హైదరాబాద్: ప్రజలు తనపై ఆపారమైన ప్రేమ చూపుతున్నారని ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి అన్నారు. ప్రజల కొండంత ప్రేమనే తనకు అండదండలని ఆయన అన్నారు. ప్రజల అభిమానానికి తనకు ఎంతో ఆనందంగా ఉందని ఆయన అన్నారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో గురువారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తాము సామాజిక న్యాయ సాధనకు రాజకీయాల్లోకి వచ్చినట్లు ఆయన తెలిపారు. తాము మాటల్లో కాకుండా చేతల్లో దాన్ని చేసి చూపించామని ఆయన చెప్పారు.
సమాజంలో అత్యధిక శాతం ఉన్న వెనకబడిన తరగతులకు ఇతర రాజకీయ పార్టీలు రాజ్యాధికారం ఎందుకు ఇవ్వడం లేదని ఆయన ప్రశ్నించారు. వారికి రాజ్యాధికారం సాధించడమే తమ లక్ష్యమని ఆయన చెప్పారు. చిరంజీవి రోడ్ షోలో ప్రజారాజ్యం పార్టీ నాయకుడు టి. దేవేందర్ గౌడ్ కూడా పాల్గొన్నారు. ప్రజలు మార్పు కోరుతున్నారని, మార్పు కోసం ప్రజారాజ్యం పార్టీని గెలిపిస్తారని ఆయన అన్నారు.