• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

మడమ తిప్పలేదు: వైయస్

By Staff
|

YS Rajasekhar Reddy
హైదరాబాద్‌: రాష్ట్రంలో 2004 ఎన్నికల ముందు చేసిన ప్రతి వాగ్దానాన్నీ నెరవేర్చామని, ఆడినమాట తప్పలేదని మడమ వెనక్కి తిప్పలేదని ముఖ్యమంత్రిగా రెండో సారి ప్రమాణ స్వీకారం చేసిన వైయస్ రాజశేఖర రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రిగా రెండో సారి ఆయన బుధవారం సాయంత్రం హైదరాబాదులోని ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ ఎన్డీ తివారీ ఆయన చేత ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం తన ప్రమాణ స్వీకారానికి వచ్చిన ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఎన్నికల వాగ్దానాలే కాదు, ప్రజలకు ఏ అవసరమొచ్చినా వ్యయప్రయాసలు లెక్కచేయకుండా కాంగ్రెస్‌ పనిచేసిందని చెప్పుకున్నారు. తాము అమలు చేస్తున్న పథకాలను ఆయన వివరించారు. విశ్వసనీయతకు, వంచనకు మధ్య జరిగిన ఎన్నిక విపక్షం వంచనతో కూడిన మోసపూరిత వాగ్దానాలతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేసిందని ఆయన అన్నారు. అధికారంలో ఉన్నప్పుడు పేదల బాగోగులు పట్టించుకోకుండా వదిలేసిందని ఆయన విమర్సించారు. ప్రజలు విజ్ఞులు, కాంగ్రెస్‌ పట్ల పూర్తి స్థాయి ఆదరణ చూపారని ఆయన అన్నారు.

ఎన్నికల ప్రణాళికలో హామీ ఇచ్చిన ప్రకారం ప్రతి తెల్లకార్డుపై ఇచ్చే 20 కిలోల బియ్యాన్ని 30 కిలోలకు పెంచే దస్త్రంపై వైఎస్‌ తొలి సంతకం చేశారు. వ్యవసాయానికి ఇస్తున్న ఏడు గంటల ఉచిత విద్యుత్‌ను తొమ్మిది గంటలకు పెంచే దస్త్రంపై రెండో సంతకం చేశారు. రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రగామిగా అభివృద్ధి చేయడానికి ప్రతిపక్షాలు సహకరించాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. ఎన్నికల్లో రకరకాల విమర్శలు చేసుకున్నామని, వాటిని పక్కనబెట్టి ప్రజల తీర్పును గౌరవించి నిర్మాణాత్మకంగా వ్యవహరించాలని వాటికి సూచించారు. రాష్ట్రాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేయడానికి హృదయపూర్వకంగా ఆశీర్వదించాలని రాష్ట్ర ప్రజలను అభ్యర్థించారు. కోటా పెంపు మేరకు బియ్యాన్ని అక్టోబర్ నుంచి ఇస్తామని, వ్యవసాయానికి ఉచిత విద్య్తుత్తును జూన్ నుంచే సరఫరా చేస్తామని ఆయన చెప్పారు.

కాంగ్రెస్‌ జాతీయ పార్టీ అని రాష్ట్రానికో ప్రాంతానికో పరిమితమైంది కాదని, సిద్ధాంతాలతో ఏ ఒక్కరోజూ రాజీ పడలేదని ఆయన చెప్పుకున్నారు. 120 సంవత్సరాల చరిత్ర కలిగిన కాంగ్రెస్‌ లౌకికవాదాన్ని నిలబెట్టిందని, ఏ మైనారిటీ మతమైనా వారి పద్ధతిలో ప్రచారం నిర్వహించుకోవచ్చునని, ఇబ్బంది ఉండదని, ప్రాంతీయ పార్టీలను పక్కనబెట్టి ప్రజలు కాంగ్రెస్‌కు పూర్వ వైభవాన్ని ఇచ్చారని, మరిన్ని మేళ్లు చేయడానికి వెనుకాడబోమని ఆయన అన్నారు. ప్రభుత్వ కార్యాచరణలో, కర్తవ్య నిర్వహణలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా పార్టీ కార్యకర్తలు నిరోధించాలని, అధికార దుర్వినియోగం కూడదని శ్రేణులకు విజ్ఞప్తి చేస్తున్నానని, బలం పెరిగే కొద్దీ ఒదగాలి తప్ప గర్వంతో ఉండకూడదని ఆయన అన్నారు. ఎదిగేకొద్దీ ఒదగాలని కాంగ్రెస్‌ శ్రేణులను కోరుతున్నానని ఆయన అన్నారు.

లోక్‌ సభ ఎన్నికల్లో అఖండ మెజారిటీతో గెలిపించి భారతదేశంలో ఏ రాష్ట్రమూ ఇవ్వని అత్యంత గొప్ప శక్తిని ఆంధ్ర ప్రజలు కాంగ్రెస్‌ కు అందించినందుకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. 42 లోక్‌ సభ స్థానాలకు గాను 33 స్థానాలు ఇచ్చారంటే ఏం చేస్తే మీ రుణం తీర్చుకోగలను అని రాజశేఖర రెడ్డి అన్నారు. ఐదేళ్ల క్రితం కాంగ్రెస్‌, మరికొన్ని పార్టీలతో కలిసి అధికారంలోకి వచ్చింది. ఐదేళ్ల తర్వాత ప్రభుత్వ వ్యతిరేకత ఉంటుందని, గెలుపు అంత సులభం కాదని కొందరన్నారుని, పూర్తి స్థాయి మెజారిటీ రావడం దుస్సాధ్యమన్నారు రాజకీయ విశ్లేషకులు అంచనాలు వేశారని, తనకు మాత్రం ఏ రోజూ అనుమానం రాలేదని ఆయన అన్నారు. దేశంలో యూపీఏ ప్రభుత్వం సోనియా, మన్మోహన్‌ ఆధ్వర్యంలో మంచి పరిపాలన అందించిందని, భారతదేశం వెలగడమంటే ధనవంతులు, భూస్వాములు, పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలు వెలగడం కాదని, సామాన్యుడికి మేలు చేయాల్సిన అవసరం ఉందని గుర్తించిందని ఆయన అన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన పలు కార్యక్రమాలను ఆయన వివరించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X