లక్నో: మత విద్వేషాల వ్యాఖ్యల అభియోగంపై జాతీయ భద్రత చట్టం(నాసా) కింద అరెస్టయిన వరుణ్ గాంధీకి ఊరట లభించింది. వరుణ్ పై ప్రయోగించిన నాసా చెల్లదని ఉత్తరప్రదేశ్ సలహా సంఘం తీర్పుచెప్పింది. జస్టిస్ ప్రదీప్ కాంత్ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల బృందం శుక్రవారం ఈ నిర్ణయాన్ని వెలువరించింది. వరుణ్ పై ప్రయోగించిన నాసా చెల్లదని సలహా సంఘం చెప్పిందని హోంశాఖ కార్యదర్శి జావెద్ అహ్మద్ చెప్పారు. నాసా ప్రయోగించడంపై గత నెల 28న సలహా సంఘం ఇరుపక్షాల వాదనలను నమోదు చేసుకుంది. వరుణ్‌పై నాసా ప్రయోగించడానికి సరైన కారణాలు కనిపించడంలేవని సభ్యులు అభిప్రాయపడ్డారు. ఈ వివాదంలో పిలిభిత్ జిల్లా మేజిస్ట్రేట్ ఇచ్చిన వివరణ కూడా సంతృప్తికరంగా లేదని అన్నారు.
ఇది ప్రజాస్వామ్య విజయమని బిజెపి ఉత్తరప్రదేశ్ రాష్ట్రాధ్యక్షుడు త్రిపాఠీ అన్నారు. బోర్డు ఆదేశాలు యూపీఏ ప్రభుత్వం ఓటు బ్యాంకు రాజకీయాలను బట్టబయలు చేశాయని బిజెపి అధికార ప్రతినిధి ప్రకాష్ జవేదకర్ అన్నారు. వరుణ్ గాంధీ పోటీ చేస్తున్న పిలిభిత్, మేనకాగాంధీ బరిలో ఉన్న నియోజవర్గాలకు ఈ నెల 13న పోలింగ్ జరుగుతోంది. కాంగ్రెస్ పార్టీ ఈ విషయంపై ఆచితూచి స్పందించింది. సత్ప్రవర్తనతో మెలుగుతానని వరుణ్‌గాంధీ ఇప్పటికే సుప్రీంకోర్టుకు విన్నవించుకున్నాడని పార్టీ నాయకుడు కపిల్ సిబాల్ గుర్తుచేశారు. నాసా ప్రయోగించాలని మాయావతి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో తమకెలాంటి సంబంధం లేదన్నారు.
సలహా సంఘం ఆదేశాలను సుప్రీంకోర్టులో సవాల్ చేయనున్నట్లు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. సంఘం తీర్పు ఏకపక్షంగా ఉందని, కీలక ఆధారాలను పరిగణనలోకి తీసుకోలేదని బీఎస్పీ నాయకుడొకరు అన్నారు.
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి