వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వంద రోజుల్లో మహిళా బిల్లు

By Staff
|
Google Oneindia TeluguNews

Pratibha Patil
న్యూఢిల్లీ: రానున్న ఐదేళ్లలో, ప్రత్యేకించి తొలి వంద రోజుల్లో ప్రభుత్వ ప్రాధాన్యతలను, లక్ష్యాలను ప్రభుత్వం తరఫున రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ వెల్లడించారు. పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి ఆమె గురువారం ప్రసంగించారు. దీర్ఘకాలంగా పెండింగ్‌ లో ఉన్న మహిళా బిల్లుకు రానున్న వంద రోజుల్లో ప్రభుత్వం మోక్షం కల్పిస్తామని ఆమె చెప్పారు. రాష్ట్ర చట్టసభలు, పార్లమెంటు ఉభయ సభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లును ఆమోదించడంతో పాటు పంచాయతీలు, స్థానిక సంస్థల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్‌ కల్పించే బిల్లును సైతం తీసుకురానున్నట్లు తెలిపారు.

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు ప్రాధాన్యం, ప్రాతినిధ్యం పెంచేందుకు కొత్త ప్రభుత్వం కృషి చేస్తుందని ఆమె చెప్పారు. మహిళలను దృష్టిలో పెట్టుకుని కార్యక్రమాలు రూపొందించేందుకు ఒక మహిళా సాధికారత మిషన్‌ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. పార్లమెంటులో పెండింగ్‌లో ఉన్న 'ఉచిత, నిర్బంధ విద్య బిల్లు'ను మన్మోహన్‌ సింగ్‌ ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంటుందని ఆమె చెప్పారు.

విద్యా రంగానికి సంబంధించి వివిధ నియంత్రణ సంస్థల్లో సంస్కరణలకోసం జాతీయ నాలెడ్జ్‌ కమిషన్‌, యశ్‌ పాల్‌ కమిషన్‌ సిఫార్సుల మేరకు ఉన్నత విద్యకు ఒక జాతీయ సమితిని 100 రోజుల్లో ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. 14 ఇన్నోవేటివ్‌ యూనివర్సిటీల్లో పని చేసేందుకు ఫ్యాకల్టీలను ఆహ్వానించేందుకు 'మేధో వృద్ధి' విధానాన్ని అవలంబిస్తామన్నారు. దళిత మహిళను స్పీకర్‌ పదవికి ఎన్నుకోవడం వల్ల దేశ ప్రజాస్వామ్య సంప్రదాయాల ప్రతిష్ఠ పెరిగిందని చెప్పారు.

మూడు రూపాయలకే కిలో బియ్యం:
దారిద్ర్య రేఖకు దిగువున ఉన్న పేద కుటుంబాలకు నెలకు పాతిక కిలోల చొప్పున బియ్యం కిలో మూడు రూపాయలకే అందించనున్నట్లు రాష్ట్రపతి ప్రకటించారు. వ్యవసాయ రంగంలో ఆర్థిక వృద్ధిని వేగవంతం చేసేందుకు పలు కార్యక్రమాలు తీసుకోనున్నట్లు చెప్పారు. తమ ప్రభుత్వ ప్రాధాన్యత రంగాల్లో ఇదొకటని స్పష్టం చేశారు. జాతీయ గ్రామీణాభివృద్ధి పథకాన్ని మరింత బాధ్యతాయుతంగా, పాదర్శకంగా నిర్వహిస్తామని చెప్పారు.

మైనార్టీల సంక్షేమానికి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తుందని ప్రకటించారు. వీరి కోసం 'సమాన అవకాశాల కమిషన్‌' ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. వక్ఫ్‌ వ్యవహారాలను ఆధునీకరిస్తామని తెలిపారు. హజ్‌ కార్యక్రమాల్లో సంస్కరణలు తెస్తామని చెప్పారు. అటవీ హక్కుల చట్టం ఫలితాలను ఎస్సీ, ఎస్టీ, ఇతర ఆదివాసీలకు 2009 చివరికల్లా అందేలా చూస్తామన్నారు.

జాతీయ గ్రామీణ వైద్య కార్యక్రమాన్ని మరింత పటిష్ఠం చేస్తామని చెప్పారు. శిశు మరణాలను గణనీయంగా తగ్గించేందుకు ఈ కార్యక్రమం కృషి చేస్తుందన్నారు. దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న కుటుంబాలన్నింటికీ 'రాష్ట్రీయ స్వాస్థ్య బీమా యోజన' వర్తింప చేస్తామని ప్రకటించారు. పోషకాహార లోపం ప్రధాన సవాలుగా పరిణమించిందని చెప్పారు. దీన్ని వెంటనే పరిష్కరించాల్సి ఉందని అన్నారు.

మురికివాడల్లో నివసిస్తున్న ప్రజలకు ఇందిరా ఆవాస్‌ యోజన వలే జేఎన్‌ ఎన్‌ యూఆర్‌ ఎం కింద రాజీవ్‌ ఆవాస్‌ యోజన కార్యక్రమాన్ని తీసుకురానున్నట్లు ప్రకటించారు. ఈ పథకం కింద పట్టణ పేదలకు చౌకగా ఇళ్లు ఇస్తామని తెలిపారు. రానున్న ఐదేళ్లలో మురికివాడలు లేని దేశాన్ని తయారు చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.

ఆర్థిక రంగంలో సంస్కరణలను ఉధృతంగా అమలు చేస్తామని చెప్పారు. ఒకవైపు ప్రభుత్వ రంగ పెట్టుబడులు పెంచుతూనే మరోవైపు పెట్టుబడుల ఉపసంహరణ కొనసాగుతుందని ప్రకటించారు. ఇనిషియల్‌ పబ్లిక్‌ ఆఫర్‌ మార్గంలో ప్రభుత్వ రంగ సంస్థల్లో ఈక్విటీలను 49 శాతానికి పరిమితం చేస్తామని చెప్పారు. ప్రభుత్వ వాటాలు 51 శాతానికి తగ్గబోవని తెలిపారు.

ఉగ్రవాదాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. దేశ అంతర్గత భద్రతకు వాటిల్లే ముప్పును ఎదుర్కొనేందుకు ప్రభుత్వం ఇప్పటికే ఒక నిర్దిష్ట కాలపరిమితితో కూడిన కార్యాచరణను రూపొందించిందని చెప్పారు. మాజీ సైనికోద్యోగులకు 'ఒకే ర్యాంకు-ఒకే పింఛను' అంశాన్ని ఈ నెలాఖరులోగా పరిష్కరిస్తామని చెప్పారు. పౌరలందరికీ గుర్తింపు కార్డులు ఇస్తామని పేర్కొన్నారు. ఆరు నెలల్లో న్యాయ సంస్కరణలకు మార్గదర్శిక ప్రణాళిక రూపొందిస్తామన్నారు.

పొరుగు దేశాలతో ఉన్న అన్ని వివాదాలనూ పరిష్కరించుకోవడానికి తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. పాక్‌ లోని ఉగ్రవాద శిబిరాలపై పాకిస్థాన్‌ చిత్తశుద్ధితో చర్యలు తీసుకునేదాన్ని బట్టి ఆ దేశంతో సంబంధాల్లో మార్పులుంటాయని చెప్పారు. సార్క్‌ దేశాల్లో సుస్థిరత, సౌభాగ్యాలను భారత్‌ కాంక్షిస్తోందని అన్నారు.

విదేశీ బ్యాంకుల్లో మూలుగుతున్న నల్ల ధనాన్ని వెలికి తీసేందుకు తమ ప్రభుత్వం ప్రత్యేక కృషి జరుపుతుందని స్పష్టం చేశారు. 2004లో ఏర్పడిన ప్రభుత్వం 'సమష్టి సమాజం, ఆర్థిక వ్యవస్థ' కోసం ఒక దృక్కోణాన్ని దేశం ముందు ఉంచి, దాని కోసం కృషి చేసిందని పేర్కొన్నారు. ప్రజలు ఇచ్చిన తీర్పు..ఆ విధానానికి లభించిన విశేష మద్దతుకు సూచిక అన్నారు. మరిన్ని లక్ష్యాలు సాధించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X