో మాట్లాడిన సిడిని హైదరాబాద్‌లో విడుదల చేస్తానని ఆయన చెప్పారు. యుపిఎ నుంచి తాము వైదొలిగినట్లేనని, అయితే రాష్ట్రపతికి లేఖ ఇవ్వలేదని, హైదరాబాద్‌ నుంచి తిరిగి వచ్చిన తర్వాత లేఖ ఇస్తానని ఆయన చెప్పారు. ఇప్పటికైనా పరిస్థితులను సరిగా అర్థం చేసుకుని తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తామని ప్రకటించాలని ఆయన కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీని, ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ను కోరారు. రెండో ఎస్సార్సీ తమ విధానం కాదని, ఏకాభిప్రాయ సాధనతో తెలంగాణ ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్‌ స్వయంగా చెప్పిందని ఆయన గుర్తు చేశారు.

తెలంగాణ కాంగ్రెస్‌ నాయకులు తెలంగాణ అభివృద్ధి జరుగుతోందని అంటుండడంపై ఆయన తీవ్ర ధ్వజమెత్తారు. తెలంగాణ అభివృద్ధి జరుగుతోందో, విధ్వంసమవుతోందో ప్రజలను అడిగితే చెప్తారని ఆయన అన్నారు. వాస్తవానికి అభివృద్ధి స్వయం నిర్ణయాధికారానికి, ఆత్మగౌరవానికి ప్రత్యామ్నాయం కాదని ఆయన అన్నారు. కాంగ్రెస్‌ అనైతిక, అప్రజాస్వామిక, నియంతృత్వ పార్టీ అని ఆయన దుయ్యబట్టారు. రాజకీయ నాటకాల కోసం తాము తెరాసను స్థాపించలేదని, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం స్థాపించామని, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించేవరకు రాజీపడబోమని ఆయన చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అంగీకరించకపోతే గులాబీ కండువాలు కప్పుకొని ఎన్నికల ప్రచారంలో ఎందుకు పాల్గొన్నారని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు జరుగుతుందనే నమ్మకంతోనే కాంగ్రెస్‌ను గెలిపించారని ఆయన అన్నారు. తమ సత్తా ఏమిటో వచ్చే శాసనసభ ఎన్నికల నాటికి చూపిస్తామని, తమ మద్దతు లేకుండా రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేని స్థితి కల్పిస్తామని ఆయన చెప్పారు. ప్రస్తుతం కాంగ్రెస్‌ నాయకులు మాట్లాడుతున్న తీరును ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. 2001కి ముందు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు ప్రస్తుతం కాంగ్రెస్‌ నాయకులు మాట్లాడినదాని కన్నా ఎక్కువ మాట్లాడారని, తెరాస ఆరు నెలల్లో తుడిచిపెట్టుకుపోతుందని అన్నారని, తెలుగుదేశం పార్టీయే తుడిచిపెట్టుకుపోయిందని, అధికారం ఇచ్చే అహంకారం అలాగే మాట్లాడిస్తుందని ఆయన అన్నారు. కాంగ్రెస్‌ ఇప్పటికే రాష్ట్రంలోని ఆంధ్రాలో తుడిచిపెట్టుకుపోయే స్థితికి చేరుకుందని, ఇప్పుడు తెలంగాణలో కూడా నామరూపాలు లేకుండా పోతుందని ఆయన అన్నారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం ఏకాభిప్రాయం వచ్చిందని, కాంగ్రెస్‌ సభ్యులను మినహాయిస్తే కూడా 300 మందికిపైగా సభ్యులు తెలంగాణను బలపరుస్తున్నారని, వారు ఇచ్చిన లేఖలు తన వద్ద వున్నాయని ఆయన అన్నారు. తాము ఒంటరివాళ్లం కాదని, యుపిఎ భాగస్వామ్య పక్షాలన్ని తమ వెంట ఉన్నాయని ఆయన చెప్పారు. ఏకాభిప్రాయం వచ్చిందని ఎన్‌సిపి నేత శరద్‌పవార్‌ చెబుతుంటే ఇంకా రాలేదని కాంగ్రెస్‌ నాయకులు అంటున్నారని, ఇది వాళ్ల నీతి అని ఆయన అన్నారు. వచ్చే నెల 10 - 15 తేదీ మధ్య మెదక్‌ జిల్లా సిద్ధిపేటలో తెలంగాణ శంఖారావం నిర్వహిస్తామని, తాను హైదరాబాద్‌ వెళ్లిన వెంటనే ఈ కార్యక్రమాన్ని ఖరారు చేస్తామని ఆయన చెప్పారు. ఏకాభిప్రాయంతో తెలంగాణ ఏర్పాటు చేస్తామని గతంలో ప్రణబ్‌ ముఖర్జీ చెప్పారని, ఇప్పుడు రెండో ఎస్సార్సీ అంటున్నారని, ప్రణబ్‌ది గోల్‌మాల్‌ చేసే భాష అని విమర్శించారు. ద్రోహం చేసే ఉద్దేశంతోనే ఎన్నికల్లో కాంగ్రెస్‌ వారు గులాబీ కండువా వేసుకున్నారా అని అడిగారు. ఇంత జరిగిన తర్వాత కూడా యుపిఎలో కొనసాగడంలో అర్థం లేదని ఆయన ఒక ప్రశ్నకు సమాధానంగా అన్నారు. కొత్త ప్రతిపాదనలతో వస్తామని అంటున్నట్లు తెలిసిందని, వచ్చినప్పుడు చూస్తామని ఆయన చెప్పారు. ఏమైనా ప్రత్యేక తెలంగాణకు అనుకూలంగా వున్నామని ప్రకటన చేయాల్సిందేనని ఆయన అన్నారు. శాసనసభ సమావేశాల్లో నిరసన తెలియజేసి బయటకు వెళ్లిపోవాలనేది తమ ఉద్దేశమని, అయితే తమ సభ్యుల నిరసనను సాకుగా తీసుకుని కాంగ్రెస్‌ ప్రభుత్వం సభను వాయిదా వేయించుకుంటోందని ఆయన అన్నారు. ప్రతిపక్షాల ప్రశ్నలకు సమాధానం చెప్పలేని స్థితిలోనే తమను సాకుగా చూపి కాంగ్రెస్‌ సభా కార్యక్రమాలు సాగకుండా జాగ్రత్త పడుతోందని ఆయన అన్నారు. వచ్చే శీతాకాలం సమావేశాల్లో పార్లమెంటులో తామేమిటో కూడా చూపిస్తామని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X