సబితా ఇంద్రారెడ్డి ఫొటో కోసం
శంషాబాద్ :కేంద్ర పట్టణాభివృద్ధి శాఖా మంత్రిగా బాధ్యతలు చేపట్టి నియోజకవర్గానికి వచ్చిన చేవెళ్ల ఎంపీ ఎస్.జైపాల్‌రెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. ఆయనకు శంషాబాద్ విమానాశ్రయంలో స్వాగతం చెప్పేందుకు జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు. అనంతరం అక్కడే ఉన్న మల్లికాగార్డెన్స్‌లో స్వాగత సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి సబితారెడ్డి అనుకూల వర్గీయులు, వ్యతిరేక వర్గీయుల మధ్య వాగ్వాదం మొదలై చివరకు సమావేశం రసాభాసగా మారింది.కేంద్ర మంత్రి ముందే కాంగ్రెస్‌లోని గ్రూపు తగాదాలు బయటపడ్డాయి. అత్యుత్సాహంతో తమ నేతను సన్మానించేందుకు పోటీలు పడ్డ కార్యకర్తలు ఒకవైపు.. వేదికపై ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో సబితా ఇంద్రారెడ్డి ఫొటో లేదని ఆమె మద్దతుదారులు మరోవైపు చేసిన గలాటాతో తీవ్ర గందరగోళం, ఉద్రిక్తత నెలకొంది.
తనను సన్మానించేందుకు కార్యకర్తలు పోటీ పడటంతో జైపాల్‌రెడ్డి అసహనానికి గురైనా.. చేసేదేమీలేక సన్మానం చేయించుకున్నారు. ఈలోగానే వేదిక వెనక ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో హోంమంత్రి సబితారెడ్డి ఫోటో లేదంటూ ఆమె మద్దతుదారులు ఆందోళన చేశారు. ఇది ఉద్దేశపూర్వకంగానే జరిగిందని ఆరోపిస్తూ వారిపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. వేదిక ముందుకు తోసుకువచ్చారు. సన్మాన కార్యక్రమాన్ని బహిష్కరించారు. ఈ ఉద్రిక్తతను తొలగించడానికి పోలీసులు రంగ ప్రవేశం చేయాల్సి వచ్చింది.












Click it and Unblock the Notifications