వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

యుపిఎకు డిఎంకె బెదిరింపులు

By Staff
|
Google Oneindia TeluguNews

Karunanidhi
న్యూఢిల్లీ: ప్రధానమంత్రిగా మన్మోహన్‌ సింగ్‌ కొన్ని గంటల్లో ప్రమాణం చేయనుండగా మంత్రి పదవులకు సంబంధించి కాంగ్రెస్‌, డీఎంకేల మధ్య ఏర్పడిన విభేదాలు తీవ్రమయ్యాయి. ఫార్ములా పేరిట తమకు పదవుల్లో కోత విధించాలనుకోవడం, తమ పార్టీ నుంచి ఎవరెవరు మంత్రులుగా ఉండాలో నిర్దేశించడంపై డీఎంకే ఆగ్రహం వ్యక్తంచేసింది. కోరిన మంత్రి పదవులు ఇవ్వనందుకు, తమ సీనియర్‌ నేతలు టీఆర్‌ బాలు, ఎ.రాజాలను చేర్చుకోబోమని అన్నందుకు మన్మోహన్‌ కేబినెట్‌లో చేరబోమని ప్రకటించింది. యూపీఏ సర్కారుకు బయటి నుంచి మద్దతిస్తామని వెల్లడించింది.

డిఎంకె నేత కరుణానిధి మాత్రం బాలు, రాజాలు కేబినెట్‌లో ఉండి తీరాలని వాదిస్తున్నారు. ప్రధాని ఫోనుచేసి నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు. వారిద్దరినీ పక్కనబెడితే మరిన్ని మంత్రి పదవులిచ్చేందుకు కూడా సంసిద్ధత వ్యక్తంచేశారు. చివరకు తానే దిగివచ్చి కనీసం వారి శాఖలైనా మారుద్దామని ప్రతిపాదించారు. కరుణానిధి ససేమిరా అన్నారు. బాలు, రాజా సహా నాలుగు కేబినెట్‌ బెర్తులు, స్వతంత్ర హోదా ఉన్న సహాయ మంత్రి పదవి, మరో మూడు సహాయ మంత్రి పదవులు ఇవ్వాలని తేల్చిచెప్పారు.

కాంగ్రెస్‌ అంగీకరించకపోవడంతో యూపీఏకి వెలుపలి నుంచి మద్దతిస్తామని ప్రకటించాల్సిందిగా డీఎంకే పార్లమెంటరీ పార్టీ నేత టీఆర్‌ బాలును కరుణానిధి ఆదేశించారు. ఆ ప్రకారం బాలు వెల్లడించారు. 2004లో శాఖల కేటాయింపుపై ఫార్ములా లేదని, ఇప్పుడు కాంగ్రెస్‌ ఎందుకు తీసుకొస్తోందని ఆయన ప్రశ్నించారు. ఆ పార్టీకి 145 మంది సభ్యులున్నప్పుడు అన్నీ మంచిగానే కనిపించాయని, ఇప్పుడు 206 స్థానాలు వచ్చేటప్పటికి నియమావళి, సూత్రాలు అని వల్లెవేస్తోందని డీఎంకే నేతలు తప్పుబడుతున్నారు. లోక్‌సభలో 18 మంది డీఎంకే సభ్యులున్నారని, తాము ఏడు బెర్తులు అడుగుతుండగా కాంగ్రెస్‌ ఐదే ఇస్తామని అంటోందని బాలు ఆక్షేపించారు. నిజానికి కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు ప్రణబ్‌ ముఖర్జీ, ఏకే ఆంటోనీ, గులాం నబీ ఆజాద్‌, అహ్మద్‌ పటేల్‌లు గురువారం రెండు సార్లు కరుణానిధితో చర్చలు జరిపారు. సంతృప్తికర పరిష్కారం దొరకలేదు.

డీఎంకే కార్యవర్గ సమావేశంలో భావి కార్యాచరణకు సంబంధించి శుక్రవారమే నిర్ణయం తీసుకోనున్నారు. ప్రధాని ప్రమాణ స్వీకారానికి హాజరయ్యే సూచనలు కనిపించక కాంగ్రెస్‌ వ్యూహకర్తలు గురువారం రాత్రి హడావుడిగా 10-జన్‌పథ్‌కు చేరుకున్నారు. సోనియాగాంధీ తో సుదీర్ఘంగా మంతనాలు జరిపారు. సోనియా కూడా మన్మోహన్‌తో సమావేశమయ్యారు. శుక్రవారం ఉదయానికి కరుణానిధిని శాంతపరిచే దిశగా ప్రయత్నాలు సాగుతున్నాయి.

యూపీఏకి వెలుపలి నుంచి మద్దతిస్తామని డీఎంకే ప్రకటించినంత మాత్రాన ఆ పార్టీతో చర్చలు ముగిసినట్లు కాదని కాంగ్రెస్‌ మీడియా విభాగం పర్యవేక్షకుడు జనార్దన్‌ ద్వివేది తెలిపారు. గత మంత్రివర్గంలో ఆ పార్టీ తరపున ఏడుగురు మంత్రులు ఉన్నారని, అదనంగా ఇవ్వాలని డీఎంకే కోరుతోందని చెప్పారు. వారు హేతుబద్ధంగా వ్యవహరించాలని అన్నారు. చాలా మిత్రపక్షాల విషయంలో గత ప్రాతినిధ్యానికి తాము సరేనన్నామని, డీఎంకే మాత్రం ఎక్కువ కావాలని పట్టుబడుతోందని చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X