• search
  • Live TV
నిజామాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

డిఎస్ కు ఇసి నోటీసు

By Staff
|

D Srinivas
న్యూఢిల్లీ: ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పీసీసీ) అధ్యక్షుడు డి.శ్రీనివాస్‌కు కేంద్ర ఎన్నికల సంఘం (ఇసి) నోటీసు జారీచేసింది. ఈనెల 5న నిజామాబాద్‌ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై ఆయన నుంచి వివరణ కోరింది. గురువారం సాయంత్రం విలేకరుల సమావేశంలో ఎన్నికల సంఘం ఉప కమిషనర్‌ జె.పి.ప్రకాశ్‌ ఈ విషయాన్ని వెల్లడించారు. ఈనెల 5వ తేదీన నిజామాబాద్‌ అర్బన్‌ నియోజకవర్గ పరిధిలో జరిగిన మైనార్టీల సమావేశంలో డీఎస్‌ మాట్లాడుతూ 'నేను ఈ స్థాయికి చేరానంటే దానికి మీరే కారణం. మీరు పదేపదే గెలిపించారు. లేకపోతే నేను ఈ స్థాయికి చేరేవాడిని కాదు. ఒక అన్నగా నా జీవితంలో మిమ్మల్ని ఎప్పటికీ మరిచిపోను. నిజామాబాద్‌ ప్రజలు ముఖ్యంగా మైనారిటీ సోదరుల కారణంగా నేను పీసీసీ అధ్యక్షుడినయ్యాను. మీకోసం తలనరుక్కోడానికి సిద్ధంగా ఉన్నాను. రాజీపడే ప్రసక్తేలేదు. ఇటువైపు ఎవరైనా వేలెత్తిచూపితే వారికి చేతులుండవు. పది సంవత్సరాలుగా నిజామాబాద్‌లో శాంతియుత వాతావరణం ఉంది. మతతత్వ శక్తులకు ఇక్కడ అవకాశం లేదు. మళ్లీ వాతావరణం చెడగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఓట్లు విభజించాలనే కుట్ర జరుగుతోంది' అని పేర్కొన్నట్లు ప్రసార సాధనాల్లో వార్తలొచ్చాయి.

డీఎస్‌ మాటలు మతవిద్వేషాలను రెచ్చగొట్టే విధంగా ఉన్నాయని, ముస్లింల వైపు చూపితే చేతులు నరికేస్తామంటూ డీఎస్‌ ఎన్నికల ప్రవర్తనా నియమావళికి విరుద్ధంగా మాట్లాడారని భారతీయ జనతా పార్టీ (బిజెపి) నాయకుడు ఎన్‌.రామచంద్రరావు, వీహెచ్‌పీ రాష్ట్ర కార్యదర్శి జి.దుర్గయ్యలు వేర్వేరుగా రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుబ్బారావుకు 6వ తేదీన ఫిర్యాదుచేశారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై వరుణ్‌గాంధీపై నాసా ప్రయోగించారని, అదే తరహాలో మాట్లాడిన డీఎస్‌పై కూడా అదే చట్టం కింద కేసు నమోదుచేయాలని డిమాండ్‌ చేశారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి నిజామాబాద్‌ జిల్లా అధికారుల నుంచి డీఎస్‌ మాట్లాడిన సీడీలను తెప్పించుకున్నారు. ఆ మరుసటి రోజే దాన్ని కేంద్ర ఎన్నికల సంఘానికి పంపారు. ఆ సీడీని పరిశీలించిన తర్వాత డీఎస్‌ వివరణ కోరుతూ ఈసీ గురువారం నోటీసులు జారీచేసింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X