హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నేడు వైయస్ క్యాబినెట్ విస్తరణ

By Staff
|
Google Oneindia TeluguNews

YS Rajasekhar Reddy
హైదరాబాద్: రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి మంత్రివర్గ తొలి విస్తరణకు రంగం సిద్ధమైంది. ముఖ్యమంత్రి అనుకున్నట్లుగా జరిగిత సోమవారం సాయంత్రం మంత్రులతో గవర్నరు పదవీప్రమాణం చేయిస్తారు. మొదటి విడతలో 20 మందికి చోటు లభిస్తుందని భావిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం చవిచూసిన పీసీసీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్‌, మాజీ మంత్రి జీవన్‌ రెడ్డిలకు కూడా మంత్రివర్గంలో స్థానం దక్కుతుందని సమాచారం. శనివారం రాత్రి ఢిల్లీ చేరిన వైఎస్‌ ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీని కలవాల్సి ఉంది. అయితే ఆమె కేంద్ర మంత్రివర్గ విస్తరణ, శాఖల కేటాయింపు తదితర విషయాల్లో తీరిక లేకుండా ఉండడంతో ఆయనకు పిలుపు అందలేదు. రాత్రి వరకు వేచిచూశారు. సోమవారం ఉదయం 11గంటలకు ఆమెతో సమావేశానికి అనుమతి లభించిందని సమాచారం. మంత్రుల జాబితాపై ఆమె చేత ఆమోదముద్ర వేయించుకుని ఆయన ప్రత్యేక విమానంలో బయలుదేరి మధ్యాహ్నానికి హైదరాబాద్‌ చేరుకుంటారు.

రాజ్‌ భవన్‌ లో సాయంత్రం ఆరు గంటలకు మంత్రుల ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. మరుసటిరోజు వైఎస్‌ కుటుంబసమేతంగా జెరూసలెం వెళ్తున్నందున ఎట్టి పరిస్థితుల్లోనూ సోమవారమే ప్రమాణస్వీకారం ఉంటుందని చెబుతున్నారు. మంత్రి పదవుల కోసం ఈసారి కొన్ని జిల్లాల్లో నేతల మధ్య పోటీ తీవ్రంగా ఉండడంతో ఆ జిల్లాలను ప్రస్తుతానికి ఖాళీగా ఉంచే అవకాశం కనిపిస్తోంది. దాదాపుగా అన్ని ప్రధాన సామాజిక వర్గాలకు తొలి విడతలోనే ప్రాతినిధ్యం కల్పించాలనుకుంటే తొలివిడతలో 20 నుంచి 30 మంది వరకు మంత్రులను తీసుకుంటారని పార్టీ వర్గాలు అంటున్నాయి. గత మంత్రివర్గంలోని 14 మంది మంత్రులు నిన్నటి ఎన్నికల్లో ఓటమిపాలయ్యారు. మిగిలినవారిలో నల్గొండ జిల్లాకు చెందిన ఆర్‌.దామోదరరెడ్డి స్థానే ఖమ్మం జిల్లా పాలేరుకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆయన సోదరుడు వెంకటరెడ్డికి పదవి ఇస్తారని భావిస్తున్నారు. మెదక్‌ జిల్లాకు చెందిన గీతారెడ్డికి మంత్రి పదవి ఇవ్వకపోతే సభాపతి పదవి ఖాయంగా దక్కుతుందని అంచనా వేస్తున్నారు. గుంటూరు జిల్లా నుంచి మాజీ మంత్రి, ఎమ్మెల్సీ రోశయ్యకు మంత్రి పదవి ఖాయమైనట్లే. అక్కడ గత ప్రభుత్వంలో మంత్రులు కన్నా లక్ష్మీనారాయణ, మోపిదేవి వెంకటరమణ, కాసు వెంకటకృష్ణారెడ్డి మళ్లీ పోటీ పడుతున్నారు. తాడికొండ ఎమ్మెల్యే డొక్కా మాణిక్యవరప్రసాదరావుకు కచ్చితంగా పదవి దక్కుతుందని అంటున్నారు. పోటీ తీవ్రంగా ఉన్న నేపథ్యంలో వైఎస్‌కు సన్నిహితుడైన కాసు వెంకటకృష్ణా రెడ్డికి మళ్లీ పదవి దక్కడం సందేహమేనని పార్టీ వర్గాలు అంటున్నాయి. నిజామాబాద్‌ అర్బన్‌ స్థానంలో అనూహ్యంగా ఓడిన డీఎస్‌, కరీంనగర్‌ జిల్లా జగిత్యాలలో పరాజయం పొందిన జీవన్‌రెడ్డిలకూ మంత్రివర్గంలో చోటు దక్కుతుందని పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. కర్నూలు, కృష్ణా, హైదరాబాద్‌ లాంటి జిల్లాల నుంచి ప్రాతినిధ్యం కల్పించకుండా ప్రస్తుతానికి ఖాళీగా ఉంచే అవకాశం కనిపిస్తోంది.

పార్టీ రాష్ట్ర వ్యవహారాల పర్యవేక్షకుడు, కేంద్ర మంత్రి వీరప్ప మొయిలీ ఆదివారం 10-జన్‌పథ్‌కు వెళ్లి సోనియాతో సమావేశమయ్యారు. వైఎస్‌ రాక గురించి చెప్పారు. రాష్ట్రమంత్రివర్గ జాబితాపై చర్చించారు. జాతీయ రాజకీయ పరిణామాలతో తీరికలేనందున వైఎస్‌ను కలిసేందుకు ఆమె అశక్తత వ్యక్తంచేశారు. తర్వాత మొయిలీతో ఆయన సమావేశమై మంత్రివర్గం కూర్పుపై విస్తృతంగా చర్చించారు. రాత్రి వరకు వేచిచూశాక ఇక ఆదివారం భేటీ కుదరదని 10-జన్‌పథ్‌ వర్గాలు వైఎస్‌కు తెలిపాయి. సోమవారం ఉదయం 11 గంటలకు సోనియాతో భేటీకి అప్పాయింట్‌మెంట్‌ ఖరారైనట్లు తెలిసింది. ఇంకోవైపు మంత్రి పదవులపై ఆశలు పెట్టుకున్న పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆదివారమంతా ఢిల్లీలో వైఎస్‌తో భేటీకి బారులు తీరారు. గండ్ర వెంకటరమణారెడ్డి, కె.నాగేశ్వరరావు, పాలడుగు వెంకట్రావు, రుద్రరాజు, వై.శివరామిరెడ్డి తదితరులు వీరిలో ఉన్నారు. మాజీ చీఫ్‌విప్‌ కిరణ్‌కుమార్‌రెడ్డి ఎంపీ మహ్మద్‌ అజహరుద్దీన్‌ను వెంటబెట్టుకుని వచ్చి వైఎస్‌ను కలిశారు. లోక్‌సభ సభాపతి పదవికి రేసులో ఉన్న వైరిచర్ల కిశోర్‌ చంద్రదేవ్‌ కూడా ఏపీభవన్‌కు వచ్చి ముఖ్యమంత్రిని కలిశారు. కావూరి సాంబశివరావు, నంది ఎల్లయ్య, కనుమూరి బాపిరాజు, పనబాక లక్ష్మి, సర్వే సత్యనారాయణలు కూడా ఆయనతో సమావేశమయ్యారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X