వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాజీనామాలు చేసి తేల్చుకుందాం: కెసిఆర్‌ సవాల్‌

By Staff
|
Google Oneindia TeluguNews

సిద్ధిపేట: తమ పార్టీ శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులందరూ రాజీనామా చేస్తారని, కాంగ్రెస్‌ శాసనసభ్యులు, లోక్‌సభ సభ్యులు రాజీనామా చేయడానికి సిద్ధమేనా? అని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు సవాల్‌ చేశారు. రాజీనామాలు చేసి ఎవరు ఎవరి వల్ల గెలిచామో తేల్చుకుందామని ఆయన అన్నారు. తెలంగాణ కాంగ్రెస్‌ లోక్‌సభ సభ్యులం, శాసనసభ్యులం రాజీనామలు చేస్తామంటే తెలంగాణ రాదా? అని ఆయన అడిగారు. తెలంగాణ పార్లమెంటు, శాసనసభ్యులు తెలంగాణకు ద్రోహం చేస్తున్నారని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి డాక్టర్‌ వైయస్‌ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం అవినీతితో బిజీగా వుందని, వారికి అభివృద్ధి చేసే తీరిక లేదని ఆయన వ్యాఖ్యానించారు. తనను మరో చెన్నారెడ్డిగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నారా అని తాను ప్రణబ్‌ ముఖర్జీని అడిగానని ఆయన అన్నారు. తెలంగాణ భూములు అమ్మి రాయలసీమకు నీళ్లందించే జలయజ్ఞాన్ని ముఖ్యమంత్రి తీసుకున్నారని ఆయన అన్నారు. తమ మీద కూడా తమ ప్రజలకు అనుమానం కలిగిందని, అయితే దాన్ని కూడా భరించి తెలంగాణ తీసుకుపోదామని భరించామని ఆయన అన్నారు. తెలంగాణ ప్రజలపై తనకు ఉండే తపన చంద్రబాబుకు, రాజశేఖర రెడ్డికి వుంటుందా ఆలోచించండని ఆయన అన్నారు. ఎక్కడ పడితే అక్కడ కాంగ్రెస్‌ నాయకులను నిలదీయండని, అది ప్రజాస్వామ్యంలో మన హక్కు అని ఆయన అన్నారు.

కాంగ్రెస్‌వారిని ఇంటివారు కూడా రానీయరని, వారికి శంకరగిరి మాన్యాలే గతి అని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) వ్యవస్థాపక అధ్యక్షుడు కె. చంద్రశేఖరరావు అన్నారు. తెలుగుదేశం అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు ఇంటి దారి పడతారని తాము చెప్పిన మాట నిజమైందని, ఇప్పుడు కాంగ్రెస్‌వారు శంకరగిరి మాన్యాలే పట్టాల్సి వస్తుందని ఆయన అన్నారు. సిద్ధిపేటలో తెలంగాణ సమర శంఖారావం సభలో శుక్రవారం సాయంత్రం మాట్లాడారు. తమను కాంగ్రెస్‌వారు ఢిల్లీలో తమను అరిగోస పెట్టారని, తెలంగాణకు మద్దతుగా తాను చప్రాసీలాగా తిరిగి మద్దతు సంపాదించానని ఆయన అన్నారు. కొత్త రాష్ట్రాల ఏర్పాటుకు తాము సైద్ధాంతికంగా వ్యతిరేకమని, చిత్తశుద్ధి వుంటే కాంగ్రెస్‌వారు బిల్లు పెట్టి ఆమోదం పొందండని సిపియం వారు చెప్పారని ఆయన అన్నారు. నాలుగువందల మంది పార్లమెంటు సభ్యుల మద్దతు ఉన్నా కాంగ్రెస్‌ దగా చేసిందని, ఆ మోసానికి కాంగ్రెస్‌ భారీ మూల్యం చెల్లించకతప్పదని ఆయన అన్నారు. రాష్ట్రపతితో, ప్రధానితో అబద్ధం చెప్పిస్తారా, వారితోనే అబద్ధాలు చెప్పిస్తే భారత జాతికి దిక్కేదని ఆయన అడిగారు. తెలంగాణ ప్రజలు దెబ్బ తిన్న పులులని ఆయన అన్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైయస్‌ రాజశేఖర రెడ్డి కన్నా ఎక్కువగా గత ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అభివృద్ధి గురించి ఊదరగొట్టారని, ఇప్పుడు చంద్రబాబునాయుడు ఎక్కడున్నారని ఆయన అన్నారు. తెలంగాణ నినాదం ముందుకు వచ్చిన ప్రతిసారీ అగ్గి మీద చల్లినట్లు హామీ ఇస్తున్నారని, వాటిని ఏ రోజు కూడా అమలు చేయలేదని ఆయన అన్నారు. తమ వనరుల మీద తమకు హక్కు, స్వయంపాలన కావాలని ఆయన అన్నారు. అభివృద్ధి గురించి చెబుతున్న మాటలు ఎంత వరకు నిజమయ్యాయని ఆయన అడిగారు.

తెలంగాణ ఉద్యమం, తెలంగాణ రాష్ట్ర సమితి ఆత్మ ఆవిష్కరించుకుని ఇక్కడ ఉంది, చూడండి అని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అగ్రనేత ఎ. నరేంద్ర కాంగ్రెస్‌ నాయకులను ఉద్దేశించి అన్నారు. అహంకారపూరితమైన మాటలను కాంగ్రెస్‌వారు చాలించాలని ఆయన అన్నారు. సిద్ధిపేటలో జరిగిన తెలంగాణ సమర శంఖారావం సభలో ఆయన శుక్రవారంనాడు ప్రసంగించారు. తెలంగాణ అభివృద్ధితో పాటు ఆత్మగౌరవం, ఆత్మాభిమానం ముఖ్యమని, స్వయంపాలన కోసం ఈ ఉద్యమం సాగుతున్నదని ఆయన అన్నారు. తెలంగాణకు సంబంధించి ఇది మరో స్వాతంత్య్ర సంగ్రామమని ఆయన అన్నారు. వెనుకడుగు వేసేది లేదని, ప్రాణాలు పోయినా తెలంగాణ ఉద్యమం ఆగదని, ఎవరు అడ్డు వచ్చినా ఇది ఆగదని ఆయన అన్నారు. అన్ని విధాలా దోపిడీ జరుగుతున్నదని, ఈ స్థితిలో తమ కలేజా కాలిపోతున్నదని ఆయన అన్నారు. తెలంగాణ గురించి మొదట మాట్లాడిందేమిటని, తెలంగాణపై మీ అభిమానం ఏమై పోయిందని ఆయన తెలంగాణ కాంగ్రెస్‌ నాయకులను ప్రశ్నించారు. తెలంగాణ కాంగ్రెస్‌ నాయకుల నోళ్లు మూసుకుపోయాయని ఆయన అడిగారు.

తెలంగాణ ఉద్యమం ముఖ్యమైన మలుపునకు చేరుకుందని, తెలంగాణ సాధించే వరకు సాగే మలుపు చేరుకుందని తెలంగాణ రాష్ట్ర సమితి సిద్ధాంతకర్త, కాకతీయ విశ్వవిద్యాలయం మాజీ వైస్‌ చాన్సలర్‌ ప్రొఫెసర్‌ జయశంకర్‌ అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకునే ఏకైక పార్టీగా కాంగ్రెస్‌ నిలిచిపోయిందని ఆయన అన్నారు. కాంగ్రెస్‌ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు అంగీకరించిందనే ఉద్దేశంతోనే ప్రజలు తెలంగాణ రాష్ట్ర సమితితో పొత్తు పెట్టుకుందని ప్రజలు భావించారని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు గడువులు పెట్టింది తాము కాదని, కాంగ్రెస్‌ పార్టీయే గడువులు పెట్టిందని ఆయన అన్నారు. పార్లమెంటులో బిల్లు పెడితే 450 మంది సభ్యులు ఆమోదం తెలిపే పరిస్థితిని కల్పించామని, అయినా కాంగ్రెస్‌ డొంకతిరుగుడుగా వ్యవహరించిందని, అందుకే మంత్రి పదవులకు రాజీనామా చేశామని ఆయన అన్నారు. మనం ప్రతిపాదించాల్సింది ఇప్పుడు తెలంగాణ నాయకులను అని ఆయన అన్నారు.

ఇది నీళ్ల గురించి మాట్లాడే తరుణం కాదు, కన్నీళ్ల గురించి మాట్లాడే తరుణం, తెలంగాణ తల్లి కన్నీళ్లను తుడవడానికి ఏదైనా చేయాల్సిన తరుణమని రిటైర్డ్‌ ఛీఫ్‌ ఇంజనీర్‌ ఆర్‌. విద్యాసాగరరావు అన్నారు. మంత్రి పదవుల కోసం తెలంగాణ తల్లిని కుదువ పెడుతున్నారని ఆయన తెలంగాణ కాంగ్రెస్‌ శాసనసభ్యులను ఉద్దేశించి అన్నారు. ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖర రెడ్డి అభివృద్ధి మంత్రం వల్ల తెలంగాణకు ఒరిగేదేమీ లేదని ఆయన అన్నారు. సాగునీటి ప్రాజెక్టుల విషయంలో తెలంగాణకు ప్రభుత్వం చేస్తున్న అన్యాయాన్ని ఆయన వివరించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X