హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైయస్ వ్యాఖ్యలపై చెప్పలేను: డిఎస్

By Staff
|
Google Oneindia TeluguNews

D Srinivas
హైదరాబాద్‌: తెలంగాణపై శాసనసభలో ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి చేసిన వ్యాఖ్యలపై తానేమీ చెప్పలేనని ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డి.శ్రీనివాస్ అన్నారు. తాను శాసనసభలో లేనని, టీవి కూడా చూడలేదని, అందువల్ల తానేమీ వ్యాఖ్యానించలేనని ఆయన గురువారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. ముఖ్యమంత్రి ఏ సందర్భంలో ఎలా మాట్లాడారో తనకు తెలియదని ఆయన చెప్పారు. అదే సమయంలో ఆయన తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె.చంద్రశేఖర రావుపై నిప్పులు చెరిగారు. తమ బిక్షతోనే కాంగ్రెసు 2004లో గెలిచిందని కెసిఆర్ అంటున్నారని, ఇప్పుడు తాము ఎవరి సహాయం లేకుండా గెలిచాం కదా అని ఆయన అన్నారు.

తెలంగాణవాదాన్ని తక్కువచేసేలా కాంగ్రెసు ఎప్పుడు కూడా మాట్లాడలేదని, కాంగ్రెసు తెలంగాణను వదిలేయలేదని, తెలంగాణకు కాంగ్రెసు అనుకూలంగానే ఉందని ఆయన చెప్పారు. తెలంగాణ వాదాన్ని నీరు గార్చాలని కాంగ్రెసు ప్రయత్నించలేదని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ అంశాన్ని కాంగ్రెసు పార్టీ జాగ్రత్తగా పరిశీలిస్తోందని, పద్ధతి ప్రకారం వెళ్లాలనేది కాంగ్రెసు ఉద్దేశ్యమని ఆయన అన్నారు. తాము తెలంగాణకు వ్యతిరేకంగా లేమని, అనుకూలంగానే ఉన్నామని ఆయన చెప్పారు. తెలంగాణ అంశాన్ని జాగ్రత్తగా పరిశీలించి ముందుకు అడుగేయాలనే ప్రభుత్వం రోశయ్య కమిటీని వేసిందని ఆయన చెప్పారు.

తెలంగాణపై తెరాసకు చిత్తశుద్ధి ఉంటే రోశయ్య కమిటీలో చేరాలని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఉన్న ఆటంకాలను, దానిపై ఉన్న అపోహలను తొలగించేందుకే రోశయ్య కమిటీని వేసినట్లు ఆయన తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకే కమిటీని వేశామని ఆయన చెప్పారు. హైదరాబాదు నుంచి వెళ్లగొడతామని అంటున్నారని, దాని వల్ల ఏర్పడిన ఇతర ప్రాంతాల ప్రజల అపోహలను తొలగించాల్సిన అవసరం ఉందని, హైదరాబాదులో ఎవరైనా ఉండవచ్చుననే విషయాన్ని స్పష్టం చేయాల్సి అవసరం ఉందని, వీటన్నింటినీ రోశయ్య కమిటీ పరిశీలిస్తుందని ఆయన చెప్పారు. తెలంగాణ ఇవ్వడానికే రోశయ్య కమిటీని వేసినట్లు ఆయన చెప్పారు. ప్రజాస్వామ్య పద్ధతిలో అభిప్రాయాన్ని కూడగట్టడానికి కమిటీ ప్రయత్నిస్తుందని ఆయన చెప్పారు.

తెరాస అధ్యక్షుడు కెసిఆర్ కు నిబద్ధత లేదని, అర్హత లేదని, కెసిఆర్ ఆర్హతను కోల్పోయారని ఆయన అన్నారు. ఉద్యమాన్ని చాలా జాగ్రత్తగా నడపాల్సి ఉంటుందని, అది తమాషా కాదని ఆయన అన్నారు. కెసిఆర్ భాష, వ్యవహార శైలి ఏ మాత్రం బాగా లేదని ఆయన అన్నారు. తెలంగాణవాదాన్ని కెసిఆర్ నిర్వీర్యం చేశారని ఆయన విమర్శించారు. 2004లో 46 సీట్లిస్తే 25 గెలిచారని, ఇప్పుడు కెసిఆర్ 50 సీట్లకు పోటీ చేసి పది గెలిచారని, కనీసం ఆ 25 సీట్లను కూడా నిలబెట్టుకోలేదని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X