హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సిటీలో ఉగ్రవాద దాడి: ఒకరు మృతి

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: రాష్ట్ర రాజధానిలో పట్టపగలు రద్దీగా ఉండే ఫలక్‌ నుమా సబ్‌ స్టేషన్‌ ప్రాంతంలో పోలీసు పికెట్‌ పై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. స్కూటర్‌ పై వచ్చిన ఇద్దరు యువకులు పిస్టళ్లతో అతి సమీపం నుంచి కాల్పులు జరిపారు. పికెట్‌లో ఉన్న హోంగార్డు, కానిస్టేబుల్‌ కుప్పకూలారు. హోంగార్డు బాలస్వామి అక్కడికక్కడే మరణించగా, కానిస్టేబుల్‌ రాజేంద్రప్రసాద్‌ ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. 'మక్కామసీదులో పేలుడు జరిగి రెండేళ్లయ్యింది. పేలుడు అనంతరం పోలీసులు జరిపిన కాల్పుల్లో అమాయక ముస్లిములు ప్రాణాలు కోల్పోయారు. ఆ ఘటనకు ప్రతీకారంగా కాల్పులకు దిగాం' అని టీజీఐ (తెహరీక్‌-ఎ-గల్బా ఇస్లాం) పేరుతో సంఘటన స్థలంలో కరపత్రాన్ని పారవేశారు. సంఘటన స్థలం చార్మినార్‌, మక్కా మసీదులకు మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది.

మక్కా మసీదులో బాంబు పేలుడు జరిగి రెండేళ్లయిన సందర్భంగా సోమవారం ఎంఐఎం, పలు స్వచ్ఛంద సంస్థలు సంస్మరణ కార్యక్రమాలు ఏర్పాటు చేశాయి. గొడవలు జరిగే అవకాశాలున్నందున పోలీసులు పాత నగరంలోని కీలక ప్రాంతాల్లో పికెట్లు ఏర్పాటు చేశారు. ఫలక్‌ నుమా ప్రాంతంలోని సబ్‌ స్టేషన్‌ ఎదురుగా ఏర్పాటు చేసిన పికెట్‌లో అదే స్టేషన్‌కు చెందిన కానిస్టేబుల్‌ రాజేంద్రప్రసాద్‌, హోంగార్డు బాలస్వామిలను నియమించారు. వీరిద్దరూ లాఠీలు చేత పట్టుకుని పహారా కాస్తున్నారు. సాయంత్రం 4.15 గంటలకు ఇద్దరు ఆగంతుకులు స్కూటర్‌ పై అక్కడకు వచ్చారు. పికెట్‌కు కొద్ది దూరంలో స్కూటర్‌ నిలిపి దగ్గరకు వచ్చారు. కానిస్టేబుల్‌ రాజేంద్ర ప్రసాద్‌ కుర్చీలో కూర్చుని దినపత్రిక చదువుతున్నారు. కొంతదూరంలో స్టూల్‌ పై హోంగార్డు కూర్చుని ఉన్నారు. దుండగులిద్దరూ పిస్టళ్లతో కానిస్టేబుల్‌ పై కాల్పులకు దిగారు. వెంటనే హోంగార్డు చెట్టుచాటుకు వెళ్లి ఉన్నతాధికారులకు ఫోన్‌ ద్వారా సమాచారం అందించే ప్రయత్నం చేశారు. ఇది గమనించిన దుండగులు అతనిపైనా కాల్పులకు దిగారు. కడుపులో బుల్లెట్‌ దిగింది. హోంగార్డు కొంతదూరం వెళ్లి మళ్లీ ఫోన్‌ చేసేందుకు ప్రయత్నించాడు. దుండగులు దగ్గరికివచ్చి తలపై అతి సమీపం నుంచి కాల్చారు. మొత్తం ఎనిమిది రౌండ్ల కాల్పులు జరిగినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. కాల్పుల అనంతరం దుండగులు స్కూటర్‌ పై ఫారూఖ్‌ నగర్‌ వైపు పారిపోయారు. ఒకరు హెల్మెట్‌ ధరించి ఉండగా, మరొకరు మంకీక్యాప్‌ పెట్టుకున్నట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.

రక్తమోడుతున్న హోంగార్డు, కానిస్టేబుళ్లను పోలీసులు చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అయిదు బుల్లెట్లు దూసుకుపోయి తీవ్ర రక్తస్రావం అయిన హోంగార్డు బాలస్వామిని ఆసుపత్రికి తరలించేసరికే మృతి చెందాడని వైద్యులు ప్రకటించారు. బాలస్వామి పొట్టలో ఎడమ వైపు, ఛాతీ ఎడమ పక్క, భుజం కింద, తల వెనక భాగంలో, వెన్నుపూసకు ఎడమవైపు బుల్లెట్లు దూసుకుపోయాయి. రాజేంద్రప్రసాద్‌కు తల వెనకభాగంలో బుల్లెట్‌ దూసుకుపోయింది. మెరుగైన చికిత్స కోసం కేర్‌ ఆసుపత్రికి తరలించారు. రక్తం బాగా పోయిందని, పరిస్థితి ఆందోళనకరంగానే ఉందని, ఇప్పట్లో ఏమీ చెప్పలేమని కేర్‌ వైద్యులు తెలిపారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X