కుప్పం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఇవియంలు వద్దు: బాబు వాదన

By Staff
|
Google Oneindia TeluguNews

Chandrababu Naidu
హైదరాబాద్‌: ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాల పద్ధతి నుంచి మళ్లీ బ్యాలెట్‌ పద్ధతికి రావాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాల్లో ఓటు వేయడం తప్ప ఆ ఓటు ఎవరికి వెళ్లిందనేది యంత్రానికి తప్ప, ఓటు వేసిన వారికి కూడా తెలియదని ఆయన అన్నారు. తాను మొన్న కుప్పం నియోజకవర్గం గుడిపల్లి గ్రామం వెళ్లినప్పుడు ఓ ముసలామె తనను గట్టిగా పట్టుకుందని, మళ్లీ బ్యాలెట్‌ మీద ఓటేసే పాత పద్ధతి రావాలని అడిగిందని చెప్పారు. మహానాడులో గురువారమిక్కడ చంద్రబాబు ప్రసంగించారు. తమిళనాడులో ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాలు వద్దని అన్నాడీఎంకే అధినాయకురాలు జయలలిత కూడా అంటున్నారని గుర్తుచేశారు. ఈ ఎన్నికల్లో రాష్ట్రంలోనూ పలుచోట్ల ఈవీఎంలు సరిగా పనిచేయలేదన్నారు. ఒక్కోచోట సాయంత్రం వరకు అవి పనిచేయలేదని, మరోచోట ఓ పార్టీకి ఓటేస్తే మరో పార్టీకి పడుతుండడంతో మళ్లీ చెక్‌ చేశారన్న వార్తలూ వచ్చాయన్నారు. అలాగే కౌంటింగ్‌ రోజు కొన్ని ఈవీఎంలు ఓపెన్‌ కాలేదని తెలిపారు. 15, 20 వేలతో అభ్యర్థి గెలిస్తే ఫర్వాలేదు కానీ 500, వెయ్యి ఓట్లతో గెలిచేచోట్ల ఏదైనా ఓ ఈవీఎం ఓపెన్‌ కాకుంటే పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు.

పార్టీ రాష్ట్ర కమిటీని, అనుబంధ కమిటీలను రద్దుచేస్తున్నట్లు చంద్రబాబు ప్రకటించారు. సభ్యత్వ నమోదు తర్వాత కొత్త కమిటీలు నియమిస్తామని, ఇందులో యువతకు పెద్దపీట వేస్తామన్నారు. ఈసారి జిల్లా, మండల, గ్రామస్థాయి కమిటీలతో పాటు ప్రాంతీయ కమిటీలు కూడా వేస్తామని తెలిపారు. ప్రతి ఏడెనిమిది బూత్‌లు, కొన్ని గ్రామాలకు కలిపి ఓ ప్రాంతీయ కమిటీ వేస్తామన్నారు. రాష్ట్రస్థాయి, జిల్లా స్థాయిలో ఉన్న నేతలైనా సరే ఏదో ఒక ప్రాంతీయ కమిటీకి నాయకుడిగా ఉండి అక్కడి ఓట్లు తేవాలని, ఆ పనిచేయకుండా రాష్ట్ర స్థాయిలో ఊరికే తిరిగితే సరిపోదన్నారు.

తెలుగుదేశం పార్టీ ఒక కుటుంబం లాంటిదని, అందులో ఉన్న పేద కార్యకర్తలను ఆదుకోవాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. పార్టీ చేతనైనంత మేర చేస్తుందని, పలువురు నేతలు కూడా కార్యకర్తలను ఆదుకోగలిగే స్థాయిలో ఉన్నారని, వారు కూడా ఎక్కడికక్కడ ముందుకురావాలన్నారు. ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ తరఫున పార్టీ కార్యకర్తలకు ఉపాధి కల్పించేందుకు తాము సిద్ధమని ప్రకటించారు. ప్రతి నెలకోసారి కార్యకర్తలంతా సమావేశం కావాలని, అందులో ఓ గంటపాటు కుటుంబ విషయాలను కూడా మాట్లాడుకోవాలన్నారు. ప్రతి కార్యకర్త తమ తోటి కార్యకర్తలతో అన్ని కష్టసుఖాలను పంచుకోవాలని సూచించారు.

పార్టీ అన్ని స్థాయిల్లోనూ సమర్థులైన నాయకులను నియమిస్తామని, ఎక్కడికక్కడ అధికార వికేంద్రీకరణ చేసి స్వేచ్ఛ ఇస్తామని అంతా జనంలోకి వెళ్లి పనిచేయాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. ప్రజలు ఎటు వెళ్తున్నారో అటే వెళ్లాలని, లేకుంటే దారి తప్పుతామన్నారు. ఈ ఎన్నికల్లో ఓడిపోయినంత మాత్రాన నిరాశ చెందాల్సిన అవసరం లేదని, బలమైన ప్రతిపక్షంగా బాధ్యతను నిర్వర్తిద్దామని ఉద్ఘాటించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X