రాహుల్, ప్రియాంక బ్రిగేడ్ ఏదీ లేదు: విహెచ్
హైదరాబాద్: రాహుల్, ప్రియాంక గాంధీల బ్రిగేడ్‌తో తమ పార్టీకి ఏ విధమైన సంబంధం లేదని కాంగ్రెస్ పార్లమెంటు సభ్యుడు వి. హనుమంతరావు స్పష్టం చేశారు. రాహుల్, ప్రియాంక గాంధీల బ్రిగేడ్ పేర కొంత మంది తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడిని కాళికా మాతగా చిత్రించి ప్రదర్శన నిర్వహించారు. దీన్ని ప్రస్తావిస్తూ హనుమంతరావు గురువారం ఆ వివరణ ఇచ్చారు. రాహుల్, ప్రియాంక గాంధీలకు తమ పేర్లు వాడుకోవడం ఇష్టం వుండదని ఆయన చెప్పారు.
కొంత మంది స్వార్థపరులు రాహుల్, ప్రియాంక గాంధీల పేర్లు వాడుకుంటున్నారని, ఇది పార్టీకి నష్టం చేస్తుందని ఆయన అన్నారు. తమ పేర్లను పెట్టుకోవడాన్ని రాహుల్ గాంధీ గానీ, ప్రియాంక గానీ ఏనాడూ ప్రోత్సహించబోరని ఆయన అన్నారు. రాహుల్, ప్రియాంకల బ్రిగేడ్ పేరు మీద చెలామణి అవుతున్నవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన పార్టీ నాయకత్వాన్ని కోరారు.