కరీంనగర్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కల్లు రుచి చూసిన పవన్ కల్యాణ్

By Staff
|
Google Oneindia TeluguNews

Pawan Kalyan
కరీంనగర్: జిల్లాలో నాలుగు రోజులుగా పర్యటిస్తున్న పవన్‌ కళ్యాణ్‌ చివరి రోజైన శుక్రవారం కల్లు రుచి చూశారు. రోడ్‌ షోలో చివరి రోజైన శుక్రవారం ఎల్లంపల్లి ప్రాజెక్టు వద్ద మహాధర్నా నిర్వహించారు. అంతకు ముందు రామగుండం మండలం పెద్దంపేట నుంచి ప్రాజెక్టు వరకు ఏడు కిలోమీటర్ల పాదయాత్ర జరిపారు.

ఈ సందర్భంగా పెద్దంపేట వద్ద కల్లుగీత కార్మికులు పవన్‌ కళ్యాణ్‌కు అభిమానంతో కల్లుకుండ అందించారు. పవన్‌ అందులో ఉన్న కల్లు రుచి చూశారు. దీంతో అభిమానులు, కార్యకర్తలు కేరింతలు కొట్టారు. పవన్ కల్యాణ్ పెద్దంపేట నుంచి అంతర్గాం, ఎల్లంపల్లి క్రాస్‌ రోడ్‌, ముర్మూర్‌ మీదుగా ప్రాజెక్టు వరకు ఏడు కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. కిలోమీటరు దూరం నడిచిన అనంతరం పవన్‌ కళ్యాణ్‌ ఆయాసానికి గురై కాసేపు మీడియా వాహనంలో సేద తీరారు. ఆ తర్వాత అక్కడ ప్రజారాజ్యం కార్యకర్తలు బహుకరించిన నాగలి పట్టుకుని ప్రాజెక్టు వరకు పాదయాత్ర కొనసాగించారు.

మధ్య మధ్యలో పోలీసులు ఆయనకు మంచినీళ్లు అందించారు. దారి పొడువునా ప్రజలు ఆయనకు నీరాజనం పలికారు. పవన్‌ కళ్యాణ్‌ రైతులు, మహిళల్ని పలకరించి వారి బాధలను తెలుసుకున్నారు. ముర్మూర్‌కు సమీపంలో పునరావాస కాలనీ నిర్మాణానికి వేసిన శిలాఫలకాన్ని సందర్శించారు. శిథిలావస్థకు చేరిన శిలాఫలకం ముక్కలను చూపిస్తూ ఈ ప్రభుత్వ పనితీరుకు ఇవి నిదర్శనమని అన్నారు.

అంతర్గాం వద్ద డప్పు కొట్టి అభిమానులను ఆనందింపజేశారు. పార్టీ జెండాలను ఆవిష్కరించారు. అనంతరం ప్రాజెక్టు వద్ద కొద్దిసేపు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అవినీతికి కిటికీలు తెరిస్తే... కాంగ్రెస్‌ పార్టీ ఏకంగా గేట్లు తెరిచిందని విమర్శించారు.

ఎల్లంపల్లి ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిన అంచనాలను రాత్రికి రాత్రే రూ. 400 కోట్ల మేరకు పెంచి అవినీతికి పాల్పడిందన్నారు. ప్రాజెక్టు నిర్మాణం వల్ల ముంపునకు గురయ్యే నిర్వాసితులు 'మా ఇల్లు సంగతేమిటి?' అని ప్రశ్నిస్తే, ముందు మా ఇల్లును చక్కబెట్టుకోనివ్వండి ఆ తర్వాత మీ సంగతి చూద్దాం' అంటున్నారని ప్రభుత్వ వైఖరిపై దుయ్యబట్టారు. కాంగ్రెస్‌ లంచగొండుల్ని, జలయజ్ఞం దోపిడీ తిమింగలాల్ని ప్రజారాజ్యం శిక్షిస్తుందని అన్నారు.

అన్న రాజ్యం వస్తుంది.. చిరంజీవి ముఖ్యమ్రంత్రి అవుతాడు... మీ సమస్యలన్నీ పరిష్కారమవుతాయని పవన్‌ కళ్యాణ్‌ భరోసా ఇచ్చారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు నిర్వాసితులకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. శుక్రవారం సుభాష్‌ చంద్రబోస్‌ జయంతి కావడంతో కరీంనగర్‌లో పవన్‌ కళ్యాణ్‌ ఆయన విగ్రహానికి పూలమాల వేశారు. సుల్తానాబాద్‌, పెద్దపల్లిలో కాసేపు ఆగి ప్రసంగించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X